తెలంగాణ వ్యాప్తంగా గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతివృష్టి కారణంగా జోరు వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రవాణ వ్యవస్థ స్తంభించి పోయింది. రోడ్లన్నీ జలమయ్యాయి. పంటలనీ్న నీటమునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కరెక్టుగా ఎంత నష్టం జరిగిందన్న అంచనాలను వ్యవసాయాధికారులు వేయలేకపోతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేస్తామని చెబుతున్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా పత్తి పంటకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సోయాబీన్, మొక్కజొన్న, వరి పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.