కాసాల జైపాల్‌రెడ్డి. తెలంగాణ అభిమాని. ప్ర‌కృతి ప్రేమికుడు. పాజిటివ్ దృక్ప‌థం ట‌న్నుల కొద్దీ ఉన్నోడు. స‌మాజం బాగు కోరేవాడు. ప‌ది మందికి స్పూర్తిగా నిలిచేందుకు అనుక్ష‌ణం ప‌రిత‌పించేవాడు. మోటివేష‌న్ క్లాసుల పేరుతో వ్య‌క్తిత్వ వికాసాన్ని క‌ల్పించాల‌ని, క‌లిగించాల‌ని క‌ల‌లు క‌న్న‌వాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. అన్నింటికీ మించి…. అంద‌రిలాగే ఉన్న‌త చ‌ద‌వు క‌లిగి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ.. ఉద్యోగాల నోటిఫికేష‌న్ కోసం చ‌కోరా ప‌క్షిలా ఎదురుచూసే ఓ సాధార‌ణ నిరుద్యోగి. స‌గ‌టు మ‌నిషి.

పైకి ఎంత చెప్పినా.. అత‌నికీ ఓ నేప‌థ్యం ఉంది. పుట్టింది రెడ్డి కుటుంబంలోనైనా.. పేద‌రికం చిన్న‌నాటి నుంచే వెంటాడుతున్న‌ది. దాన్ని అధిగ‌మించి ఉన్న‌త చ‌ద‌వులు చ‌దివాడు. అశోక్‌న‌గ‌ర్ అడ్డాగా.. ప‌క్కా నిరుద్యోగి ప‌డే క‌ష్టాల‌న్నీ ప‌డుతున్నాడు. అంద‌రిలా కాకుండా త‌న‌కో ప్రత్యేక‌త ఉండాల‌నుకున్నాడు. ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు మోటివేష‌న్ క్లాసులు తీసుకునేవాడు ఫ్రీగానే. అన్నీ చేసినా.. ఇంకా ఏదో వెలితి త‌న జీవితంలో. అదే ఉద్యోగం రాక‌పోవ‌డం. నిరుద్యోగిగానే వ‌య‌స్సు క్యాండిల్‌లా క‌రిగిపోవ‌డం. పైకి ఎంత గంభీరంగా క‌నిపించినా.. లోలోన కుటుంబ పేద‌రిక లోతులు ఊపిరి స‌ల‌ప‌నీయ‌కుండా.. బంధువుల వెకిలి మాట‌లు, అవ‌మాన‌క‌ర చూపులు.. జీవితంపై విర‌క్త క‌లిగించే సంద‌ర్భాలు అత‌న్నీ వీడ‌లేదు. ఎంత పాజిటివ్ దృక్ప‌థం ఉన్నా…. అత‌నిదీ ఓ మాములు మ‌న‌సేన‌ని చాలా సార్లు నిరూపిత‌మైంది. ఓ ఐదు సార్లు ఇంత‌కు ముందే ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించ‌డం ఇందుకు సాక్షం.

ఇప్పుడు ఆరోసారి. ఇలా నిజాంసాగ‌ర్‌లో విగ‌త‌జీవుడ‌య్యాడు. ప్ర‌భుత్వాన్ని నిందించ‌లేక‌. ఉద్యోగం రాకనే చ‌స్తున్నా అని చివ‌రి సారిగా కూడా ధైర్యం చేయ‌లేక‌.. త‌న‌పైనే అభాండం వేసుకున్నాడు. ఆరోగ్యం బాగాలేద‌ని, ఫైల్స్‌, గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌లు జీవితాన్ని అంతంచేసుకునేంత‌టి రోగాలా..? అదీ స‌మాజాన్ని చ‌దివిన ఓ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడికి.

You missed