హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు తప్ప ఇప్పుడు కేసీఆర్‌కు ఏమీ కనిపించదు. ఆ రాజకీయాలు తప్ప సంక్షేమం పట్టదు. ఓ వైపు థర్డ్ వేవ్ వచ్చేస్తుందని భయపెట్టడం మొదలుపెట్టారు. దీనిపై సర్కారు నుంచి ఓ క్లారిటీ ఉండదు. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి.. ఏం కాదు? మేము రెడీ గా ఉన్నాం.. అనే భరోసా ఉండదు. మీ చావు మీరు చావండనే విధంగానే ఉంది సర్కారు దోరణి. ఈ థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో..? ఎంతమంది కొంపలు ముంచుతుందో..? ఎందరి ఉసురు తీసుకుంటుందో తెల్వదు కానీ… ఇప్పుడు వైరల్ జ్వరాలతో పల్లెలు మంచం పట్టాయి. డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు చెలరేగిపోతున్నాయి. ఈసీజన్‌లో జ్వరం అంటేనే భయపడే పరిస్థితులున్నాయి. అదీ కరోనానే అని. ఎటూ తేల్చుకోలేక .. దవాఖనలో చుట్టూ తిరుగుతున్నారు జనం. అవి వైరల్ ఫీవర్లు గా తేలుతున్నాయి.
ఇటీవల కాలంలో ఈ వైరల్ జ్వరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనిపై సమీక్షలు లేవు. వైధ్యాధికారులకు సరైన గైడ్‌లెన్సులు లేవు. వారంతా ఇప్పుడు కరోనా మూడోవేవ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇవేమీ పట్టించుకునేటట్టు లేరు. కరోనా రాకముందే ఈ వైరల్ జ్వరాలే ప్రజల ప్రాణాలు తీసేటట్టున్నాయి. గత ఏడాది పోల్చితే ఈ జ్వరాల సంఖ్య మరీ విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఎక్కడికక్కడ జ్వరాలతో మంచం పడుతున్నారు. హుజురాబాద్ లో ఎన్నిక జరిగేటప్పుడు జరుగుతుంది. మీరే గెలుస్తరు కానీ.. జర గీ సంగతి పట్టించుకో సీఎం సారూ..