కాంగ్రెస్‌పై ఆ పార్టీ క్యాడ‌ర్‌కు, నాయ‌క‌త్వానికి ఆశ‌లు చిగురిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి పై గంపెడు న‌మ్మ‌కంతో వారున్నారు. ఏదో మ్యాజిక్ చేస్తాడు. కాంగ్రెస్‌కు పూర్వవైభ‌వం తెస్తాడు. అధికారం వ‌శ‌మ‌వుతుంది. ఇది అసాద్య‌మేమి కాదు. ఇలాంటి ప్ర‌గాఢ విశ్వాసంతో ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఉనికిలోకే లేకుండా పోయిన కాంగ్రెస్‌కు.. ఒక్క‌సారి వెయ్యేనుగుల బ‌లం వ‌చ్చినంత‌గా ఫీల‌వుతున్నారు. దానికి కార‌ణం రేవంత్‌రెడ్డే. కొంద‌రికిన‌చ్చినా.. న‌చ్చ‌క‌పోయినా.. ఓటుకు నోటు దొంగ అని పిలుచుకున్నా… ఇప్పుడు ఇలాంటి ఫైర్ బ్రాండే స‌చ్చిన కాంగ్రెస్‌కు జీవం పోస్తాడ‌ని భావిస్తున్నారంతా. అధిష్టానం కూడా ఇదే ఆలోచ‌న చేసింది. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి పార్టీకి కొత్త‌గా వ‌చ్చిన రేవంతుడికి అవ‌కాశం ఇచ్చింది.

 

ఆదిలో లుక‌లుక‌లు, అల‌క‌లు, ఆగ్ర‌హావేశాలు… ఇప్పుడంతా చ‌ల్ల‌బ‌డింది. ఇక పార్టీ లేవదా? కేసీఆర్ కొట్టిన దెబ్బ‌ల‌కు ఇప్ప‌ట్లో కోలుకుంటామా? అని నిర్వేదంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల‌కు రేవంత్‌రెడ్డి క‌చ్చింతంగా ఓ ఆశాకిర‌ణ‌మే. ప్ర‌జ‌ల్లో కూడా ఇలాంటి భావ‌నే ప్రోదిచేసుకుంటున్న‌ది మెల్ల‌మెల్ల‌గా. దీంతో కాంగ్రెస్ అంచ‌నాలు ఎక్క‌డి దాకా పోయాయంటే రాబోయే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో అధికారం మాదే అని ఇప్ప‌ట్నుంచే క‌ల‌లు క‌నేదాకా. ఘ‌ర్ వాప‌సీతో వెళ్లిపోయిన వారిని, తెర మ‌రుగైన వారినీ చేర‌దీస్తున్నాడు. వారి చెంత‌కు చేరి అర్థిస్తున్నాడు. అంద‌రినీ క‌లుపుకుపోయే రేవంత్‌రెడ్డి మంత్రం ప‌నిచేస్తున్న‌ది.

ఓపెనింగ్ బాగానే ఉంది. కానీ మ‌ధ్య‌లో రేవంత్‌రెడ్డికి హుజురాబాద్ అగ్ని ప‌రీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. టీఆరెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది ఈ ఎన్నిక‌ను. ఏది ఏమైనా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెల‌వాల్సిందే. దాని కోసం కేసీఆర్ అప‌సోపాలు ప‌డుతున్నాడు. అష్ట‌క‌ష్టాలు ఎదుర్కొంటున్నాడు. స‌ర్వ శ‌క్త‌లూ ఒడ్డుతున్నాడు. ఎంత‌దాకైనా వెళ్తున్నాడు. దేన్నీ చూడ‌టం లేదు. ఎవ‌రి మాట‌ల‌కు వెర‌వ‌డం లేదు. ఒక్క‌టే గోల్ కేసీఆర్‌కు… ఈట‌ల రాజేంద‌ర్‌ను చిత్తుగా ఓడ‌గొట్టాలి. త‌న‌తో పెట్టుకుంటే చూశారా ఎలా మ‌ట్టిగొట్టుకుపోయాడో..? ద‌టీజ్ కేసీఆర్‌.. అని కాల‌ర్ ఎగ‌రేయాలి. అంతే.

మ‌రో వైపు ఈట‌ల గెలుపును కూడా బీజేపీ చాలెంజింగ్‌గా తీసుకున్న‌ది. సీఎంతో ఢికొట్టీ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ సీనియ‌ర్ నేత బీజేపీలో చేరితే గెలిపించుకుని త‌మ బ‌లాన్ని, తెలంగాణ‌లో భ‌విష్య‌త్ మాదే అనే సంకేతాన్ని ఇవ్వాల‌ని బీజేపీ సైతం శ్ర‌మ‌కోరుస్తుంది. అమిత్ షా తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా న‌జ‌ర్ పెట్టాడు. అంత ఈజీగా టీఆర్ఎస్‌ను గెల‌వ‌నివ్వ‌రు. ఎన్ని జిత్తులు ప‌న్నినా.. ఎత్తులు వేసినా.. కోట్లు కుమ్మ‌రించినా టీఆర్ఎస్ విజ‌యం ఇక్క‌డ న‌ల్లేరు మీద న‌డ‌క మాత్రం కానేకాదు.

ఈ రెండింటి మ‌ధ్యే ఇంత ట‌ఫ్ ఫైట్ ఉంది. మ‌రి కొత్త‌గా జీవం పోసుకుని మేమూ బ‌తికే ఉన్నాం.. బ‌రిలో మేం కూడా చూస్కుంటామ‌ని తొడ‌లు కొడుతూ కాంగ్రెస్ వ‌చ్చి చేరింది. ఈ పార్టీ వ్యూహం ఎలా ఉండ‌బోతుంది? అభ్య‌ర్థి ఎ వ‌రు? ఇంకా తేల‌లేదు. ఈట‌ల‌పై సానుభూతితో లోపాయికారిగా కాంగ్రెస్ స‌హ‌క‌రికరించి బీజేపీ గెలుపు కోసం స‌హ‌క‌రిస్తే మాత్రం కాంగ్రెస్ త‌న బొంద తాను తోడుకున్న‌ట్ల‌వుతుంది. ఎందుకంటే .. ఈ ఎన్నిక‌లో త‌న స‌త్తా చూపాల్సిన అనివార్య‌త కాంగ్రెస్‌కు ఏర్ప‌డింది. అది వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల‌కు శుభారంభంగా ఉండాలి. లేకపోతే లేవ‌డం క‌ష్ట‌మే. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డం క‌ష్టం. రాజ‌కీయాల్లో అసాధ్యాలేమీ ఉండ‌వు కానీ…. రెండో స్థానంలోనైనా నిలబ‌డితే కాంగ్రెస్‌కు మంచి భ‌విష్య‌త్తే ఉండ‌నుంది అనే సంకేతాలు వ‌స్తాయి. లేదా ఉనికి కోల్పోయే విధంగా ఆ పార్టీకి రిజ‌ల్ట్స్ వ‌స్తే మాత్రం రేవంత్‌రెడ్డి మీద ఇప్ప‌టి వ‌ర‌కు పెట్టుకున్న న‌మ్మ‌కాలు, వ‌చ్చినా భారీ అంచ‌నాలు ఉత్త‌వేన‌ని తేలిపోతుంది. వ‌చ్చిన ఊపు ఉఫ్‌మ‌ని పోతుంది. అది బ‌లుపు కాదు.. వాపేన‌ని తేలిక‌గా కొట్టిపారేస్తారు. అందుకే రేవంత్‌రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ అగ్ని ప‌రీక్ష‌. కాంగ్రెస్‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌.

You missed