పంద్రాగస్టున మరో కొత్త పదిలక్షల ఆసరా పింఛన్లను మంజూరు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఎట్టకేలకు కొత్త పింఛన్లకు మోక్షం లభించిందనుకున్నారు. ఆఖరికి కేటీఆర్ పింఛన్ల గురించి చెప్పినా నమ్మకం లేకుండా పోయింది. ఆఖరికి సీఎం చెబితే గానీ గురి కుదరలేదు జనానికి. కొత్త పింఛన్ల ఆశల పల్లకిలో ఓ వైపు లబ్దిదారులు ఊరేగుతుండగా…. పాత పింఛన్ల ఇప్పటికీ రాకపోవడంతో ఆసరా పింఛన్ దారులు పడిగాపులు పడుతున్నారు.
జూన్ నెల పింఛన్ ఇంత వరకూ రాలేదు. జూలై నెలాఖరున జూన్ నెల పించన్ పడుతుంది. అంటే ఓ నెల లేటుగానే వేస్తారు. కానీ ఈసారి ఆ లేటూ.. మరింత లేటుగా మారింది. ఆగస్టు పది తారీఖు వచ్చినా పింఛన్ పడలేదు. ఆసరా పింఛన్‌ల పరిస్థితి నానాటికీ ఇలా తయారవుతూ వస్తున్నది. మూడేండ్ల నుంచి కొత్త పింఛన్ల ఊసే ఎత్తలేదు సర్కార్. భర్తలు చనిపోయి ఏండ్లకు ఏండ్లు పింఛన్ కోసం ఎదురుచూస్తన్న వారెంతో మంది ఉన్నారు. ఇక కొత్త పింఛన్లు కూడా వీటికి తోడైతే ఇంకెంత ఆలస్యం చేస్తారో…