కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం ఎవరూ ఊహించని రీతిలో అందరికీ వర్తింపజేయడం తో ఆ సామాజిక వర్గం నుంచి హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. అర్హులెవరో తేల్చే పనిలో కొత్త పంచాయతీకి తెర లేచిన నేపథ్యంలో అసలు ఉద్దేశ్యానికి గండి పడుతుందని కేసీఆర్ భయపడ్డాడు. ఇంత రిస్కు తీసుకుని త్వరలో ఉప ఎన్నిక జరగబోయే ఈ వేదిక మీదుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తే ఆ సెక్షనే దీన్ని చీల్చి చెండాడేస్తున్నదన్న ఆందోళన కేసీఆర్‌లో కలిగింది. అందుకే ఈ రోజు ఆయన దీన్ని రైతుబంధు తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రతి దళిత కుటుంబానికీ ఇస్తానని ప్రకటించి నిప్పు మీద నీళ్లు చల్లాడు.
గంపగుత్తగా దళితుల ఓట్లు టీఆరెస్‌కు పడతాయనడంలో ఇక సందేహం లేదు. దీంట్లోనే ఆయన ఓ మేలిక పెట్టాడు. ‘నిబంధనలు వర్తిస్తాయి’ అనే తరహాలో హుజురాబాద్ దళితబంధు ఓ ‘ప్రయోగశాల’ అని చెప్పాడు. ఆ ‘ప్రయోగం’ ఫలప్రదం కావాలని, కానీ విఫలం కాకూడదని ఆయన నొక్కి చెప్పాడు. ఇక్కడ సక్సెస్ అయితేనే మిగిలిన 118 నియోజకవర్గాల్లో కూడా విజయవంతంగా అమలవుతుందని చెప్పకొచ్చాడు. అదే సమయంలో బీసీల ఓట్లు దూరం కాకూడదనే వ్యూహంలో భాగంగా ‘ఎన్నో పథకాలు గతంలో ఇతర సెక్షన్ల కు చేరవేశామని, అప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదని పరోక్షంగా దళిత బంధు పట్ల బీసీలు, ఇతర వర్గాలు ద్వేషం పెంచుకోకూడదనే సందేశం ఇచ్చాడు.
అయితే రైతుబంధు తరహాలో అన్ని నియోజకవర్గాల్లో, ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందుతుందా? అనేది హుజురాబాద్ ఎన్నికల తర్వాత తేలనుంది. కాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఈటల రాజేందర్ వల్ల సాధ్యమైందని బీజేపీ వర్గాలు సోషల్ మీడియాలో తమదైన స్టైల్లో చెప్పుకుంటున్నాయి.
