టీఆరెస్ జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం ఎట్ట‌కేల‌కు పూర్తి చేశాడు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. కొండంత రాగం తీసి … అన్న‌ట్టుగా కేటీఆర్ మార్కుతో వెలువ‌డిన పార్టీ ప్రెసిడెంట్ల నియామ‌కం… బ్లండ‌ర్ మిస్టేక్‌గా మిగిలిపోయింది. ఎంతో మంది ఈ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ వెంటే ఉన్న ఉద్య‌మ‌కారులు త‌మ‌కు ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోయినా.. ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్, పార్టీ అంటే ఇంకా వారికి అభిమానం పోలేదు. వీడ‌లేదు. కానీ కొత్త‌గా యువ‌రాజు త‌న మార్కు చూపాల‌నుకున్నాడు. త‌న వ‌ర్గానికే పెద్ద పీట వేయాల‌నుకున్నాడు. ఆ ఆలోచ‌న‌లే ఉద్య‌మ‌కారుల‌ను ప‌క్క‌న పెట్టేలా చేశాయి.

కార్పొరేష‌న్ ప‌దవులు ఇవ్వ‌క‌పోయినా.. క‌నీసం పార్టీ ప‌ద‌వులైనా వ‌రిస్తాయ‌ని ఆశ‌తో ఉన్నారిన్నాళ్లు. అవీ ఉసూరుమ‌నిపించాయి. కేటీఆర్ క్లారిటీగా మెస్సేజ్ ఇచ్చేశాడు. ఇది నా జ‌మానా. నా మార్కు. ఎవ‌రినీ ప‌ట్టించుకునేది లేదు. నా టీమ్ నాకు. నా టీమ్‌లో ఉద్య‌మ‌కారులుండ‌రు… అని తేల్చి చెప్పేశాడు. ఇక పార్టీనే అంటిపెట్టుకుని గ‌బ్బిలాల్లా వేళ్లాడుతున్న వారికి ఇక మీరు పార్టీలో ఉండి వేస్ట్ .. మీ దారి మీరు చూసుకోవ‌చ్చ‌నే సందేశం కూడా ఇచ్చిన‌ట్ట‌య్యింది.

TRS Party District Presidents List
ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల‌కు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వులివ్వ‌డం వెనుక అంత‌రార్థం ఏమిటో కేసీఆర్‌కే తెలియాలి. కొత్త వారికి పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారే ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతార‌ని ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఎవ‌రినీ ప్రోత్స‌హించ‌లేదు. దీంతో మ‌ధ్యేమార్గంగా త‌న అనుచ‌ర‌వ‌ర్గ‌మైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు చోటు క‌ల్పించాడు కేటీఆర్‌. ఆ ఎమ్మెల్యేల‌కు ప‌క్క‌న ఉన్న ఎమ్మెల్యేలే స‌హ‌క‌రించ‌ని ప‌రిస్థితి ఉంది. మ‌రి జిల్లా అంత‌టా వారికి మ‌ద్ద‌తు ల‌భిస్తుందా..? కేటీఆర్ త‌న మార్కును చూపించుకునే క్ర‌మంలో మొండిగా ముందుకు పోయాడా..? కేటీఆర్ నిర్ణ‌యం పార్టీకి మేలు చేస్తుందా..? న‌ష్టం చేస్తుందా…?

పార్టీ ప్రెసిడెంట్ల నియామ‌కంపై స‌ర్వ‌తా పెద‌వి విరుపు.. అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేటీఆర్ నిర్ణ‌యం స‌రైందా..? కాదా..? అని ప్ర‌త్యేకంగా చెప్పాలా…?