సాయవ్వ కు సెల్యూట్ !

పెట్రోల్ ధర వంద దాటిన తరువాత తప్పనిసరి అయితేనే అది కూడా పిల్లలతో కలిసి వెళ్ళేది ఉంటే కారు బయటకు తీస్తున్న. వెయ్యి రూపాయల పెట్రోల్ ఒక్కరోజే ఖతం అవుతోంది. అందుకే మొన్న బాన్సువాడ లో మా రిపోర్టర్ల తో సమావేశం కోసం వెళ్లేందుకు పల్లె వెలుగు బస్సు ఎక్కి కూర్చున్న. ముగ్గురి సీట్లో టీచర్ గోపాల్ శర్మ కూర్చుని ఉన్నడు. నన్ను చూసి పక్కన కూర్చో మన్నడు. నా పక్కన ఓ అవ్వ వచ్చి కూర్చున్నది. నేను గోపాల్ శర్మ మాటల్లో పడ్డాం. కండక్టర్ రాగానే జర్నలిస్ట్ పాస్ చూపిన. సాయవ్వ చెక్కుడు సంచి తీసి 50 రూపాయల నోటు తీసి గుడి మెట్ కు రెండు టిక్కెట్లు ఇయ్యిమని కండక్టర్ ను అడిగింది. ఇంకో పది ఇవ్వమని కండక్టర్ చెప్పగానే ఇరువై ఐదే కదా అన్నది. లేదమ్మా.. ఇప్పుడు ముప్పై అయింది బస్ చార్జీ అని కండక్టర్ చెప్పింది. ‘ వాని ఇంట్ల మన్నువడ .. మొన్ననే పెంచిండు. మళ్ళా పెంచిండా ‘ అని తిట్టుకుంటూ పది నోటు తీసి కండక్టర్ చేతిలో పెట్టింది. బస్సు కిరాయలు గింతగనం పెంచితే ఎట్లా అని తిట్టుకో సాగింది. ఉండబుద్ది కాక ‘ ఏ ఊరమ్మ ‘ అని అడిగితే కరక్వాడి అని చెప్పింది. పేరు అడిగితే సాయవ్వ అని చెప్పింది. ఏం పని చేస్తావని అడిగితే ఎవుసం అని జెప్పింది. ఎన్ని ఎకరాల భూమి ఉందని అంటే ఆరెకరాలు ఉందని, కొడుకు ఎవుసం చేస్తడని చెప్పింది. పించన్ వస్తదా అని అడిగితే రెండు వేలు వస్తదని చెప్పింది. రైతు బంధు గురించి అడిగితే వస్తుందని , ఎందుకు సారు …అన్ని అడుగుతున్నావు అని ప్రశ్నించింది. ఏమి లేదమ్మా నీకు కేసీఆర్ సర్కార్ ఇన్ని ఇస్తున్నప్పుడు బస్సు కిరాయ్ పెంచితే తప్పు ఎట్లా అయితదని ఎదురు ప్రశ్నించిన.
ఆమె ఒంటి కాలు మీద లేచింది. మంచి నూనె పాకెట్ రెండు వందలకు పెరిగింది. గ్యాస్ బుడ్డి ఎయ్యి దాటింది. కరెంటు బిల్లు డబుల్ అయింది. ఉప్పు, పప్పు అన్నీ పెరిగినయి. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగినాయి. సూదులు, మందుల ధరలు పేంచిండ్రు. పది నిమిషాల్లో ఇరువై సదివింది.
నేను ఊకొలేదు. ఆరు ఎకరాలకు యాడాదికి రూ 60 వేలు, ఫించన్ రూ. 24 వేలు సర్కార్ ఇస్తున్నది. రేషన్ బియ్యం ఇస్తుంది. ఇట్లా అన్ని కలిపితే నీ కుటుంబానికి లక్ష వస్తుంది అని లెక్కలు జెప్పిన.
అప్పుడు అందుకుంది సాయవ్వ…
తెలంగాణ వస్తె సదువుకున్న పొరగాండ్లకు ఉద్యోగాలు అస్తాయన్నడు. నా కొడుకు పదిహేను చదివి ఎవుసం జెస్తున్నడు. మా ఊళ్లే స్కూళ్ల సారుకు నెలకు జీతం డెబ్బై వేలు వస్తదట. నా కొడుకుకు ఉద్యోగం వస్తె ఆనికి కూడా జీతం అట్లనే అచ్చేది. కేసీఆర్ ఇస్తున్న రైతుబందు, ఫించన్ అన్ని కలిపితే సర్కార్ కొలువు ఉన్నోల్ల నెల జీతం అంత కాదు. అయినా రైతు బందు, పింఛన్ కేసీఆర్ ఇంట్ల కెళ్ళి ఇస్తుందా అని సుర్రుమన్నది. సాయవ్వ మాట్లాడిన మాటలు విని నివ్వెర్పోవడం నా వంతైంది. అయినా నేను ఊరుకోలేదు. కేసీఆర్ కు ఓటు వేస్తావా లేదా అని అడిగిన. ఇంకా బుద్ది లేక ఎస్తనా అన్నది.
ఇప్పుడు అట్లనే అంటవ్..ఓట్లు రాంగానే పైసలు ఇస్తే మళ్ళా ఓటు కేసీఆర్ కే ఎస్తవని అన్న. ఓటుకు ఐదు వేలు ఇచ్చినా వేయనంటే వేయమని ఖరాఖండిగా చెప్పింది.
ఆమె దిగాల్సిన గుడిమెట్ రానే వచ్చింది. ఇగ పోత సారు అంటూ సాయవ్వ బస్సు దిగిపోయింది. చాన మంది అంటుంటరు.. పైసలిస్తే ఓట్లు వేస్తరని, కానీ జనం చాలా చైతన్య వంతులు. నమ్మి ఓట్లు ఎట్లా వేస్తారో, తమకు అన్యాయం జరిగినపుడు అదే చైతన్యంతో బుద్ది చెబుతారని సాయవ్వ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం పాలకుల బాధ్యత !

Venu Gopalchary (senior journalist)