లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆరెస్ పార్టీలో చిచ్చు రేపింది. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. పార్టీకి రాజీనామా లేఖను రాస్తూ.. రెండు పేజీల నిండా కేసీఆర్ వైఖరిని ఎండగట్టాడు. తన మనసులోని ఆవేదనను వెళ్లగక్కాడు. తనకు ఎన్నోసార్లు ఎమ్మెల్సీని చేస్తానని మాటిచ్చి కేసీఆర్ తప్పాడని, కనీసం కలిసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదన్నాడు. ఉద్యమ ద్రోహులను చంకనేసుకుని తిరుగుతున్న కేసీఆర్.. వారిపై ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి దుమ్మెత్తి పోశాడు. ఉద్యమకారులను పట్టించుకోకుండా కేసీఆర్ అవమానిస్తున్నాడని తూర్పారబట్టాడు. ఇదిప్పుడు టీఆరెస్ పార్టీలో చర్చకు తెర తీసింది. చాలా మంది ఇప్పటికీ టీఆరెస్‌లో కొనసాగుతున్న ఉద్యమకారులు కేసీఆర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఇలా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. పార్టీ నుంచి బయటపడుతున్నారు.