రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ పెను సంచలనం. ఎన్నడూ లేని విధంగా.. ఎక్కడా జరగని విధంగా ఒక ఉప ఎన్నిక నేపథ్యం భారీ సంస్కరణలకు తెర తీసింది. పాలకవర్గం మొత్తం దృష్టి తనవైపు తిప్పుకుంది. పరిపాలకుడే స్వయంగా ఓ నియోజకవర్గ సంక్షేమ మంత్రిగా మారాడు. కొత్త పథకాలు పురుడు పోసుకున్నాయి. పాత పథకాలు పరుగులు పెట్టాయి. పడకేసిన హామీలు నిద్రమత్తు వదిలి మేలుకొన్నాయి. ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలనే జిద్దు మీద సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్న తీరు.. శక్తులను ప్రయోగించిన విధానం, తన విశ్వరూపాన్ని చూపించే క్రమంలో హుజురాబాద్ పై పెట్టిన ప్రత్యేక నజర్ ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు.. రాష్ట్రానికీ మేలు చేస్తున్నది.
మొన్నటి వరకు రేపో మాపో ఎన్నికలు జరుగుతాయనే తరహాలో ప్రభుత్వం స్పందించింది. పదవుల వలవేసి నాయకులను గుంజుకున్నది. దళితబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఆ సామాజికవర్గానికి ఎంతో మేలు చేస్తున్నది. ఇది హుజురాబాద్‌కే పరిమితం కాకూడదనే డిమాండ్ వెల్లువలా వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దళితుడికీ ఈ పథకం అందించాల్సిన అనివార్యతను కూడా ఈ ఉప ఎన్నిక క్రియేట్ చేసింది. ఇప్పుడు కొత్తగా బీసీబంధు తెరపైకి వచ్చింది. సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీ కులాలు తమకూ బీసీబంధు కావాలనే డిమాండ్‌ను చేస్తూ వస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఓకే చెప్పింది.
అది ఎప్పుడు అమలవుతుందో తెలియదు కానీ, చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 57 ఏండ్లకు కుదించిన హామీ కూడా అటకపై నుంచి దిగి గుమ్మం దాకా వచ్చింది. మరో మూడు నెలల పాటు ఈ ఎన్నిక వాయిదా పడడం హుజురాబాద్ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ మంచిదే. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి.. ఆ తర్వాత మరిచి రాజకీయ నిరుద్యోగులకు పదవుల ఉద్యోగాలిచ్చి హుజురాబాద్‌లో గెలుపే ధ్యేయంగా శ్రమిస్తున్న ప్రభుత్వం ఈ ఎన్నిక వాయిదా కారణంగా రేపు నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయాల్సి వస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్ ఈ ఎన్నికలోపే రావాలి. డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ ప్రవేశాలు మెజారీటిగా ఈ ఎన్నికలోపే జరగాలి. కటాఫ్ డేట్ ఎత్తి వేసిన బీడీ కార్మికులకు జీవనభృతి ఈ ఎన్నికలోపే అందాలి. సొంత ఇండ్ల స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5లక్షలు ఇస్తామన్న హామీ ఈ లోపే అమలు జరగాలి. హరీశ్ చెప్పినట్టుగా కల్యాణలక్ష్మి కింద ఇచ్చే నగదును పెంచాలి. కొత్త పథకాలకు మేథోమథనం జరగాలి.
తెల్లారి లేస్తే కేసీఆర్ ఓ కొత్త పథకం ప్రవేశపెట్టాలి. ఎన్నిక జరిగే లోపు హుజురాబాద్ కేంద్రంగా తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు, కొత్త పథకాలు దేశానికే ఆదర్శం కావాలి. అందరు మనవైపే చూడాలి.
మనం మాత్రం హుజురాబాద్ వైపు చూడాలి. కేసీఆర్ నోటి వెంట ఏ రోజు ఏ వరం వస్తుందో ఆశగా ఎదురుచూడాలి. అది అందే వరకు ఓపిక పట్టాలి. అప్పటి వరకు టీఆరెస్‌ను ఆశీర్వదిస్తూనే ఉండాలి.