త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ హరీశ్‌రావును ఇంచార్జీగా నియమించడంతో తన వద్దకు హుజురాబాద్ క్యాడర్‌ను, నాయకులను రప్పించుకుంటున్నాడు. ఇక్కడే మంతనాలు జరుపుతున్నాడు. నిత్యం హుజురాబాద్ నుంచి సిద్ధిపేట్‌కు హరీశ్‌రావును కలిసేందుకు టీఆరెఎస్ నాయకులు బయలుదేరుతున్నారు. ఆర్థిక లావాదేవిలు, ఖర్చులు, వ్యూహరచనలు అంత ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. రాత్రి పూట నేతలకు మంచి దావత్‌లు దొరుకుతున్నాయి.
నోటిఫికేషన్ ఇంకా రాకపోవడంతో అప్పటి వరకు క్షేత్రస్థాయిలో హరీశ్ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సైలెంట్‌గా, చాపకింద నీరులాగా తన పని తాను చేసుకుపోతున్నాడు. నిత్యం హుజురాబాద్‌లో ఏం జరుగుతుందో హరీశ్ సిద్ధిపేట్‌లో కూర్చోని తెలుసుకుంటున్నాడు. వచ్చిన నాయకులతో ఆరా తీస్తున్నాడు. ఈటల ప్రతీ కదిలిక పై హరీశ్ నజర్ పెట్టాడు. ఎప్పుడో ఓసారి ఏదో ఒక వేదిక పై విమర్శలు గుప్పిస్తున్నా.. అవి అంత ఘాటుగా ఉండడం లేదు.
కేటీఆర్ అయితే ఈటలను కౌంటర్ చేసే విషయంలో పూర్తిగా ఆత్మ సంరక్షణలో పడిపోయాడు. దీంతో కేటీఆర్‌ను హుజురాబాద్ ఎన్నికల వ్యవహారం నుంచి కేసీఆర్ తప్పించాడు. హరీశ్‌కు బాధ్యతలు అప్పగించాడు. కానీ హరీశ్ కూడా దూకుడుగా ఈటల పై దాడి చేయలేక పోతున్నాడు. ఉద్యమ సహచరుడిగా ఈటల తో చాలా రోజులు కలిసి పనిచేసిన హరీశ్.. నిందారోపణలు చేసే విషయంలో వెనుకాముందాడుతున్నాడు. ఈ పరిణామం టీఆరెఎస్ వర్గాల్లో ఒక గందరగోళం నెలకొల్పినా.. హరీశ్ వ్యూహరచనలో పకడ్భందీగా ఈటల పై దాడి ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు హుజురాబాద్‌కు హరీశ్ వెళ్లలేదు. సిద్దిపేట్ నుంచే వ్యవహరమంతా నడిపిస్తున్నాడు. హుజురాబాద్ టీఆరెఎస్ క్యాడర్, నాయకగణం రోజుకో బృందం సిద్ధిపేట్‌లో హాజరవుతున్నారు. దుబ్బాకలో ఒంటరి పోరు చేసి అనూహ్యంగా ఆఖరి నిమిషంలో పరాభవం పాలైన హారీశ్‌కు ఇప్పుడు హుజురాబాద్ అగ్ని పరీక్ష. ఈ ట్రబుల్ షూటర్ తన పాత ముద్రను నిలుపుకుంటాడా? తనే ట్రబుల్‌లో పడతడా? చూడాలి.