‘ఈటల రాజేందర్ ఓ బచ్చా, వాడితో వచ్చేది లేదు.. సచ్చేది లేదు.’ ఇదెవరన్నరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా.
కానీ మొన్నటి వరకు నేను కేసీఆర్ కారణజన్ముడనుకున్నాను. ప్రాణాలకొడ్డి తెలంగాణ సాధించాడు. అదో చరిత్ర. ఆయనకు ఆ చరిత్రలో కొన్ని ప్రత్యేక పేజీలుంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మరి ఆ తెలంగాణ జాతిపిత ఇట్ల ‘పిస పిస’ ఎందుకు చేస్తున్నాడు. గత్తర బిత్తర ఎందుకు తయారయ్యాడు. భయం భయంగా ఎందుకుంటున్నాడు? నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నాడు. ఎప్పుడూ ఈటల రాజేందర్‌ను ఎందుకు కలవరిస్తున్నాడు?
‘హుజురాబాద్.. హుజురాబాద్ ..’ అంటూ క్షణక్షణానికి ఎందుకు జపం చేస్తున్నాడు?
కారణం ఒక్కడే.. ఒకే ఒక్కడు…
అతడే ఈటల రాజేందర్. బక్క పల్చటి ప్రాణం. ఓ బీసీ. కుల బలం లేదు. ఓ ఫారం కోడి. కానీ కొండను ఢీ కొడ్తున్నాడు. ‘ఏమిటా ధైర్యం? ఏమా బలుపు? ఏమా కండకావరం?’ అర్థం కావడం లేదు అందరికీ. కానీ కేసీఆర్ కు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ‘అంత సీనుందా?’ ఈటలకు. ‘నేను మొన్నటి వరకు కారణజన్ముడనుకున్న కేసీఆర్‌కు ఇంతలా వణుకు ఎందుకు? ఆఫ్ట్రాల్ హుజురాబాద్ కోసమా?’
‘ హతవిధీ..!’
‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు..’ ఇదేం పాడుకాలం దాపురించెరా మా టీఆరేస్ కు. మా నాయకుడి స్టామినా ఏందీ? ఈటల సడలిన కండరాల బలమేందీ? దేశానికి ఆదర్శంగా నిలిచిన మా మేథస్సెంది? కోళ్ల ఫారం స్థాయి దాటని ఈటల ఆలోచనల స్థాయి ఏందీ? మరెందుకు మా సారు భయపడుతున్నాడు?
అన్నీ హుజురాబాద్‌కే ఎందుకిస్తున్నాడు?
పడకేసిన పథకాలు అక్కడే ఎందుకు పరుగులు పెడుతున్నాయి?
రాజకీయ ‘నిరుద్యోగులకు’ అక్కడనే ఎందుకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి? ‘నిరుద్యోగభృతి’ ఆ నాయకులకే ఎందుకు అమలవుతున్నది?
కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, రమణ, గెల్లు శ్రీనివాస్, బండ శ్రీనివాస్, వకుళాభరణం…. ఇంతటి భావదారిద్రం, భయ కంపితం సారులో నేనెప్పుడూ సూడలే. ఇప్పుడు నాకు కారణజన్ముడిగా ఈటల కనిపిస్తున్నడేందీ? ఈటలకు అంత సీనుందా? లేదు. మరి.
మనమే ‘సీను’ కల్పిస్తున్నాం.. హీరోను చేస్తున్నాం
అతన్ని మన చేతులారా మనమే
గె..లి..పి..స్తు… న్నాం…