సెకండ్ వేవ్‌లో కరోనా కుటుంబాలను అస్తవ్యస్తం చేసింది. ప్రాణాలతో చెలగాటమాడింది. వేల మంది ప్రాణాలను వైరస్ మింగేసింది. ఆ కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించలేదు. ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయాయి. రైతన్నలకు మాత్రం ప్రభుత్వం చేసిన రైతుబీమా ఆదుకున్నది. రైతు చనిపోతే రైతుబీమా వర్తించడంతో చాలా కుటుంబాలకు ఈ బీమా కింద వచ్చిన ఐదు లక్షలు ఆ అక్కెర సమయంలో ఆసరైయ్యాయి.
దిక్కు లేకుండా పోయిన ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా అవసరానికొచ్చాయి. అసలే పనిలేదు. బయట అప్పు కూడా పుట్టని పరిస్థితి. మరో వైపు వైరస్ దాడి. ప్రాణాలు నిలుపుకొని బతికుండటమే గగనమైపోయింది. అలాంటి సమయంలో వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడిపోయాయి. కానీ రైతులకు మాత్రం రైతుబీమా పెద్దదిక్కుగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో వేవ్‌లో ఐదు వేల మంది రైతులు చనిపోయారు. ఈ కుటుంబాలకు రైతుబీమా వచ్చింది. 80శాతం కుటుంబాలకు మాత్రమే రైతుబీమా రాగా మరో 20శాతం పెండింగ్‌లో ఉంది.