ఇందూరు జిల్లా అంటేనే క‌విత‌క్క అడ్డాగా భావిస్తారు. ఇక్క‌డ ఎమ్మెల్యేలంతా ఆమె స‌మ‌న్వ‌యంలోనే ప‌నిచేస్తారు. అంతిమంగా పార్టీని బ‌లోపేతం చేయాలి. టీఆరెస్‌కు ఇందూరు కంచుకోట అనే పేరును సార్థ‌కం చేస్తూ సాగాలి. అంద‌రినీ ఆదుకోవాలి. అంద‌రికీ అవ‌కాశాలివ్వాలి. అంద‌రూ బాగుప‌డాలి. పార్టీని బాగుప‌ర్చాలి. ఇదీ ఆమె నినాదం. ఆమె ల‌క్ష్యం. కానీ ఇదంతా ఒక‌ప్ప‌టి మాట . ఇప్పుడు క‌విత‌క్క మారింది. మారింది అంటే .. మునుప‌టిలా ప‌ట్టు లేదు. ప‌ట్టింపులేదు. ప‌ట్టించుకోవ‌డం లేదు.

కేసీఆర్ అన్న‌ట్టు.. ఇది మా సొంత క‌విత్వం కాదు. లీడ‌ర్ల‌నుకునే మాట‌. కార్య‌క‌ర్త‌ల క‌డుపులోని మాట‌. ఏళ్ల త‌ర‌బ‌డి ఆమెనే న‌మ్ముకుని ఇంకా ఆశ‌తో ఎదురుచూస్తున్న ఆశావాహుల నిరాశ‌. పార్టీ కోసం అన్నింటినీ త్యాగం చేసి ఇంకా పార్టీని ప‌ట్టుకునే వేలాడుతున్నఉద్య‌మ‌కారుల అసంతృప్తి. ఒంటి చేత్తో పార్టీని గెలిపించ‌గ‌లిగే స‌త్తా ఆమె సొంతం. మ‌హిళా లోకంలో ఆమెకంటూ ఓ ప్ర‌త్యేక స్థానం. ఇప్ప‌టికీ ప‌దిలం. కానీ ఎంపీగా ఓడిన నాటి నుంచి ఆమె రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటున్నారు. ఆమె మౌనం.. దూరం .. ఆమెనే న‌మ్ముకున్న‌వారికి, పార్టీయే దైవ‌మ‌ని భావించిన వారికి అశ‌నిపాతంలా మారింది.

ఆశ‌ల సౌధాలు కూలిపోసాగాయి. పెట్టుకున్న న‌మ్మ‌కం మంచులా క‌రిగిపోసాగింది. రానురాను ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుందే గానీ మెరుగుప‌డ‌లేదు. పార్టీ ప‌ద‌వులు లేవు. నామినేటెడ్ పోస్టులూ రావు. ఆదాయ మార్గాలూ లేవు. ఖ‌ర్చులు తడిసిమోపుడ‌వుతున్న త‌రుణంలో కుటుంబాన్ని ఎలా సాకాలో తెలియ‌క‌.. క‌డుపు నింప‌ని పార్టీని కాల‌ద‌న్న‌లేక‌… న‌మ్ముకున్న నేత‌లను నోరారా అడ‌గ‌లేక‌.. వారిని తూల‌నాడేందుకు నోరు రాక‌.. చావ‌లేక‌..బ‌త‌లేక‌… చివ‌ర‌కు జీవ‌చ్చ‌వంలా..

అక్కొస్త‌ది. మ‌మ్మ‌ల్ని అనాథ‌ల‌ను చేయ‌దు.. పార్టీని ఆగం చేయ‌దు.. అనే న‌మ్మ‌కంతోనే బ‌తుకుతూ.. ఆ న‌మ్మ‌క‌మే వారిని బ‌తికిస్తూ ఉండ‌గా..భారంగా బ‌తుకులీడుస్తున్నారు ఇందూరు గులాబీద‌ళ రాజ‌కీయ నిరుద్యోగులు..

క‌డుపు త‌రుక్కుపోతున్న‌ది.

అవ‌త‌లి పార్టీ బ‌ల‌ప‌డుతుంటే. అది మ‌ద‌బ‌లంతో తొడ‌లు చ‌రిచి రారా చూసుకుందాం అని ఉలికొల్పుతుంటే…

ఉద్య‌మ‌కాలంలో మ‌హ‌మహుల‌ను ఓడించి.. మ‌ట్టిక‌రిపించిన ఆ చేతులు.. ఆ వాగ్దాటి ఇప్పుడు ప‌నిచేయ‌దే..

ఎందుకు..?

చెప్పుకోవ‌డానికి వెనుకా ముందు ఏ ప‌ద‌వి లేదు..
ఏ అండా లేదు.. ఆద‌ర‌వూ క‌రువు..
ఉన్నోళ్లు,స‌హ‌చ‌రులు జారుకుంటున్నారు. రాజ‌కీయ స‌న్యాసం వైపు అడుగులేస్తున్నారు.

ఎంత‌టి నామార్థా..? అని క‌డుపు ర‌గిలిపోతున్నా చేసేదేముంది.. ? నాకే దిక్కులేదు. నా బ‌తుకే స‌క్క‌గ లేదు. ఇంక మీ గురించి మేమేడ ప‌ట్టించుకుంటం…
అయినా నోరు విప్పి మాట్లాడే స్వేచ్చ ఇప్పుడు మాకుందా..?

గొంతెత్తి మాట్లాడితే ఆర్త‌నాదం విని ఆవేద‌న ను అర్థం చేసుకునే లీడ‌ర్ ఉన్నాడా..?

అందుకే అన్నీ ఉన్నా.. అంద‌రూ ఉన్న అనాథ‌గా పార్టీ అవ‌తార‌మెత్తుతోంది..
ఇదే అన్నింటిక‌న్నా విషాదం…

Dandugula Srinivas