గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని రాజ‌కీయ ప‌రిణామాలు హుజురాబాద్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేంద‌ర్ ఒక్క‌డు… అత‌న్ని నిలువ‌రించేందుకు వంద‌ల శ‌క్తుల మోహ‌రింపు. అస‌లేం జ‌రుగుతుంది? పైగా సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై ఒక‌రు పైశాచికానందం పొందే పోస్టులు, కామెంట్లు. హుజురాబాద్ ఎన్నికలో గెలవ‌డానికి ఇన్ని ర‌కాల ప్ర‌యోగాలు, ప్ర‌లోభాలు అధికార పార్టీకి నిజంగా అవ‌స‌ర‌మా? ఈట‌ల‌ను మ‌రీ ఎక్కువ‌గా ఊహించుకుని భ‌య‌ప‌డుతున్నారు. ఒక‌శాతం గెలిచే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాకు వ‌చ్చినా భ‌రించ‌లేక‌పోతున్నారా? ఎందుకంత ప్ర‌ష్టేస‌న్? ఎందుకంత అభ‌ద్ర‌తాభావం కేసీఆర్‌కు? రాజ‌కీయాల్లో త‌ల‌లు పండిన వాళ్లు కూడా ఔరా అని ముక్కున వేలేసుకునేలా కేసీఆర్ రాజ‌కీయ క్రీడ విస్తుగొలుపుతున్న‌ది. చిన్నా చిత‌కా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. పిలిపించుకుని కండువా క‌ప్పేస్తున్నాడు. ఇత‌ను నాకు దోస్తే అని చెప్తున్నాడు. ప‌ర‌మ రోటీన్ స్పీచ్‌. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ మ‌న‌మే అంటాడు. ధ‌నిక రాష్ట్ర‌మ‌ని ముందే చెప్పిన క‌దా… స‌న్నాసులు న‌మ్మ‌లేదంటాడు. ఆయ‌న ప్ర‌సంగం వింటే ఎన్నో ప్ర‌శ్న‌లు, ఎన్నో అనుమానాలు? ఇది వేరే టాపిక్‌.

ఒక్క రాజేంద‌ర్‌ను ఓడించేందుకు ఇన్ని శ‌క్తుల‌ను ఖ‌ర్చుచేయ‌డం.. వారి కోసం ఎంత‌టి వ్య‌యానికైనా వెనుకాడ‌క‌పోవ‌డం, ప‌ద‌వులు ఆశ చూసి బ‌రిలోకి ఉసిగొల్ప‌డం.. బ‌హుశ ఉమ్మ‌డి పాల‌న‌లో కూడా ఇంత‌టి నిర్భంధం లేదేమో. ఇంతటి కుట్ర‌లు, కుతంత్రాలు లేవేమో. ఫ‌క్తు రాజ‌కీయ‌మంటూనే కేసీఆర్ రాజ‌కీయాల‌కే కొత్త బాష్యం చెబుతున్నాడు. ద‌ళిత‌బంధు అక్క‌డ్నే అమ‌లు చేయాల‌నే మొండి ప‌ట్టుద‌ల‌తో ఏవేవో లెక్క‌లు? ఒక‌దానికి ఒక‌టి పొంతన లేదు? మంద‌క్రిష్ణ మాదిగ మొన్న అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఒక్క‌దానికీ కేసీఆర్ వ‌ద్ద స‌మాధానం లేదు. రైతుబంధుకు అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తున్నావ్ క‌దా? మ‌రి ఎస్సీల‌ను కొంత మందిని ఎందుకు ఎంచుకున్నావ్‌? కులసంఘాల భ‌వ‌నాలు హైటెక్‌ సిటీలో మీ కుల‌పోళ్లకు కేటాయించిన ద‌గ్గ‌ర కేటాయిస్తావా? కేబినెట్‌లో మ‌రొక‌రికి అవ‌కాశం ఇస్తావా? చాలా ప్ర‌శ్న‌లే వేసిండు. దానికి కేసీఆర్ వ‌ద్ద స‌మాధానం ఉండ‌దు. ఒక్క‌టే ల‌క్ష్యం… ఈట‌ల రాజేంద‌ర్‌ను చుట్టిముట్టి ఉక్కిరి బిక్కిరి చెయ్యాలె. మ‌ళ్లీ రాజ‌కీయంగా లేవ‌కుండా బొంద‌పెట్టాలె. అంతే.

మ‌ర‌యితే హుందా రాజ‌కీయాలు న‌డుపొచ్చు క‌దా. మ‌రీ ఇంత చిల్ల‌రెందుకు? ఇంత దిగ‌జారుడెందుకు? ఇంత‌టి నిర్భంధం ఎందుకు? అంత‌లా నిఘా ఎందుకు? ఆఖ‌రికి బ‌య‌ట తిండి తింటే ప్రాణాల‌కే ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని ఈట‌ల‌ను మిగిలిన వారు హెచ్చ‌రించేంత దుస్థితి రావ‌డానికి కార‌ణం ఎవ‌రు?
ఈట‌ల అంత ప్ర‌మాద‌కారా? అంత‌టి అవినీతి ప‌రుడా? ఒక్క సీటు కోసం కేసీఆర్ పెద్ద‌రికం పోగొట్టుకొని, మిగిలిన మంత్రుల‌ను బ‌పూన్లుగా చేస్తున్నాడు. హుజురాబాద్ ప్ర‌జ‌లు విస్మ‌యం చెందేలా, ఏవ‌గించుకునేలా, ఇత‌ర ప్ర‌జ‌లు న‌వ్వుకునేలా చేసుకుంటున్నారు. కేసీఆర్‌కు అంత‌లా వ‌ణుకెందుకు? అంత‌లా భ‌య‌ప‌డుడెందుకు? మ‌రీ ఫ్యాక్ష‌నిస్టు రాజ‌కీయాల‌ను త‌ల‌పించేలా .. మున్ముందు కేసీఆర్ మ‌దిలో ఇంకెన్ని వ్యూహాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో? కేసీఆర్‌ను గుడ్డిగా అభిమానించేవాళ్ల‌కు కూడా ఓ ద‌శ‌లో ఆయ‌న వైఖ‌రి చూసి రోత పుడుతుంది కావ‌చ్చు. ఆ హుజురాబాద్ ఎన్నిక తొంద‌ర‌గా అయిపోతే బాగుండు.

ఇంకా కేసీఆర్ అవ‌త‌రాల‌ను ఇంకెన్ని చూడాలో? ఆయ‌న ఆడే రాజ‌కీయ వికృత క్రీడ‌లు ఎవ‌రి ఊహ‌కు కూడా అంద‌దు. మ‌రీ ఇంత పైశాచిక‌త్వ‌మా? ఏనుగు పోతుంటే కుక్క‌లు మొరుగుతాయ‌న్న‌వు క‌దా బాసు నువ్వే… హుజురాబాద్‌ను అలా లైట్‌గా తీసుకోరాదు. నువ్వే క‌ద‌న‌రంగంలోకి దిగితే చాలా చీప్‌గా ఉంది. మీ మంత్రులు ఎలాగూ నీ మెప్పు కోసం ఏమైనా చేసి గెలిపించుకు వ‌స్తారు. మీ చేత ష‌బాష్ అనిపించుకుంటే చాలు వాళ్ల జీవితాలు ధ‌న్య‌మైపోతాయి. నీకెందుకంత శ్ర‌మ‌?