తెలంగాణలో జోరుగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నాట్లు పూర్తవుతున్నాయి. ఇంకా కొందరు నాట్లు వేస్తున్నారు. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నాట్లు వేసేందుకు ప్రత్యేకంగా కలకత్తా నుంచి తెలంగాణకు వస్తున్నారు. పది మంది చొప్పున మగవారు బృందాలుగా ఏర్పడి ఎకరాకు ఇంత అని గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. ఎకరాకు 5,500 వరకు రైతులు చెల్లిస్తున్నారు. ఒక్కరోజు మూడెకరాల వరకు ఓ పది మంది బృందం గల మగవారు నాట్లు వేస్తున్నారు. లోకల్‌గా కొంత మంది కైకిలికి వస్తున్న వారితో పూర్తిగా పని సాగడం లేదు. మగ మనిషికి ఒకరోజు కైకిలి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఇస్తుండగా, ఆడ మనుషులకు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఇస్తున్నారు. లోకల్ కైకిలి మనుషులకంటే కూడా కలకత్తా నుంచి వస్తున్న మగవారి బృందం నాట్లు నిటారుగా నిలబడేటట్లు వేయడంతో దిగుబడి అధికంగా వస్తుందనే నమ్మకం స్థానిక రైతులకు ఏర్పడింది. ఓ వైపు కూలీల కొరతతో పాటు దిగుబడి అధికంగా వచ్చే విధంగా నాట్లు వేయించుకునేందుకు ఈ కలకత్తా బృందాలే బెటరనే అభిప్రాయానికి వచ్చారు. వీరంతా రోజంతా కష్టపడితే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల పైన కైకిలి పడుతున్నది.
