‘సీఎం.. నీ బద్దలు భాషింగాలు చేస్తాం…’ హుజురాబాద్ ప్రెస్‌మీట్‌లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాటలివి. దళితబంధు ప్రతి దళితుడికీ అమలు చేయకపోతే ‘బద్దలు బాషింగాలు చేస్తాం’ అనే మాటలను వాడాడు. ‘సిగ్గుశరం ఉందా? , దరిద్రుడా, బక్కోడా, ఒరేయ్….’ ఇలా చాలా మాటలే అన్నాడు. గతంలోనూ ఈ భాషను విరివిరిగా వాడాడు. కొత్తగా ఇప్పుడు బద్దలు భాషింగాలు చేస్తామని ఏకంగా సీఎంను ఉద్దేశించి మాట్లాడటం రోజు రోజుకు పెరుగుతున్న నేతల భాషా పరిజ్ఞాన పరిపక్వతకు అద్దం పడుతున్నది.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఈ డైలాగ్ వాడారు. మంచి స్పందనే వచ్చింది. తెలంగాణ పల్లెల్లో అక్కడక్కడా ఇప్పటికీ వాడుతారు. ‘నీ పని చేస్తాం’, .’నీ కథ ముగిస్తం..’, ‘నీకుందిరో..’ అనే అర్థం కింద దీన్ని తీసుకుంటారు. కానీ, ఇదో ‘పచ్చి బూతు’ పదం. దీన్ని ఓ ఎంపీ ప్రెస్‌మీట్లో.. అదీ సీఎంకు అన్వయిస్తూ మాట్లాడటం ఇక్కడి నేటి రాజకీయాల ఎదుగుదలకు ఓ నిదర్శనం.
కేసీఆర్ అంటే కోపమున్నోళ్లో.. టీఆరెస్ అంటే పడనోళ్లో.. బీజేపీ అభిమానులో… ఇలాంటి మాటలను ఎంజాయ్ చేస్తారు కావొచ్చు. కానీ ఇవే మాటలు టీఆర్ఎస్ శ్రేణులు మోదీనుద్దేశించి మాట్లాడితే… అక్కడి సెక్షన్ తట్టుకోదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకునే క్రమంలో ఎంతటి తిట్లైనా అవలీలగా వాడేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదో కొత్త ట్రెండ్..
ఓ అర్వింద్.. ఒక బండి సంజయ్… ఒక తీన్మార్ మల్లన్న, ఓ మైనంపల్లి హన్మంతరావు.. ఆర్మూర్ జీవన్‌రెడ్డి.. ఇలా ఎవరికి వారే ఈ పంథాను అందిపుచ్చుకుని దూసుకుపోతున్నారు. బాలక్రిష్ణ డైలాగులకు అభిమానులు కేరింతలు కొట్టినట్టు .. వీరి మాటలకు కూడా చప్పట్లు దొరుకుతున్నాయి.
అందుకే ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల కోసం, తమ ఉనికి కోసం, అధికారం కోసం.. పరపతి కోసం…
భాష బట్టలిప్పేస్తున్నారు.
నడి బజార్లో నిలబెడుతున్నారు.
వారికి తెలియకుండా ఎవరికి వారే తమ బట్టలు కూడా విప్పేసుకుంటున్నారు.
జనం వింత చూస్తున్నారు. వింత జంతువుల్లా మారుతున్న నేటి రాజకీయల నాయకుల తీరు పసిగడుతున్నారు.
