(మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు)

 

ఊరంతా శ‌కునం చెప్పిన బ‌ల్లి కుడితిలో ప‌డింద‌న్న చందాన్ని త‌ల‌పిస్తుంది… సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డుతున్న హై లిట‌రేట్లు, మేథావుల‌ను చూస్తుంటే. అతి తెలివి, అత్యాశ గ‌ల‌వారు సైబ‌ర్ క్రిమిన‌ల్స్ వ‌ల‌లో ప‌డి కోట్లు పోగొట్టుకుంటున్నారు. అదిగో వ్యాపారం.. ఇదిగో లాభం అంటూ సైబ‌ర్ మాయ‌గాళ్లు కోట్లు కొల్ల‌గొడుతున్నారు. ఆర్థిక నేర‌గాళ్ల‌ను క‌ట‌క‌టాల్లోకి తోసి బ‌డా నాయ‌కుల‌కు సైతం సంకెళ్లు వేసిన నాటి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ బ‌ల్లి శ‌కునాన్ని త‌లపిస్తూ సైబ‌ర్ ముఠా గురికి బ‌ల‌య్యారు. ఆయ‌న భార్య పేరిట మాయ‌గాళ్ల వాట్సాప్ గ్రూపులో చేరి న‌కిలీ స్టాక్ మార్కెట్లో డ‌బ్బులు గుమ్మ‌రించి రూ. 2.50 కోట్లు కోల్పోయిన ఉదంతం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. అన్నీ తెలిసీ అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేస్తూ చివ‌ర‌కు ఆయ‌న కుటుంబ‌మే సైబ‌ర్ వ‌ల‌లో చిక్కుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది.

స్టాక్ మార్కెట్లో బుల్స్.. బేర్స్ అంటే ఎద్దులు, ఎలుగుబంట్లే కాదు.. రాబందులూ ఉంటాయ‌న్న విష‌యాన్ని జేడీ ల‌క్ష్మీనార‌య‌ణ కుటుంబం ఎందుకు మ‌రిచిపోయిందో..? అర్థం కాని ప‌రిస్థితి. పోలీసుల ఎఫ్ ఐఆర్‌ను ప‌రిశీలిస్తే.. అత్యంత తెలివి ప‌రుల‌ను కూడా ఇంత తేలిక‌గా బురిడీ కొట్టించొచ్చా..? అనే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. వాస్త‌వానికి, స్టాక్ మార్కెట్లో ఆన్‌లైన్ ట్రిప్స్, ట్రేడింగ్‌ పేరిట అక్క‌డ‌క్క‌డ‌ మోసాలు జ‌ర‌గ‌డం చూస్తుంటాం. కానీ, ఒక న‌కిలీ వాట్సాప్ గ్రూపు సృష్టించి, స్టాక్ మార్కెట్ పేరిట ఒక ట్రెంజ‌ర్ హంట్ వెబ్‌సైట్‌ను రూపొందించి అందులోకి జేడీ కుటుంబాన్ని లాగ‌డ‌మే ఇక్క‌డ పెద్ద ట్విస్ట్‌. విచిత్ర‌మేమిటంటే.. సాధార‌ణ వ్య‌క్తైనా స‌రే, నిర‌క్ష‌రాస్యులు, తెలివి త‌క్కువ వారైనా సెబీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోని కంపెనీలలో లేదా బ్యాంకుల‌లో డీమెటీరియ‌లైజ్డ్ డాక్యుమెంట్ అకౌంట్‌.. అంటే డీమాట్ అకౌంట్ల‌ను ఓపెన్ చేసుకుని .. త‌మ అకౌంట్ల‌ను తామే స్వ‌యంగా ఆప‌రేట్ చేసుకుంటారు. సెబీ రిజిష్ట‌ర్డ్ విశ్లేష‌కులు లేదా మార్కెట్ అన‌లిస్టులు వివిధ సంస్థ‌ల ద్వారా టిప్స్ తీసుకుని కొన్ని కంపెనీల‌లో క్ర‌య‌విక్ర‌యాలు కొన‌సాగిస్తుంటారు. కానీ, జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ, ఆయ‌న భార్య ప్ర‌మీల విష‌యంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది.

