అఖిల భారత రైతు పోరాట సమితి జాతీయ నాయకుడు రాకేశ్ టికాయిత్. ఆయనిప్పుడు రైతులకు పెన్నిధి. ఉద్యమ హీరో. మోడీ మెడలు వంచి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయిస్తున్న అలుపెరగని ధీరోదాత్తుడు. కేసీఆర్ మహాధర్నా చేపట్టిన మరుసటి రోజే మోడీ ఆ మూడు చట్టాలను రద్దు చేస్తున్నానని ప్రకటించడంతో టీఆరెస్ దీన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది. మంత్రుల దగ్గర నుంచి లోకల్ లీడర్ల వరకు ఇది కేసీఆర్ ఉద్యమ స్పూర్తికి లొంగే మోడీ ప్రకటన చేశాడని ఢంకా బజాయించారు.
కేసీఆర్ మాత్రం తెలివిగా.. మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేశాడని చెప్పుకొచ్చాడు. ఆ గొప్పతనం నాదే అంటే బాగుండదు కనుక. కానీ ఆ క్రెడిట్‌ను వదలుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. ఆయాచితంగా గొప్పతనం, పొగడ్తలు, ప్రశంసలు వచ్చే పరిస్తితిని కేసీఆర్ వదలుకోడు. ఇవంటే ఆయనకు చాలా ఇష్టం. అంతా తనను వేనోళ్ల పొగడాలి. ఎవరూ కించపర్చొద్దు. విమర్శించొద్దు. దేవుడు అని కొనియాడాలి. జాతిపిత అని ఆకాశానికెత్తాలి. బోళా శంకరుడుని ఢమరుకం మోగించాలి. ఇలా చేయడమంటే కేసీఆర్‌కు ఎంతో ప్రీతి. అందుకే రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు 700మందికి పైగా 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తానని ఉదారంగా ప్రకటించేశాడు. తన చేతికి ఎముక లేదని మరోసారి నిరూపించుకున్నాడు.
అనుకున్నట్టేం జరగలేదు. టీఆరెస్ నుంచి మాత్రం ఢమరుకం చప్పుళ్లు వచ్చాయి. వేరే చోట నుంచి విమర్శల జడివాన మొదలైంది. నమస్తే తెలంగాణలోనైతే మోడీ గాయానికి.. కేసీఆర్ సాయం అని పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలా.. తాటికాయంత అక్షరాలతో రాసి తరించి పోయాడు టీకే. కేసీఆర్ ఆ ఎడిటర్‌ను పెట్టుకుంది అందుకే మరి. బాగా భజన చేయాలి. ఎలా గంటే అది భజన అని కేసీఆర్‌కు కూడా తెలియద్దు. ఆ మైకంలో .. ఆ పొగడ్తల పన్నీరు మత్తులో అలా అలా తేలియాడాలి. అదే చేశారు ఈ బృందమంతా.
లోకల్‌గా బాగనే సెటైర్లు వచ్చాయి. ఇక్కడ రైతులు లేరా..? అక్కడ్నే ఉన్నారా..? ఇక్కడ ధాన్యం పరిస్థితి ఏందీ..? అని ఎవరికి తోచింది వారు కేసీఆర్ మీద సెటైర్లు, విమర్శలు గుప్పించారు. కానీ కేసీఆర్ అవన్నీ పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో ఊరికే వచ్చే మైలేజీని ఎలా పోగొట్టుకుంటాడు. పోతే కొన్ని కోట్లు ఖర్చవుతాతయి. కానీ ఇలాంటి సందర్భం పదే పదే వస్తుందా..? అది కేసీఆర్‌కు తెలుసు. ఆయన సమయస్పూర్తి ముందు, రాజకీయ చతురత ముందు ఈ తిట్లు, శాపనార్ధాలు ఎవరికి కావాలి…?
ఇదంతా ఇలా ఉంటే…. ఈ జాతీయ రైతు నేత టికాయత్ హైదరాబాద్‌కు వచ్చి అదే ధర్నా చౌక్‌లో కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టాడు. ఇక్కడే భజన బృందమంతా ఖంగుతిన్నది. నోరెళ్లబెట్టింది. ఇదేందిరా బై.. ఇంత చేస్తే మా గడ్డ మీదకొచ్చి మమ్మల్ని పొగిడి పొగిడి పోవాలె గానీ, ఈ తిట్ల దండకమేందీ..? అని కేసీఆర్ సహా గులాబీ దళమంతా అవాక్కయ్యింది. కేసీఆర్ చేసింది అపాత్రదానమేనని టికాయత్ నొక్కి మరీ చెప్పాడు. మోడీకి సహాయం చేసే పార్టీగానే అభివర్ణించాడు. కేసీఆర్ గతం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన్ను నమ్మేలా లేవని కుండబద్దలు కొట్టాడు.
టికాయత్ మాట్లాడిన ప్రతీ మాట వాస్తవమే. ఇందులో రాజకీయం లేదు. నగ్న సత్యాలు తప్ప. కానీ ఒక్కటే కేసీఆర్‌కు అర్థం కాని విషయం… మూడు లక్షలు ప్రకటించిన తర్వాత కూడా కొంత తనపై సానుభూతి చూపకుండా ఇలా నిర్దయగా తిట్టడమేంటని.