డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం గురించి కేసీఆర్ తొలిసారి ప్రకటించినప్పుడు …. ఇదో అద్బుత పథకమని అంతా ప్రశంసించారు. అచ్చెరువొందారు. ఇది సాధ్యమేనా..? అని పెదవి విరిచారు. కానీ కేసీఆర్ అనుకుంటే.. మాటంటే అది జరిగి తీరుతుందని మెజారిటీ ప్రజలు భావించారు. ఈ ప్రకటన.. ఈ సంక్షేమ పథకం.. టీఆరెస్‌ను ఒడ్డుకు చేర్చిన దాంట్లో కీలకభూమిక పోషించిదంటే అతిశయోక్తి కాదు. కానీ అది అమలులో సాధ్యం కాదని కొద్ది రోజుల్లోనే కేసీఆర్‌కు తెలిసిపోయింది. పెరిగిన ధరలు, ఆ ఐదు లక్షల రూపాయల ఖర్చుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. చాలా చోట్ల ఇదే తంతు. మొత్తానికి ఇదో ఫెయిల్యూర్ స్కీంగా మిగిలిపోయింది. పంటికింద రాయిలా… కంటిలో నలుసులా కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని ఇది వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ఇండ్లు కాలేదు. అయిన చోట గృహ ప్రవేశాలు లేవు. లక్షల్లో దరఖాస్తులు.. వందల్లో ఇండ్ల నిర్మాణాలు.. నిర్మించిన ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేయడం తలకు మించిన భారం… తలనొప్పి వ్యవహారం. ఒకరిస్తే మరొకరితో తంటా.
ఇండ్లు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా .. అవి పాడుబడిన భవనాలను తలపించేలా మారాయే తప్ప గృహ ప్రవేశాలు జరగలేదు. కొన్ని చోట్ల. కాదు.. చాలా చోట్ల. ఎన్నికల హామీలో భాగంగా రెండో సారి ఈ తప్పును దిద్దుకునేందుకు కేసీఆర్.. కొత్త అస్త్రాన్ని ప్రయోగించాడు. డబుల్ ఇండ్లు అందరికీ నిర్మించి ఇవ్వలేం కాబట్టి.. సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఇస్తామన్నాడు. అంటే డబుల్ బెడ్ రూం ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి ఇస్తామనే హామీ నుంచి మెల్లగా తప్పుకుంది. సొంత ఇంటి స్థలం అనే కండిషన్ పెట్టింది. మరి సొంత ఇంటి స్థలం లేని వాళ్ల పరిస్థితి. ఇది ఈ పథకం నుంచి మెల్లగా పలాయనవాదం వైపు వెళ్లడమన్నమాట.
ఈ హామీ అసలు అమలుకే నోచుకోలేదు. చాలా చోట్ల ఎన్నికల ప్రచారంలో ప్రజలు దీన్ని నమ్మలేదు కూడా. అప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో జరుగుతున్నజాప్యం.. సొంత స్థలం అనే మెలిక ప్రజలకు నచ్చలేదు. ఇప్పుడు దీన్ని మూడు లక్షలకు కుదించారు. వాస్తవాన్ని గ్రహించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించడమూ కష్టమే.. ఐదు లక్షలు ఇవ్వడమూ భారమే… అని తెలుసుకున్నారు ఆలస్యంగా. ప్రజలు ఏమనుకున్నా సరే నిజం చెప్పాలనుకున్నారు. పని అయ్యేది చూడాలనుకున్నారు. ఓ మూడు లక్షలిస్తాం.. ఇక మీ తంటాలు మీరు పడండి.. అని సర్ధిచెప్పుకున్నారు. సమర్థించుకోవడం లేదు.. పథకాల హామీల అమలుపై కసరత్తు, వాస్తవికత.. బడ్డెట్.. సాద్యాసాధ్యాలు పరిశీలించకపోతే.. కొన్ని పథకాలు ఇలా కుంచించుకుపోతాయి. ఇంకొన్ని పట్టాలు కూడా ఎక్కవు.
