కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. వరికి మద్దతు ధర ఇస్తూ, ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో రైతులంతా వరి వైపే మొగ్గుచూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో పాటు కావాల్సిన సౌకర్యాలు ఈ పంటకు ఉండడంతో ప్రతి సీజన్‌లో లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. బాయిల్డ్ రైస్ వద్దని ఎఫ్‌సీఐ చెప్పడంతో ఇప్పుడు రెండో పంట రబీ సీజన్ గందరగోళంలో పడింది. ఎందుకంటే ఖరీఫ్‌లో బాయిల్డ్ రైస్ తక్కువగా వస్తాయి.
రబీలో దాదాపు ఎనభై శాతం బాయిల్డ్ రైసే వస్తుంది. దీంతో ఈ వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు కూడా కొనుగోళ్లు చేయలేరు. ప్రభుత్వం కొనుగోలు చేసినా.. ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. పోనీ సన్న రకాలకు వెళ్దామన్నా రబీ సీజన్‌లో ఎండ తాకిడికి దిగుబడి రాదు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను తీసుకువెళ్లాలి. ఇది సాధ్యమవుతుందా? లక్షల ఎకరాల్లో రబీ సీజన్‌లో వరి సాగు చేసే రైతులు ఉన్నపళంగా వేరే పంటకు వెళ్లడం అసాధ్యం. గతంలో సర్కారు క్రాప్ కాలనీల పేరుతో నియంత్రిత సాగు పేరుతో రైతులు వేసే పంటల పై పరోక్షంగా ఆంక్షలు విధించాలని చూసింది. ఎక్కువ మొత్తంలో సాగవుతున్న వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని భావించింది. కానీ రైతులు వినలేదు. ఆఖరికి ఇక ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వం వల్ల కాదు అని సీఎం కేసీఆర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
అయినా రైతులు వినలేదు. ఇప్పుడు పరిస్థితి పీకలమీదకు వచ్చింది. రబీ సీజన్ మొత్తం గందరగోళంలో పడే పరిణామాలు ఏర్పడనున్నాయి. విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా సర్కార్ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రైతుల మధ్య నలిగిపోనుంది. రబీలో వరి సాగును కంట్రోల్ చేయాలంటే అంతా ఆశామాషీ పని కాదు. విత్తన తయారీ సమస్యలు, అగ్రికల్చర్, సివిల్ సప్లయిస్.. సమన్వయంతో పని చేసి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులను అవగాహన పర్చాలి. వేరే ఏ పంటలు వేసుకుంటే గిట్టుబాటు ధర వస్తుందో చెప్పగలగాలి. రైతు వేదికలు దీనికోసమే ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు అవీ వినియోగంలోకి రాలేదు. రైతు సమన్వయ సమితి కమిటీలు కూడా ఇందుకోసమే. కానీ ఆ కమిటీలు పేరుకు, పదవులకే పరిమితమయ్యాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. సర్కార్ వరి సాగు పై ఓ రకంగా యుద్ధమే చేయాల్సి ఉంది. రైతుల మద్దతు కూడగట్టాల్సి ఉంది.
