ఒక పెద్ద ప్రశ్న!
ప్రత్యేకించి జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా?
నేను రిటైర్ అవుతున్నానని నిన్న ప్రకటించగానే, (నేనే కాదు ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరైనా) ఇక, ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వ్యాసాలు రాసుకోవచ్చు’ అన్నమాట సర్వసాధారణం. ఇది ఎప్పట్నుంచి ఉందో కానీ, నాకైతే ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. నిజం చెప్పాలంటే, ఈ అభిప్రాయం గుర్తుకురాగానే ‘నాకు నవ్వాలో, ఏడవలో’ తెలియలేదు. ఒకానొక అర్ధరాత్రి నాకు ఠక్కున మెలకువ వచ్చి, పై ప్రశ్న ఉదయించగానే పదిమందితో మరీ ముఖ్యంగా ‘నా’ అనే వాళ్ళతో ఇలా పంచుకోవాలని అనిపించింది.
నలభై ఏండ్ల కిందట, 1981లో నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో ఉన్న పరిస్థితికి, ఇప్పటికీ ‘సోషల్ మీడియా’ ఆవిర్భావం, విశ్వవ్యాప్తం ప్రధాన మార్పు. అప్పట్లో ఏ అభిప్రాయమైనా స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా నిర్మొహమాటంగా, నిఖార్సుగా ప్రకటించుకోవడానికి కొన్ని పత్రికలు ఉండేవి. నిజానికి వాటిని ఆర్థికంగా నడిపేది యాజమాన్యాలే అయినా, వారు ఏ వర్గం వారైనా, అలా రాసే పాత్రికేయులు మాత్రం అప్పట్లో కొంత ఎక్కువ సంఖ్యలోనే ఉండేవారు. పాఠకుల్లోనూ ‘మంచీ-చెడు’ విశ్లేషణను చదివి, అర్థం చేసుకునేవారు కూడా అధికమే. కానీ, ఇప్పటి స్థితి? అలాంటి భావనలున్న పత్రికా రచయితలు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు, మిగిలారు? రాసినా ప్రచురించే పత్రికలెన్ని?
సిద్దాంతాలు, రాజకీయ రాద్ధాంతాలు, కుల మత జాతి వర్గ ప్రేమలు, దోమలకు అతీతంగా అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ప్రకటిస్తున్న పత్రిక ఒక్కటంటే ఒక్కటైన ఉందా? పోనీ, సోషల్ మీడియాలో రాసినా చేరేది ఎందరికి? చదివేది, చదివి జీర్ణించుకొనే వాళ్ళు, తిరిగి ఎదురు తిరిగి తిట్టని వాళ్ళు.. ఎందరు? నాతోపాటు పలువురు జర్నలిస్టులకు ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం.
ప్రపంచంలో, భారతదేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు జర్నలిజంలో (ఆ మాటకు వస్తే, సమాజంలో ఆచరణలోనే) ‘స్వేచ్చ, నిష్పాక్షికత’ అన్నవి దాదాపు అన్ని రంగాల్లోనూ, రానురాను బాగా తగ్గిపోతున్నాయన్నది వాస్తవం. ‘నిజం’ మాట్లాడుకోలేని, కనీసం నోటిమాటగా అయినా పరస్పరం చెప్పుకోలేని హీన దుస్థితి. ఇది మానవ సమాజానికి, మేధోవర్గానికి అవసరమా? దీని పర్యవసానాలు మరెంత ఘోరం కానున్నాయో!
‘ప్రజలు (ఎక్కువమంది) నిట్టనిలువున చీలిపోయారు’ అనేకన్నా ‘చీల్చివేయబడ్డారు’ అంటేనే సబబేమో. నేను మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ ‘మంచి-చెడు’ పోకడలను ‘పాలు నీళ్ల’ను వేరు చేసుకొనే హంసవలె భావిస్తూ, ఆచరిస్తూ జీవిస్తాను.
– దోర్బల బాలశేఖరశర్మ

