దళితబంధును హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని దీన్ని మహా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలనుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. తెలంగాణ ఉద్యమం తరువాత దళితబంధుని ఆ స్థాయిలో మరో ఉద్యమంగా కేసీఆర్ అభివర్ణించాడు. కానీ హుజురాబాద్ ప్రజలే దాన్ని నమ్మడం లేదు. కేసీఆర్ మాటల పై విశ్వాసం పోతున్నది. ప్రతి దళితుడికీ దళితబంధు వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించినా ఆ సెక్షన్ నుంచి అనుకున్న స్థాయిలో టీఆరెస్‌కు మైలేజ్ రాలేదు.
దీంతో కేసీఆర్ కు ఇది ఊహించని పరిణామంగా కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టింది. ‘హుజురాబాద్‌లో సక్సెస్ అయితేనే మనం తలెత్తుకొని నిలబడుగలుగుతా’మని కేసీఆర్ నర్మగర్భంగా మాట్లాడడం .. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అమలు చేయాలంటే భారీ బడ్డెట్ అవసరం పడడం, తదితర కారణాలు దళితబంధు క్రెడిబిలిటీ పై ప్రభావం చూపుతున్నాయి. దళితబంధు వ్యూహం.. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వెనక్కే రావడం పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. దీని విషయంలో నేతల వద్ద ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాడు. విస్తృత ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నాడు.
ప్రభుత్వ ఉద్దేశం, వ్యూహం ఫలించాలనే తాపత్రయంలో కేసీఆర్ ఉన్నాడు. మరోవైపు దళితబంధు ప్రకటించిన మరుసటి రోజు నుంచే ‘బీసీ బంధు’ కావాలని ఆందోళనలు మొదలయ్యాయి. ‘గిరిజన బంధు’ కూడా ఇవ్వాలంటూ ఎస్టీలు ఆందోళన చేస్తున్నారు. ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’ల పేరుతో రేవంత్‌రెడ్డి మీటింగులు పెడుతూ కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ‘పులి మీద స్వారీ’లా దళితబంధు మారిన నేపథ్యంలో ఇప్పుడు కిందికి దిగే పరిస్థితి లేదు కేసీఆర్‌కు.
అలాగే మిగతా సెక్షన్లలో వస్తున్న వ్యతిరేకత కూడా నష్టం కలిగించేదేనని కేసీఆర్ గుర్తించాడు. అందుకే ఈ రోజు జరిగిన ‘పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం’లో ‘బీసీ బంధు’తో పాటు విడతల వారీగా అన్ని కులాలకు బంధులు ‘ఇచ్చేది మేమే.. ఇస్తామంటూ’ కేసీఆర్ అన్నట్లుగా కొన్ని మీడియా ఛానల్‌లలో వచ్చింది. దళితబంధు అసలు ఉద్దేశం నెరవేరి అటు దళితులకు, ఇటు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం ఈ ‘బంధు’ల గందరగోళ ‘అగాథం’లోకి పడిపోయాడు.
