ఆ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రికీ కుక్క‌లంటే ప్రాణం. ఉన్న ఒక్క‌గానొక్క కూతురు ఉన్న‌త చ‌దువుల‌కు అమెరికా వెళ్లింది. ఇద్ద‌రే ఉంటారాయింట్లో. ఇద్ద‌రికీ కుక్క‌లంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. అందుకే.. ఒక‌టి కాదు రెండు కాదు మూడు (బ్రీడ‌ల్‌) కుక్క‌ పిల్ల‌ల‌ను పెంచుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్న పిల్ల‌ల‌కు తినిపించిన‌ట్టు గోరుముద్ద‌లు తినిపిస్తూ కాల‌క్షేపం చేస్తారు. వాటి పెంప‌కంలోనే కాలాన్ని మైమ‌ర‌చిపోతారు. ఆనందాల‌ను వెతుక్కుంటారు. అంత‌కంటే సంతోషం మ‌రేది లేద‌నే మరో ప్ర‌పంచంలో బ‌తుకుతారు. భార్య ప్ర‌భుత్వ ఉద్యోగి. ఓ శాఖ‌లో ఉన్న‌తాధికారి. భ‌ర్త బిజినెస్ చూసుకుంటాడు.

అనుకోకుండా వ‌చ్చిన వైర‌స్ ఆ కుక్క‌ల పాలిట య‌మ‌పాశ‌మైంది. ఈ హ‌ఠాత్ప‌రిమాణం వారు ఊహించ‌లేదు. ప్రాణాలు విల‌విల‌లాడాయి. ఆస్ప‌త్రుల‌కు తిప్పారు. చికిత్స‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. ఆ వైర‌స్ ఒక్క‌దానికి వ్యాప్తి చెందిదే .. మిగిలిన వాటినీ వ‌ద‌ల‌వ‌ట‌. ఒక‌టి నుంచి మ‌రొక‌టికి. అలా వ‌రుస‌గా మూడు కుక్క‌లు క‌ళ్ల ముందే చ‌నిపోయాయి. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రినీ క‌న్నీటి సంద్రంలో ముంచి. ఇదేంటి? కుక్క‌లు చ‌నిపోతే ఇంత బాధ‌ప‌డాలా? మ‌రీ టూ మ‌చ్‌. అనిపిస్తుందా. కానీ కొంద‌రి మ‌న‌స్త‌త్వాలంతే. అంద‌రూ మ‌న‌లా ఉండ‌రు. కొంత మందికి అవి కుక్క‌లు కాదు. వారి పిల్ల‌లు. క‌న్న పిల్ల‌ల‌తో స‌మానం. అందుకే ఆ బాధ‌. అది భ‌రించేవారికే తెలుస్తుంది. ఆ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ తేరుకోలేదు కొద్ది రోజుల పాటు. భార్య త‌న డ్యూటీలో బిజీ అవ‌సాగింది. వాటికి జ్ఞాప‌కాల మరిచిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తూ. కానీ ఆ భ‌ర్త మాత్రం వాటిని మ‌రిచిపోలేక‌పోతున్నాడు. అన్నం స‌హించ‌దు. నిద్ర రాదు. వాటి త‌ల‌పే. వాటి మ‌నాదే. అలా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. నెల రోజుల పాటు ఆయ‌న అన్నపానీయాలు మానేశాడు. నిద్రాహారాలు లేకుండా బ‌క్క‌చిక్కిపోయాడు. చిక్కిశ‌ల్య‌మ‌వ‌సాగాడు. ప‌ది కిలోల బ‌రువు దిగిపోయాడు.

వారి అపార్టుమెంటు కింద వీధికుక్క‌లుంటాయి. వాటికీ అప్పుడ‌ప్పుడు అన్నం పెట్టేవారిద్ద‌రు. అలా వాటినీ మ‌చ్చిక చేసుకున్నారు. ఇప్పుడ‌వే ఆ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రికీ పెంపుడు కుక్క‌ల‌య్యాయి. దాదాపు ప‌ది వ‌ర‌కు ఉంటాయ‌వి. వీరిద్ద‌రినీ చూడ‌గానే తోకూపుకుంటూ కుయ్యు..కుయ్యు మ‌ని గారాలుబోతూ .. కాళ్ల మ‌ధ్య‌లో తిరిగాడుతూ త‌మ మ‌మ‌కారాన్ని ప్ర‌ద‌ర్శిస్తాయి. విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇప్పుడు పెంపుడు కుక్క‌లు త‌మ‌ను వ‌దిలి వెళ్లిపోయిన బాధ‌ను మ‌రిచిపోయేందుకు ఈ వీధికుక్క‌లే వారికి స్వాంత‌న చేకూరుస్తున్నాయి. వాటి సాంగ‌త్యంలో వారిని వెంటాడుతున్న చేదు జ్ఞాప‌కాల‌ను వీడి.. కొత్త జీవితానికి, కొత్త అనుభూతి కోసం ఆ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ప్ర‌య‌త్నిస్తున్నారు.

You missed