అనుకున్నట్టే మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ లైట్ తీసుకోలేదు. ఈ రోజు జరిగిన మునుగోడు ప్రజా దీవెన సభలో తన విశ్వరూపాన్ని చూపాడు. బీజేపీపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఎక్కువ సమయం తీసుకోకున్నా.. సూటిగా ఘాటుగా సుత్తి లేకుండా బీజేపీ నెత్తిన గట్టిగా మోదాడు. తనదైన స్టైల్‌కు కొంచెం భిన్నంగానే ఆయన ప్రసంగం కొనసాగింది. గతంలో హుజురాబాద్ ఫలితాన్ని చూసిన కేసీఆర్… అలాటిది మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు ఏ చిన్నఅవకాశాన్ని వదల్లేదు. ప్రతీ చిన్న విషయానికీ తన ప్రసంగంలో చోటు కల్పించాడు. ఓటేసేటప్పుడు బాయికాడ మీటర్‌కు మొక్కి ఓటేయ్యాలి… గ్యాస్ సిలిండర్‌కు మొక్కి ఓటెయ్యాలి… అనే మాటలు కూడా ఆయన జోడించాడు.
బీజేపీకి ఇక్కడ ఎప్పడూ డిపాజిట్ రాలేదన్న కేసీఆర్… ఈసారి డిపాజిట్ రాకుండా చూడాలని చెబతూనే…. బీజేపీకి ఒక్క ఓటు వేసినా బాయికాడ మీటర్ రాక తప్పదని ఓటరును జాగృతం చేసేక్రమంలో అల్టిమేట్ కండిషన్ ను వారి ముందుంచాడు. అంటే అసలు బీజేపీకి ఎవ్వరూ ఓటెయ్యొద్దు… అనే రీతిలో ఆయన ప్రసంగం సాగింది. దీన్ని ఆషామాషీ ఎన్నికగా కేసీఆర్ తీసుకోవడం లేదు. అదే విషయాన్ని ప్రసంగంలో చెప్పాడు. తనకు ప్రజల మీదున్న బలాన్ని అలాగే నిరూపించాలని, తనను బలహీన పరిస్తే బీజేపీ రెచ్చిపోతుందనే విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాడాయన.
ఈ ఎన్నిక ఫలితాన్నివచ్చే మధ్యంతర లేదా సాధారణ ఎన్నికలకు కేసీఆర్ పరోక్షంగా అన్వయించుకున్నాడు. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాడు. రేపు ఇక్కడే అమిత్ షా పర్యటనను ఉద్దేశించి కూడా ఘాటుగానే ప్రసంగించాడు. వాళ్లు మోసం చేస్తే మోసపోవద్దని, వారిచ్చే మందు,పైసకు ఆగం కావద్దనే విధంగా కేసీఆర్ పరోక్షంగా చెప్పడం విశేషం. బీజేపీ ఎంత మేర ఈ ఉప ఎన్నికను ప్రభావితం చేయనుందనే విషయం ఈ మాట ద్వారా కేసీఆర్ చప్పినట్టయ్యింది. కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడా తీసుకున్న కేసీఆర్.. రాబోవు సాదారణ ఎన్నికల్లో తన పంథాను ఈ వేదికగా చెప్పేశాడు. కలిసే కూటమిగా పోటీ చేయనున్నట్టు వెల్లడించేశాడు పరోక్షంగా.
కానీ బాయికాడ మీటర్లు అనేది ఒడిసిన ముచ్చట. దీనిపై ప్రజలెంత వరకు స్పందిస్తారో తెలియదు. బీజేపీతో ఢీకొట్టేందుకు తనెంత దూరం పోయాడో.. పోతున్నాడో మాత్రం కేసీఆర్ ఈ వేదకగా ప్రకటించాడు. తెలంగాణ ప్రజల మద్దతు ఈ వేదికగా కోరాడు. మునుగోడు ఫలితంతో దిమ్మదిరిగేలా చేస్తేనే మోడీ ముందు తను చేసిన సవాల్ నిలబడుతుందనే విధంగా… తన ఇజ్జత్ నిలబెట్టి తెలంగాణ పరువు కాపాడాలనే విధంగా కేసీఆర్ ప్రసంగం ఆవేశంగా సాగింది. యుద్దం చేస్తున్న తనకే కత్తి చేతికివ్వాలని గతంలో మాదిరిగానే ఆయన కోరాడు. మరోసారి ఇక్కడికి వస్తానని కూడా ప్రకటించేశాడు. దీన్నిబట్టి మునుగోడు ఉప ఎన్నిక ఫలితం… కేసీఆర్ అన్నట్టు టీఆరెస్‌కు బతుకుదెరువు పోరాటమే. జీవన్మరణ సమస్యే…..
Dandugula Srinivas