మీడియా అంటేనే సంచలనం ఉండాలి. రోజుకు ఏదో ఒకటి కుమ్మేయాలి. కొత్త వార్తలు. రోజూ కొత్త వార్త కావాలి.. అదీ సంచనలమై ఉండాలి. వైరల్ కావాలి. ఎలా దొరుకుతాయి. దొరకకపోతే మనమే వండి వార్చాలి. లేనిది ఉన్నట్టు రాయాలి. రాబోతున్నది వచ్చేసింది.. చంపేసింది అని రాయాలి. తోక అంటే పడగ అని రాయాలి. వస్తే చస్తారని ఇప్పుడే భయపెట్టి చంపాలి. ఇవన్నీ చేసేస్తున్నది మీడియా. ఇగో ఈ రోజు దిశలో కుమ్మేసి.. భయంతో కమ్మేసిన వార్త ఇది.
ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో పుట్టింది. అక్కడ డెత్ రేట్ లేదు. మనకన్నా అక్కడ వసతులు తక్కువ, వైద్యం తక్కువ , వనరులూ తక్కువే. మరి అక్కడే డెత్ రేట్ లేదు. ఇక్కడెలా ఉంటుంది. ఇది డెల్టా వేరియంట్‌కు తమ్ముడు లాంటిది… దీనికంతా సీన్ లేదని మొన్ననే సీసీఎంబీ చెప్పింది. ఏసియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి కూడా ఇంచు మించు ఇదే చెప్పాడు. అలాంటి వారి అభిప్రాయాలు మీడియాకు అవసరం లేదు. సంచలనం కావాలి. జనాలను అప్రమత్తం చేస్తున్నామనే బిల్డప్ వెనుక.. భయభ్రాంతులకు గురి చేసి చంపాలి. ఆ వార్త చక్కర్లు కొట్టాలి. పది మందీ దీని గురించే మాట్లాడుకోవాలి.
ఔను.. నిజమే. జనాల్లో భయం లేకుండా పోయింది. మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులు జనాలు. మరి అలాంటప్పుడు వారిలో ఓ భయం క్రియేట్ చేయాలె కదా అంటారా..? చేయండి మంచిదే. కానీ ఆ ముసుగులో.. ఆ సాకుతో ఇలా పేజీల పేజీల వార్తలు అరవీర భయంకరంగా కుమ్మేసి చంపేయడం ఎందుకు..? డీహెచ్ శ్రీనివాసరావు మాటల్లాగే ఉన్నాయి ఈమీడియా వార్తలు కూడా. ఆయన ఎప్పుడు ఏం చెబుతాడో తెలియదు.
డీహెచ్ మాటలు వినడం మానాలి. వార్తలు చూడటం మానాలి. పత్రికలు చదవటం ఆపేయాలి. మాస్కు పెట్టుకుని ఎవరి పనులు వారు జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. రెండు డోసులు వేసుకుంటే కూడా పనిచేయడం లేదని డబ్ల్యూహెచ్‌వో కూడా నిన్న ఏదో ప్రకటన చేసినట్టుంది. దాని మాటలు వింటే మనం ఇల్లు వదిలి బయటకు వెళ్లలేం. ఇప్పటికే వ్యవస్థలు కోలుకోలేదు. ఇక థర్డ్ వేవ్ వచ్చేసింది. చస్తారు.. అని ఈ భయపెట్టే వార్తలు, ప్రకటనలు చేస్తే వ్యవస్థలన్నీ ఇంకా కూలబడిపోయి.. చేసేందుకు పనిలేక.. తినేందుకు తిండిలేక.. అప్పులు పుట్టక, ఉపాధి లేక.. ఆగమాగమై.. అప్పుడు ఒమిక్రాన్‌తో కాదు కరువుతో చస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటారు.