దళిత బంధు పథకం ప్రకటించిన మరు క్షణం నుంచి కేసీఆర్‌ను ఆత్మ సంరక్షణలో పడేస్తూ, ఈ పథకం అమలు తీరుపై అనుమానాలతో కూడిన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చాడు మందకృష్ణ మాదిగ. పలు ప్రశ్నలను స్పందిస్తూ మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలు చర్చకు తెరతీశాయి. వివాదానికి దారి తీశాయి. మందకృష్ణ అడిగిన ప్రశ్నలు సూటిగా కేసీఆర్‌కు తగిలాయి. ఈ పథకం ఉద్దేశ్యాన్ని ప్రశంసిస్తూనే.. కేసీఆర్ పట్ల తన గత అనుభవాలు, తన జాతి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని ఎండగట్టి ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాడు.
ఒక దశలో ఈ పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టినా.. ఆ తర్వాత మందకృష్ణ ఇచ్చే పిలుపుకు, చేసే కామెంట్లకు తాము అనుకున్న ఉద్దేశ్యం నెరవేరడం కష్టమనే భావనలో ప్రభుత్వం పడింది. మందకృష్ణ సందించిన ప్రశ్నల గాఢతను, తీవత్రను పసిగట్టిన కేసీఆర్ అది తమకు వ్యతిరేకంగా మారకుండ ఉండేందుకు తలొగ్గాల్సిన పరిస్థితికి వచ్చాడు. ‘రైతుబంధు మాదిరిగా అందరికీ ఇచ్చినట్లుగా మాకెందుకు దళితబంధు ఇవ్వర?’ని మందకృష్ణ ప్రధానంగా సందించిన డిమాండ్‌లలో ఒకటి.
‘పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు అమలు చేశారు. మా ఎస్సీలలో అంత పెద్ద భూములున్న వారు ఎవరుండరు. ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మరెందుకు మాకు వర్తింపజేయరు?’ అని ప్రశ్నించాడు. కేసీఆర్ సైతం దీన్ని అంగీకరించాడు. ఈ రోజు ప్రకటించిన దళిత బంధు పథకం ప్రారంభోత్సవంలో ప్రతి కుటుంబానికి, అందులో ఉద్యోగులకు కూడా ఇస్తామన్నాడు. ‘సీఎంవోలో ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా?’ అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించాడు. రాహుల్ బొజ్జాను తన సీఎంవో సెక్రెటరీగా నియమిస్తున్నట్లు కేసీఆర్ హుజురాబాద్ వేదికగా ప్రకటించాడు.
ఇటీవల రసమయి సాంస్కృతిక సారధి చైర్మన్ పదవికి కేబినెట్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో కేబినెట్ విస్తరణలో భాగంగా ఒకరిద్దరు ఎస్సీలను కూడా చేర్చుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, పార్టీ బలోపేతం ప్రణాళికలు ఎవరి అంచనాకు అందవు. కానీ అప్పుడప్పుడు ఆయన వ్యూహాలు కూడా బెడిసికొడుతూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి కొన్ని డిమాండ్లకు తలొగ్గాల్సి ఉంటుంది.