నిజామాబాద్:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మీద తెలంగాణ బిజెపి నాయకుల వివాదాస్పద వ్యవహార శైలిపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

బుధవారం మంత్రి నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడారు…

రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా జరగలేదని తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించి తెలంగాణ ప్రజలను ప్రధానిమోదీ అవమానపరుస్తుంటే,బిజెపి ఎంపిలు బండి సంజయ్, అర్వింద్ ప్రధాని మోదీ వ్యాఖ్యలను సమర్దిస్తున్నారని మండిపడ్డారు.పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు మోడీ చేత తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించమంటే..తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా జరగలేదన్న మోడీకి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.

పార్టీలు, రాజకీయాలు వేరైనా తెలంగాణ ప్రజల సెంటిమెంటు పై మాట్లాడితే ఈ ప్రాంత బిడ్డలుగా ప్రధానమంత్రిని అడగాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.తెలంగాణ ను మళ్లీ ఆంధ్రలో కలుపుతారా అని నిలదీశారు.విభజన చట్టంలో తెలంగాణ కు హక్కుగా రావాల్సిన వాటిని తీసుకురావాలని మోడీ దగ్గర ఇవి డిమాండ్ చేయాలని సూచించారు.బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇస్తున్నట్లు ప్రభుత్వ విద్యా సంస్థలు,నిధులు తెలంగాణ కు తీసుకు రావాలని డిమాండ్ చేసారు.
నిజామాబాద్ ఎంపి అర్వింద్ నాలుకకు మెదడుకు కనెక్షన్ కట్ అయ్యిందా…ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా అంటూ అర్వింద్ తీరుపై మండిపడ్డారు.అసలు తెలంగాణ బిడ్డవేనా…ఎందుకు అంత కండ కావరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసినం కాబట్టే మోడీ వ్యాఖ్యల బాధ మాకు తెలుసన్నారు. రాష్ట్ర పుట్టుకనే ప్రశ్నించారనే బాధతోనే మాట్లాడుతున్నామని చెప్పారు.

నీకు తెలంగాణ ఉద్యమం తెల్వదు ప్రజల సెంటిమెంట్ ను గౌరవించవని అర్వింద్ ను ఉద్దేశించి అన్నారు.పసుపుబోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేస్తే ఊర్లలో నుంచి అర్వింద్ ను ప్రజలు తరిమి కొడుతున్నారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పద్దతిగా జరగలేదని తెలంగాణ ప్రజలనే అవమానిస్తు మోడీ వ్యాఖ్యలు సమర్దిస్తున్న ఎంపి అర్వింద్ ను ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఇంకా ఉరికిస్తూ కొడతారని అన్నారు.

తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన మోడీ,మోడీ వ్యాఖ్యలు సమర్థిస్తూ రాష్ట్ర ఏర్పాటు పై అవమానకరంగా మాట్లాడుతున్న తెలంగాణ బిజెపి నాయకులు రాష్ట్ర ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పించాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

You missed