కేసీఆర్కు ఒక అలవాటుంది. ఎన్నికల ముందు ప్రజలకు కావాల్సిన వాటిపై అప్పటికప్పుడు వరాలిచ్చేస్తాడు. ఇలా గెలిపించగానే .. వెంటనే అది అమలులోకి వస్తుందంటాడు. నమ్మబలుకుతాడు. అందరూ నమ్మరు. ఎక్కడో బెడిసికొడుతుంది. ఆ తర్వాత దాని ఊసుండదు. అందేదీ మరి.. కేసీఆర్ నోటి వెంట ఓ మాటొస్తే అది అమలు కావాల్సిందే కదా అని అనుకుంటే అది మన అమాయకత్వమే. అలాంటి అబద్దపు హామీలెన్నో ఇచ్చాడాయన. ఎన్నికల తర్వాత అది గుర్తుండదు. గుర్తచేసేవాళ్లూ ఉండరు. అడిగే, నిలదీసే ప్రతిపక్షలూ ఉండవు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదసాయం పది లక్షలు ఇస్తానన్నాడు. అక్కడ బీజేపీ పుంజుకున్నది. మరి కేసీఆర్ ఏం చెప్పాడు? గెలిపించండి అన్నాడు. గెలిపించలేదు. అందుకే అమలు కాలేదు. అంటే స్వయంగా సీఎం నోటి వెంట వచ్చిన మాటలకే అమలయ్యే దిక్కు లేదన్నమాట. ఇక ఆయన మాటల మీద ఏం విశ్వాసముంటుంది.
నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు లెక్కలు తీయండి అంటాడు. అదేదో వారం పదిరోజుల్లో ఇక నిరుద్యోగలందరికీ నిరుద్యోగ భృతి ఖాతాల్లో పడినట్టే చెబుతాడు. కేటీఆర్ కూడా నాయన అడుగుజాడల్లో నడుస్తాడు. ట్విట్టర్ గూట్లో ఓ పోస్టు పడేస్తే చాలు దాన్ని చూసి మురిసిపోతాం మనం. అమలయినట్లేనని భావిస్తాం. రోజులు గడుస్తాయి కానీ. దాని ఊసుండదు. ఇంకో టాపిక్ వచ్చి పడుతుంది. దీన్ని మరిచిపోతాం. మరవగొడతారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల నోటిఫికేషన్ గురించి మాట్లాడనే వద్దు. దళితులకు భూ పంపిణీ మరిచిపోయారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు బదులుగా ఐదు లక్షలిస్తాం.. సొంత స్థలం ఉంటే కట్టుకోండ్రన్నారు. అదీ లేదు. కొత్త పింఛన్ల జాడలేదు. వృద్దాప్య పింఛన్ కు వయస్సు తగ్గించి ఇస్తామన్నారు. కార్మికులకు కటాఫ్ డేట్ ఎత్తేస్తం.. అందరికీ జీవనభృతి ఇప్పిస్తామన్నాడు. ఆ ఫైల్ పెండింగ్లోనే ఉంది. నియంత్రిత సాగు చేసి సన్నబియ్యం వేయమంటే వేశాం.. నష్టమొచ్చిందంటే.. మద్దతు ధర పెంచి ఇస్తామంటాడు. ఆ తర్వాత దాని ఊసే ఉండదు. ఎర్రజొన్నలకు బోనస్ ఇప్పిస్తా .. అంటాడు ఎన్నికల సభలో. అదీ ఉండదు.
అందరికీ ఆదర్శం అంకాపూర్ అక్కడనే డబుల్ బెడ్ రూంలు తొలత కట్టించి హెలికాప్టర్లో వచ్చి ప్రారంభిస్తా అంటాడు. ఇప్పటికీ అవి అతీ గతీ లేవు. మాట్లాడితే ధనిక రాష్ట్రమంటాడు. మరి ఇచ్చిన హామీలకు గతిలేదెందుకు? అప్పుడు అధికారంలోకి వచ్చేందుకు పోటీలు పడి హామీలిచ్చారు. ఇప్పుడు వాటి అమలు తలకు మించిన భారంలా మారింది. మ్యానిఫెస్టోలో పెట్టిన వాటికే గతిలేవు. ఇక నోటిమాటగా చెప్పినవాటికి అతీగతీ ఏముంటుంది?
