కేసీఆర్ ఏనాడైతే దళితబంధు పథక రచన చేసి ప్రకటించాడో ఆనాటి నుంచి కులాల వారీగా ఆత్మగౌరవ నినాదం మొదలైంది. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మళ్లీ ఆత్మగౌరవం మాట వినిపిస్తున్నది. స్వపరిపాలనలో అందరికీ మేలు జరుగుతుంది.. అంతా ఆత్మగౌరవంతో బతుకుతారనే నమ్మకం అన్ని వర్గాల్లో బలంగా ఉండేది. స్వానుభవంలో మాకేం వచ్చింది? మేమేం బాగుపడ్డాం? అంతా వాళ్లకేనా? మాకేం లేదా? అనే ప్రశ్నలు మెల్లమెల్లగా ఉత్పన్నమవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాలు, స్థితిగతుల పై ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌కు ఆపార అనుభవం ఉంది. ఏ కులం ఆర్థిక, రాజకీయ పరిస్థితి ఎలా ఉందో ఆయనకు తెలుసు. సామాజికంగా ఏ కులాలు వివక్షకు గురవుతున్నాయో కూడా తెలుసు. అదంతా ఒక కోణం. ఎప్పుడైతే టీఆరెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాడు చేసిందో అప్పటి నుంచే ఆయన పరిపాలకుడిగా మారాడు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సుస్థిరత ఈ రెండే ప్రాధాన్యాంశాలు. ఏ నిర్ణయం తీసుకున్న ఈ రెండింటికీ లింకై ఉన్న నిర్ణయాలే, పథకాలే.
ఏదో ఒక సందర్భంలో రాజకీయ అవసరాల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిదే దళితబంధు. దీంతో దళితులందరికీ మేలు జరిగి ఆర్థికాభివృద్ధి సాధించి వివక్ష దూరమయ్యేది ఏముండదు. ఇదొక ప్రయోగం అనొచ్చు. మంచిదే. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు తమ ఆత్మగౌరవం మాటేమిటి అనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కేసీఆరే. తన అవసరాల రీత్యా ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని పథకాలు రూపొందించడంలో ఆయన దిట్ట. తక్షణ రాజకీయ అవసరం కోసం ఆలోచించి రూపొందించే పథకాలు అప్పటికప్పుడు లాభం చేస్తుండొచ్చు కానీ దీర్ఘకాలంలో పనికి రావు. ఇలాంటి నిర్ణయాలతోనే కేసీఆర్ అబాసు పాలవుతున్నాడు.
బీసీ సంఘాలు బీసీ బంధు కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఆయన కల్పించాడు. ఎస్సీలు దూరమవుతున్నారనే తన రాజకీయ కోణం లెక్కల్లో భాగంగా దళితబంధు వచ్చిందనేది కొంత మంది వాదన. ఇప్పుడు బీజేపీకి ఇదో అస్త్రంగా మారింది. బీసీలను తమ వైపు లాక్కోవాలనే కొత్త ఎత్తుగడకు తెర తీసింది. బడుగుల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో బీసీలకు దగ్గరయ్యందేకు ప్రయత్నం చేస్తుంది.
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ కావడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చిన అంశం. పరిస్థతి ఎట్లా తయారైందంటే.. మీరు దళితులను దళితబంధుతో ఆకర్షిస్తే మేము ఆత్మగౌరవం పేరుతో బీసీల ఓట్లు కొల్లగొడుతాం అనే విధంగా బీజేపీ వ్యవహారం కనిపిస్తున్నది. మరో వైపు సమాజంలో వివక్షకు గురవుతున్న కులాలు, పొలము, పుట్ర లేని కులాలు, సొంత ఇల్లు, ఖాళీ స్థలం కూడా లేని కులాలు దళితుల్లోనే కాదు బీసీ కులాల్లో చాలా మంది ఉన్నారు. ఇక్కడే ఆత్మగౌరవం ముచ్చట మళ్లీ తెర పైకి వచ్చింది. ఇది ఇంతింతై వచ్చే జనరల్ ఎన్నికల నాటికి ప్రధాన నినాదంగా మారినా ఆశ్చర్యం లేదు.

