నేటి తరం ప్రేమ వ్యవహారాలు హింసలకు దారి తీస్తున్నాయి. భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోలేని యువత ఆకర్షణకు లోనై దానికి ప్రేమ అనే పేరు పెట్టి అదే లోకంగా బతికి చివరికి వారి జీవితాలు ఆ లోకంలోనే విషాదాంతాలుగా ముగుస్తున్నాయి. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం ఓ మధురానుభూతి. పెళ్లైన తర్వాతా అదే వ్యవహారాన్ని కొనసాగిస్తే కొత్త బంగారు లోకం కాలరాసినట్లవుతుంది. బంగారు భవిష్యత్తు భుగ్గిపాలవుతుంది.
ప్రేమ మైకం వీడకపోతే అది ప్రాణం తీస్తుంది. ఆ మత్తు నుంచి బయటపడకపోతే నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. సినిమాలు, ఇంటర్నెట్‌ల ప్రభావం యువతను తీవ్రంగా పెడదోవ పట్టేలా చేస్తున్నాయి. హింసాత్మక ఆలోచనలకు బీజం పోస్తున్నాయి. ఇవి ఇంతటితో ఆగవు. ఇంకా రెచ్చి రెట్టింపవుతాయి. హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఓ ప్రేమ హత్యోదంతం నేటి ప్రేమల అపరిపక్వతను సూచిస్తున్నాయి. ఎదగని మానసిక బుద్ధిని పట్టిస్తున్నది. హింసాత్మక పెడదోరణిల మనస్తత్వాలకు అద్ధం పడుతున్నది.
ఝార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌కు చెందిన 21 ఏళ్ల మహిళకు అదే ప్రాంతంలోని రాజేంద్రన్ వర్మతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. ఈ దంపతులు కొన్నిరోజుల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. జీడిమెట్ల డివిజన్ వినాయకనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఆమె నగరానికి వచ్చిన తర్వాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుతుండేది.
నువ్వు ఎక్కడ ఉంటున్నావ్.. అని అతడు ఆమెను ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు. ఎట్టకేలకు ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్‌బాద్ నుంచి ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని ప్రియురాలు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. తనతో ధన్‌బాద్ రావాలని పట్టుబట్డాడు. తన భర్తకు తెలిస్తే ఇద్దరినీ చంపేస్తాడంటూ ఆమె బదులిచ్చింది. అతడితో వెళ్లడానికి ఆమె ససేమిరా అన్నది. ఈ విషయం పై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
రాకేష్‌తో ఝార్ఖండ్ నుంచి వచ్చిన యువకుడు సదరు మహిళ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్ దిండుతో ఆమె ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె భర్త రాజేంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
