కరోనా మొదటి వేవ్ ఏమో గానీ.. రెండో వేవ్‌లో ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుతిన్నాయి.రక్తాన్ని తాగేశాయి. ప్రాణాలే పెట్టుబడిగా వంద రెట్లు ఎక్కువగా ఫీజులు రూపంలో గుంజాయి. ఆ రోజులు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు రోజులు.. మళ్లీ మళ్లీ అలాంటి రోజులు రావబ్బా…..
ఇవి నేనంటున్న మాటలు కాదు.. ఓ ప్రైవేటు డాక్టరే స్వయంగా ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుని అన్న మాటలు. థర్డ్‌వేవ్‌లో కూడా ఇదే గిరాకీ ఉంటుందనుకున్నారు. మెడికల్ మాఫియా కోట్లు పెట్టి ఈ బిజినెస్‌లోకి దిగింది. కొత్తగా చాలా దవఖానాలే పుట్టుకొచ్చాయి. బడులు మూతబడ్డాయి కానీ.. దవాఖానలు మాత్రం మూడు బెడ్లు.. ఆరు కరోనా కేసులు అన్నచందంగా చేతినిండా కాసులే కాసులే. అలా నడిచింది అప్పుడు. మళ్లీ థర్డ్ వేవ్ తో కోటిశ్వరులు కావొచ్చని కలలు కన్న వారెంతో మంది ఉన్నారు. కొత్తగా మెడికల్ రంగాన్ని ఎంచుకుని దవాఖానల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వచ్చారు. పెట్టారు.

నష్టం లేని బిజినెస్. ఏడాదికేడాది… థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్.. అని ఇలా సీజన్‌లా గిరాకీ ఎవర్ గ్రీన్లా ఉంటుందని భావించారు. కానీ ఈసారి పోయినేడాదంతా గిరాకీ కాదు కదా.. అందులో పదో వంతు కూడా లేదు. దవాఖానలకు సీజన్ లేక పేషెంట్లు రాక.. వెలవెలబోతున్నాయి. కొన్ని దవఖానలకు మెయింటెన్స్ కూడా కష్టమైపోతున్నది. కారణం. ఓమెక్రాన్… కరోనా ఇలా ఎన్ని పేర్లతో భయభ్రాంతులకు గురిచేసినా.. అది పెద్దగా ఫలితం చూపలేకపోయింది. దాని ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఎవరూ దవాఖానల సైడుకు కూడా పోవడం లేదు. ఒక్కటే మంత్రం.. ఒక్కటే మాత్ర.. అదే డోలో. అంతే జ్వరం వచ్చిందా డోలో వాడితే సరిపోతుంది. గొంతు నొప్పి ఉందా.. అజిత్రోమైసిన్ .. దీనితో పాటు ఓ సి విటమిన్ టాబ్లెట్.. సరిపోతుంది. అలా కానిచ్చేశారు.
ఆఖరికి ఆర్ఎంపీ, పీఎంపీల దగ్గరకు పోయే వాళ్ల సంఖ్య కూడా తగ్గింది. అంత ఘోరంగా పడిపోయింది ప్రైవేట్ ఆస్పత్రుల బిజినెస్. ఏడాదికే ఎంత తేడా.. మూడో వేవ్ జనాల ప్రాణాలతో ఆడుకుని.. తమను కోటిశ్వరులను చేస్తుందనుకుంటే.. కోట్లు పెట్టిన దవాఖానలకు ఇంట్రస్ట్ మీద పడి అప్పుల పాలు చేసేలా ఉందని కొట్టుకు చస్తున్నారంట.. ప్రైవేటు దవాఖానల్లో పెట్టుబడి పెట్టిన బిజినెస్దారులు..