స్టాక్ మార్కెట్ గైడింగ్ ఎక్స్చేంజ్ గ్రూపు పేరిట ఒక అనామ‌కులు, మాయ‌కులు సృష్టించిన వాట్సాప్ గ్రూపులో జేడీ కుటుంబం చేర‌డ‌మేమిటీ? ఊరు, పేరులేని కంపెనీల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డ‌మేమిటీ? ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్(ఐపీవో) విష‌యం తెలుసుకోకుండానే ల‌క్ష‌లు గుమ్మ‌రించ‌మేమిటి..? అనేది అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌. ఈ వాట్సాప్ గ్రూపు చాలా ప‌క‌డ్బందీ దినేష్ సింగ్ అనే వ్య‌క్తి ప‌క‌డ్బందీగా ప‌న్నిన వ‌ల‌లో అత్యంత తెలివిప‌రుడైన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌డి విల‌విల‌లాడ‌టం… ఇక సామాన్యుల‌కు ఎక్క‌డ ర‌క్ష‌ణ అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. దినేష్ సింగ్ సృష్టించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ గ్రూపుకు ఎంత వ‌ర‌కు వాలిడిటీ ఉంది..? ఆ గ్రూపులో వ‌చ్చే మెసేజీలు ఎంత వ‌ర‌కు వాస్త‌వమ‌నే విష‌యాన్ని క‌నీసం సెబీ( సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంచ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) రిజిస్ట‌ర్డ్ డీల‌ర్ల ద్వారానైనా జేడీ కుటుంబం ఆరా తీయ‌క‌పోవ‌డం అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామం. స్టాక్ మార్కెట్ ప్రాఫిక్ పేరిట‌, క‌లెక్టివ్ ఇన్వెస్టిమెంట్ చేసి 200 శాతం లాభం చేకూర్చి పెడ‌తామ‌ని .. దినేష్ ముఠా చెప్పిన మాట‌లు, పంపిన సందేశాల‌ను న‌మ్మి జేడీ కుటుంబం వంచ‌న‌కు గురి కావ‌డం సాధార‌ణ ప్ర‌జ‌లు న‌మ్మ‌లేక‌పోతున్నారు.

వాస్త‌వానికి, స్టాక్ మార్కెట్లోగానీ, ఇత‌ర పెట్టుబ‌డుల‌లో కానీ ప్ర‌తీ ఏటా 15 శాతం లాభం రావ‌డం పెద్ద విష‌యం. అంత‌కంటే ఎక్కువ వంద శాతం లాభాలు అని ఎవ‌రు చెప్పినా న‌మ్మ‌డానికి వీలుండ‌దు. అది కూడా మార్కెట్ ప‌రిస్థితులు బాగున్న‌ప్పుడు ఇండెక్స్ షేర్ల‌లోనే ఈ లాభాలు సాధ్యం. కానీ ఎవ‌డో దినేష్ సింగ్ త‌మ‌కు సెబీ రిజ‌ష్ట‌ర్డ్ మెక‌న్లీ కంపెనీ ఉంద‌ని, ఆ కంపెనీ ద్వార పెట్టుబ‌డులు పెట్టి కోట్ల రూపాయ‌లు ఆర్జిస్తున్నార‌ని, డ్యాక్యుమెంట్ల‌తో స‌హా సినిమా చూపించ‌డం, దాన్ని జేడీ కుటుంబం న‌మ్మడం ఒక వింత‌. దినేష్ సింగ్ ఒక ప‌క‌డ్బందీగా ఎంసీకెన్‌కీ బ్రోక‌ర్ స‌ర్వీసును సృష్టించ‌డ‌ము, తాను ఐఐటీ ముంబాయి గ్రాడ్యుయేట్‌న‌ని, యూఎస్‌లో పీహెచ్‌డీ చేశాన‌ని డిగ్రీలు పంప‌డం.. జేపీ మోర్గాన్ మార్కెట్ అన‌లిస్టుగా ప‌నిచేస్తున్నాన‌ని చెప్ప‌డం,ఒక న‌కిలీ డాక్యుమెంట్ల‌ను సృష్టించి పంప‌డం, ఇది నిజ‌మ‌ని జేడీ కుటుంబం న‌మ్మ‌డం పోలీసులను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. దినేష్ అనే వ్య‌క్తి త‌న ఫోన్ నెంబ‌ర్ 9685717841 ఇవ్వ‌డం, మిస్‌కెటీనీ అనే ఒక క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ పాత్ర‌ను సృష్టించ‌డం ఇవ‌న్నీ ఒక మాయ‌ను త‌ల‌పిస్తున్నాయి. దినేష్ సూచించిన కంప‌కోలా బేవ‌రేజెస్, మాతారా, రిసోర్స్ గ్లోబ‌ర్ స‌ర్వీస్ ఇటువంటి కంపెనీల‌లో పెట్టుబ‌డులు పెట్టించి అస‌లుకే మోసం చేస్తారు. నిజానికి అవి ఎక్క‌డా రిజిస్ట‌ర్డ్ అయిన కంపెనీలు కావు. ర‌క‌ర‌కాల కంపెనీల పేర్లు చెప్ప‌డం, జేడీ కుటుంబం డ‌బ్బులు వేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

