డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎన్నేండ్లుగానో జనం ఆశతో ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు లేవు. నిర్మాణాలు పూర్తయినా పంపిణీ చేయలేదు. ఇండ్ల పంపిణీ రెడీగా ఉన్న చోట మాత్రం పేద ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని కొందరు లక్షలు వసూలు చేస్తున్నారు. ఖమ్మంలో వెలుగు చూసిన ఇలాంటి ఉదంతం కలకలం సృష్టించింది. ఇందులో కీలకంగా ముగ్గురు మీడియా ప్రతినిధులు ఉండటం… అందులో ఇద్దరు అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌కు చెందిన స్టాఫర్లు ఉండటంతో ఇది మరింత రచ్చకెక్కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెడకు చుట్టుకుంది.
ఆయన ఈ విషయంలో మరింత బద్నాం అయ్యాడు. స్థానిక లోకల్ పేపర్లలో వరుసగా ఇవే కథనాలు రోజూ ప్రచురితం కావడంతో అధికారపార్టీ అక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇద్దరు లేడీ ఏజెంట్లను నియమించుకున్న నమస్తే, టీన్యూస్, టీవీ5 ఖమ్మ్ం జిల్లా ప్రతినిధులు ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష నుంచి మూడు లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు మొత్తం అక్కడి పేద జనం నుంచి ఐదారు కోట్ల వరకు వసూళ్లు అయ్యాయట. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆ ఇద్దరు లేడీ కిలాడీలపై కేసులు నమోదయ్యాయి. మీడియా ప్రతినిధుల వ్యవహారంలో మంత్రి కూడా బద్నాం అవుతున్నాడు.
