ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద ను కోల్పోయిన వారికి ఆ సభ్యత్వ బీమా నిండు భరోసానిస్తున్నది. నేనున్నానంటూ ఆదుకుంటున్నది. ఆపదలో ఆదరువుగా నిలుస్తన్నది. కుటుంబ పోషణకు ఆధారమవుతున్నది. ఓ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కొందరికి చిన్నదే కావచ్చు. కానీ నిరుపేదలైన చాలా కుటుంబాలకు అది పెద్ద మొత్తం. అదీ ఆపత్కాలంలో ఆదుకునే ఆ సాయం.. వారెప్పుడూ మరువలేరు. టీఆరెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు బీమా వర్తిస్తుంది. అప్పుడు వారికి తెలియదు. కానీ ఆపదలో అదెంత మేలు చేస్తుందో .. బాధిత కుటుంబాల కన్నీళ్లను చూసిన తర్వాత అర్థమవుతుంది.
మోపాల్ మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన లక్క సుమన్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే సుమన్‌కు రెండు లక్షల బీమా మొత్తం మంజూరుకాగా.. ఆ కుటుంబ సభ్యులకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మృతుడి తల్లి లక్ష్మికి అందజేసి వారికి తన వంతు సాయం చేస్తానని మద్దతుగా నిలిచారు.
కేసీఆర్ ఆలోచనలన్నీ ప్రజల సంక్షేమం చుట్టే ఉంటాయని, అదే విధంగా పార్టీని నమ్ముకున్న కుటుంబాలకు ఆయన అండగా నిలిచి బీమా ద్వారా ఆదుకుంటున్నారని బాజిరెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ కి ఇలాంటి ఆలోచన రాలేదని, సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడి కుటుంబానికి ‘నేనున్నా’నంటూ సీఎం కేసీఆర్ భరోసాగా నిలుస్తున్నారన్నారు. దీనివల్ల ఆ కుటుంబాలకు ఎంతో కొంత పార్టీ ద్వారా ఆర్థికసాయం అందుతుందన్నారు. అంతేగాక ఇలాంటి పథకాలు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అమలు కావడం ప్రజల అదృష్టమన్నారు.