తాము పెట్టుబ‌డి పెడుతున్న కంపెనీల‌లో 200 శాతం లాభాలు వ‌చ్చిన‌ట్టు దినేష్ సింగ్ సృష్టించ‌డం వెనుక ఉన్న క‌థ‌ను జేడీ కుటుంబం ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది. చివ‌ర‌కు అదంతా దినేష్ సింగ్ కృత్రిమ సృష్టేనని తెలుసుకునే వ‌ర‌కు రూ. 2.50 కోట్లు హాంఫ‌ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆ వెబ్‌సైటూ ప‌నిచేయ‌డం లేదు. పాత్ర‌ల‌న్నీ మాయ‌మైపోయాయి. కంపెనీలు ప‌తాలేవు. చివ‌ర‌కు జేడీ కుటుంబం పోలీస్ స్టేష‌న్‌కు ఎక్కాల్సి వ‌చ్చింది. సైబ‌ర్ రాబందుల వ‌ల‌లో ప‌డి తాము చివ‌ర‌కు తెలివిత‌క్కువ వాళ్లుగా ప‌రువు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని జేడీ కుటుంబం బాధ‌ప‌డుతున్న‌ది. అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేసే జేడీ కుటుంబం అత్యాశ‌కు పోయి.. కోట్ల రూపాయ‌లు పోగొట్టుకున్న‌ది. ఇక సైబ‌ర్ నేర‌గాళ్ల ఫేక్ వెబ్‌సైట్ల‌కు ట్రిప్స్ పేరిట ఓటీపీల‌ను లేదా క్రెడిట్ కార్డుల నెంబ‌ర్ల‌ను తీసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతూనే ఉన్నారు. విచిత్ర‌మేమిటంటే.. ఈ సైబ‌ర్ ముఠాల వ‌ల‌లో ప‌డుతున్న వారంతా ఎక్కువ శాతం సాంకేతిక‌, విద్యా ప‌రిజ్ఞానం ఉన్న‌వాళ్లే. అందులో 30 శాతంపైగా ఐటీ ఉద్యోగులు కావ‌డం విశేషం. సైబ‌ర్ దొంగ‌లు ఉన్నారు జాగ్ర‌త్త అని పోలీసులతో పాటు ఆర్బీఐ, సెబీ వంటి సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్నా… మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. మోస‌పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. ప్ర‌స్తుతం జేడీ క‌టుంబం ఫిర్యాదుపై హైద‌రాబాద్ సైబ‌ర్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుల న‌కిలీ అకౌంట్ల‌పై దృష్టిపెట్టారు. ప్ర‌స్తుతం వెబ్‌సైట్లు గానీ, వాళ్ల ఫోన్ నెంబ‌ర్లు గానీ.. ఏవీ క‌నిపించ‌డం లేదు.. వినిపించ‌డం లేదు. డ‌బ్బుల రిక‌వ‌రీ క‌ష్ట‌మేన‌ని, న‌కిలీ అకౌంట్లు దొరికితే అందులో సొమ్మును తిరిగి ఇప్పించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని సైబ‌ర్ పోలీసులు చెబుతున్నారు. ఒక్క‌సారి సైబ‌ర్ నేర‌గాళ్ల జేబులో ప‌డ్డ పైస‌లు మ‌ళ్లీ రావ‌డం అంటే బూడిద‌లో నుంచి ప‌న్నీరు తీసిన‌ట్టే.

You missed