హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజురోజుకూ మారుతున్నాయి. ఉద్య‌మ కారుడిగా, బీసీ నేత‌గా అక్క‌డ మంచి గుర్తింపున్న ఈట‌ల‌కు అద‌నంగా సానుభూతి తోడైంది. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను ఓడించేందుకు కేసీఆర్ శ‌క్తియుక్తుల‌న్నీ ప్ర‌యోగిస్తున్నాడు. అభ్య‌ర్థిని ఎవ‌రిని పెట్టాలా అనే దానిపై తీవ్ర క‌స‌ర‌త్తే చేశాడు. ఆఖ‌రికి టీఆరెస్‌వీ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్న గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ పేరును దాదాపుగా కేసీఆర్ ఖ‌రారు చేశాడు.

బీసీ పై బీసీని నిల‌బెట్టి ఆ ఓట్లు త‌మ‌వైపు లాక్కునేందుకు కేసీఆర్ త‌న‌దైన శైలిలో వ్యూహం ర‌చించాడు. ఎస్సీల కోసం ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం త‌మ‌కు లాభం చేకూరుస్తుంద‌ని భావిస్తున్నారు. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో ఓసీల ఓట్లు కూడా టీఆరెస్ ఖాతాలో ప‌డ‌తాయ‌ని అంచ‌నాలు వేసుకుంటున్నారు. పెద్దిరెడ్డి, ఎల్ ర‌మ‌ణ లాంటి నేత‌ల‌ను అమ్ముల‌పొదిలో రెడీగా ఉంచుకున్నాడు.

స్థానికుడైన గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్, ఈట‌ల రాజేంద‌ర్‌కు శిష్యుడు. రాజ‌కీయంగా ఈట‌ల వ‌ద్దే గెల్లు ఓన‌మాలు నేర్చుకున్నాడు. అన్నీ తానై ఈట‌ల రాజేంద‌ర్ గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు అండ‌దండ‌గా ఉండే వాడు. యాద‌వ సామాజిక‌వ‌ర్గంలో కూడా ఈట‌ల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్ర‌మంలో రాజ‌కీయ గురువు పైనే ఫైట్‌కు సిద్ధం కాబోతున్నాడు ఈ శిష్యుడు.

సీనియ‌ర్ ఉద్య‌మ‌కారుడి పై జూనియ‌ర్ ఉద్య‌మ‌కారుడి పోటీ అన్న‌ట్టు. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, వ్యంగ్యాస్త్రాలు ఈ ప్ర‌చారంలో మితిమీరిపోనున్నాయి. మ‌రి గురువు ధాటికి శిష్యుడు త‌ట్టుకుంటాడా? త‌న చుట్టూ చేరిన శ‌క్తుల ప్రమేయంతో చెల‌రేగిపోతాడా? అన్ని వ‌ర్గాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న గురువును ఓవ‌ర్‌టేక్ చేసి దూసుకుపోతాడా? ఈ రెండు పార్టీలు వేసుకునే ఎత్తుల‌కు పైఎత్తులో ఓపావుగానే ఉండి ప్రేక్ష‌క పాత్ర వ‌హిస్తాడా? గురువును మించిన శిష్యుడ‌వుతాడా? గురువుని ముంచిన శిష్యుడ‌వుతాడా?