“స్నేహితుల్ని, ప్రజలను ప్రభావితం చేయడం ఎలా?” అనే ఈ పుస్తకాన్ని అమెరికన్ రచయిత డేల్ కార్నెగి రాసి ఏ౦డ్లుపూండ్లు గడిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడు పోయాయి. అనేక దేశాల్లో అనేకమందికి ఈ పుస్తకం స్పూర్తి ఇచ్చింది. బహుశా కేసీఆర్ కూడా చదివినవారిలో వుండివుండాలి.
డేల్ కార్నెగి తాను రాసిన ఈ పుస్తకంలో ఇలా పేర్కొంటారు.


‘పనిచేసేవారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలంటే వారిని మెచ్చుకుంటూ వుండాలి. ప్రతి మనిషికీ అంతర్లీనంగా తన పేరుపై తగని మమకారం వుంటుంది. అతడు, ఆమె అని ఏదో పొడిపొడిగా కాకుండా, ‘పలానా వారు’ అని పేరుతో పిలిస్తే, పేరు పెట్టి ప్రశంసిస్తే అందులోని కిక్కే వేరు. అదీ తన పైవారు పేరుపెట్టి నలుగురిలో పొగిడితే ఇక వారి ఆనందానికి అంతే వుండదు.”
డేల్ కార్నెగి బోధించిన సూత్రం ఏమిటంటే “మీ సహచరులు, సాటి ఉద్యోగులు చేసిన మంచి పనిని ప్రశంసించేటప్పుడు ఆ పనిని ఏదో మాటవరసకు చేసినట్టుగా కాకుండా మనః స్పూర్తిగా చేయండి” అని.
ఆయన ఇంకా ఇలా చెప్పారు.
“బాగా పనిచేసే వారిని బాగా ప్రశంసించండి. ఆ పొగడ్తలు పెదవి నుంచి కాకుండా గుండెల్లోనుంచి రావాలి. అప్పుడే వాటికి నిబద్దత వుంటుంది. విలువ పెరుగుతుంది”
కేసీఆర్ ఈ సూత్రాన్ని చాలా లాఘవంగా ఒడిసిపట్టుకున్నారనే చెప్పాలి.

Bhandaru Srinivasa Rao