మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకురాలేదంట‌.. వాళ్ల‌కు చీర‌, గాజులు ఇస్తారంట‌. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ మహిళా లీడ‌ర్లు ఈ ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించి మంత్రుల‌పై త‌మ తీవ్ర‌మైన నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. చీర‌లు, గాజులు అంటే చాత‌గాని వాళ్ల‌ని, వారు దేనికీ ప‌నికిరార‌ని, అవ‌మాన‌క‌ర రీతిలో అర్థాలు వ‌చ్చేలా ఉన్న పాత నానుడి ఇంకా మ‌న మ‌గ‌పుంగ‌వులు.. లీడ‌ర్లు మోసుకొస్తున్నారు. ఈ డైలాగుల‌ను స్వ‌యంగా ఆడ‌వాళ్ల‌తోనే చెప్పిస్తున్నారంటే.. రాజ‌కీయంగా మహిళ‌లు ఎంత బ‌ల‌హీనంగా ఉన్నారో.. వారిని మ‌గ లీడ‌ర్లు ఎలా ఆడిస్తున్నారో.. ఇది చూస్తే చాల‌దా..? మంత్రుల‌ను గాఢంగా తిట్టాల‌ని గాఢ‌మైన కోరిక వెనుక రేవంత్‌రెడ్డి పురుషాహంకారం కొట్టిచ్చిన‌ట్టు క‌నిపించింది.

ఆ మాట‌కొస్తే రేవంత్ ఒక్క‌డే కాదు.. మగ లీడ‌ర్ల‌లో దాదాపు ఇదే అభిప్రాయం ఉంటుంది. బ‌య‌ట‌ప‌డ‌రు. కొంద‌రు కుల పిచ్చోళ్లుంటారు. బ‌య‌ట‌ప‌డ‌రు. ఇదీ అలాగే. ఆడోళ్లంటే చుల‌క‌న వీళ్ల‌కి. ఏదో వాళ్ల‌ను ఉద్ద‌రించేశామ‌నే రీతిలో కొన్ని ప‌ద‌వులిస్తారు. మీటింగుల‌కు పిలుస్తారు. అలా మ‌గ రాజ్యాలు ఏలేందుకు మహిళ‌ల‌ను పావులుగా వాడుకుంటూ ఉంటారు. విషాద‌మేమిటంటే.. తాము పావులుగా మారుతున్నామ‌ని తెలియ‌న పావుల పాత్ర‌ల‌ను బ్ర‌హ్మాండంగా పోషించేస్తారు ఈ అమాయ‌క మ‌హిళా రాజ‌కీయ‌మ‌ణులు. ప్ఛ్‌..!

You missed