కేంద్రం రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఒకరు ఆంధ్రకు చెందిన రైటర్ విజయేంద్ర ప్రసాద్. డైరెక్టర్ రాజమౌళి తండ్రి. ఆయన్ను ఎందుకు చేశారో తెలియదు చాలా మందికి. పాపం అంతుపట్టక, అంతు చిక్కక గిలాగిలా కొట్టుకుని ఇలా ఏదో ఒకటి రాసేస్తున్నారు సోషల్ మీడియాలో. రీసెంట్లీ వచ్చిన త్రిపుల్ ఆర్ మూవీ చూసిన ఎవరికైనా విజయేంద్రుడి చరిత్ర వక్రీకరణలో ..కల్పిత కిచిడీ వండటంలో ఎంతటి సిద్ధహస్తుడో తెలిసిపోయింది. తేలిపోయాడు. నవ్వుల పాలయ్యాడు. సినిమా అనుకున్న సక్సెస్ సాధించలేదు. పైసల కోసం మరీ చరిత్రను ఇలా దిగజార్చాలా..? చరిత్ర హీనులుగా మిగలాలా..? అని తిట్టిపోసిన సందర్భాలున్నాయి.

కానీ ఆయనకు రాజ్యసభ వరించింది. కొమురం భీం పాత్రను మరీ దిగజార్చి… పిరికి వాడిగా చూపించి.. అతని నేపథ్యాన్ని బొందపెట్టి….. తెలంగాణ ఉనికిని చెప్పడానికే సంశయించి… తనకు అనుకూలంగా కథను రాసుకున్న విజయేంద్రుడు …. నరేంద్ర మోడీకి నచ్చినట్టున్నాడు బహుశా. అంతకు ముందు రాజన్న సినిమాను తనే డైరెక్ట్ చేశాడు నాగార్జున తో. సుద్దాల హనుమంతు జీవిత గాధ స్పూర్తిగా. అందులో తెలంగాణ పదం ఉండదు. పోరాటం ఉండదు. ఉద్దేశ్యం ఏమిటో చెప్పలే. నిజాం మీద పోరాటం… అంతే. తనకు ఏం కావాలో అదే చెప్పుకుపోయాడు. మీకు చాతకాకపోతే.. ఉన్నదున్నట్టు చరిత్రను చెప్పే దమ్ము లేకపోతే దాని జోలికి పోవడమెందుకు….?
బహుబలి చరిత్ర నేపథ్యం నిజామాబాద్ జిల్లా బోధన్‌తో లింకై ఉంది. ఇప్పటికీ అక్కడ ఆనవాళ్లున్నాయి. చరిత్ర సజీవంగా ఉంది. కానీ ఆ పేరును, ఆ నేపథ్యాన్ని అలా తన కథకు ఆమూలగ్రాం వాడుకుని వదిలేశాడు. అంతే చరిత్ర కావాలి. అది పైసలు కురిపించాలి. అందుకు అష్టవంకరలు తిప్పాలి. వక్రీకరించాలి.

