నమస్తే తెలంగాణకు తత్వం బోధపడ్డది. మన పత్రికను ఎవరూ చదవడం లేదు.. అసలు మనమిచ్చే వార్తలు ఎవరికైనా నచ్చుతున్నాయా? అని మేథోమథనం ప్రారంభించింది ఆ పత్రిక. ఇలాగైతే కాదు.. మనం మారాలి. మారి తీరాలి. ఎట్లనే ఉంటే కష్టం. రానున్నవి ఎన్నికల సీజన్. మనం మరుగున పడిపోతాం.. అని మేల్కొలుపు పాఠమందుకుంది తాజాగా.
నానాటికి ఈ పత్రిక సర్క్యూలేషన్ పడిపోతూ వస్తున్నది. కరోనా టైంలో అందరూ తీసేసినట్టే టాబ్లాయిడ్లు (మినీ) ఎత్తేశారు. ఆ తర్వాత ఏవీ ఇవ్వడం లేదు.. ఇదిగో మేమిస్తున్నామంటూ మళ్లీ స్టార్ట్ చేశారు. కానీ కంటెంట్ మారనప్పుడు.. ఎన్ని పేజీలిస్తే ఏం లాభం.? జిల్లా టాబ్లాయిడ్లు ఉంటే ఎవరు చదువుతారు…? అవే రొడ్డకొట్టుడు వార్తలు. కొత్తదనం లేదు. ప్రత్యేక కథనాలు లేవు. జీతాలు ఎప్పుడు పీకేస్తారో తెలియని అయోమయ పరిస్థితులు ఇప్పటికీ. ఇంక పాపం ఆ విలేకరులకు కొత్త ఆలోచనలు , కొత్త కథనాల ఆలోచనలు వస్తాయా? వచ్చినా అవి ఇస్తే పెట్టుకుని ప్రోత్సహిస్తారా? ఎందుకొచ్చిన గొడవ..అవే పథకాల సక్సెస్ కథనాలు.. అవే లీడర్ల పాట్లు. ఫీట్లు.. అంతే ఆ రోజుతో డ్యూటీ ముగిసింది. జీతం నిలబడ్డది. జీవితం కొనసాగుతున్నది. అనుకుని బ్రతుకు జీవుడా అని గడపడమే. అంతటి సెక్యూరిటీ మరీ నమస్తేలో జాబ్ అంటే. ఇప్పుడు కొత్తగా నిద్రలేచారు. ప్చ్ .. ఇలాగైతే లాభం లేదోయ్.. మనం మారాలి. అని తాపీగా .. చాంతాడంత ఓ సూచన పట్టికను తయారు చేసి వదిలారు. అందులో ఏమేమీ చేయాలి.. ఏమేమీ రాయాలి… ప్రత్యేక కథనాలేమివ్వాలి…? అని.
ఎన్నిసార్లు మేథోమథనం జరిపినా.. టీఆరెస్ లీడర్ల వార్తలు నింపాల్సిందే. కార్యక్రమాలు రావాల్సిందే. వాళ్లను కీర్తిస్తూ స్టోరీలు ఇవ్వాల్సిందే. ఫోటో, పేర్లు.. ఏవీ రాకున్నా హైదరాబాద్‌లోని ఎడిటర్ దాకా ఫోన్లు వెళ్లాల్సిందే. మరి ఇంత ఇరకాటంలో, ఇబ్బందిలో, అభద్రతలో పనిచేస్తున్న విలేకరికి ఇంకా తిరిగి కథనాలు సేకరించే ఓపికా, ఇంట్రస్టు ఉంటాయా..? గొంగట్లో అన్నం తింటూ.. పోగులు ఏరుసుకున్నట్టు.. మనం ఉన్నదే ఆ వ్యవస్థలో. వాళ్ల కోసమే. మరి వాళ్ల వార్తలు రాయకుండా.. వదిలేసి పేపర్ నడపగలరా..? కాని పని. ఇది నిష్టుర సత్యం.
కానీ, ఏదో చేద్దామనుకుని ఇలా ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ అది అమలు కాదు. ఆ ఇచ్చిన సలహాలు కూడా ప్రజలను చదవించే కథనాలు కావు.. మళ్లీ ప్రైవేటు బస్సు సర్వీసు కథనాలు, ఇంకా గుడులు, గోపురాలు… మరి పథకాల లోపాలు, అధకారుల అవినీతి, పోలీసులు పని తీరు.. నెగిటివ్ కథనాలు వద్దా..? వాస్తవాలు రాయనప్పుడు ఎవరెందుకు మీ పత్రిక చదవాలి..? ఏవో ప్రత్యేక కథనాలిద్దామనే ధ్యాసే తప్ప.. పాఠకులకు ఏం కావాలో అసలు మీకు తెలుసా..?
మొన్న హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ గెలిస్తే.. దాన్నిఎందుకు జీర్ణించుకోలేకపోయారు. మీకు అజీర్తి అనిపించింది పాఠకులకు కూడా అజీర్తే అయి ఉండాల్సిందేనా..? మీరు మొదటి పేజీలో పరిచిన వార్తలే పాఠకులు కోరుకునేవా..? రోజూ కేసీఆర్ బొమ్మ లేనిదే నమస్తే బయటకు వదలరు కదా.. మరి ఇదేనా పాఠకుడు కోరుకుంటున్నాడు. అన్ని వార్తలు.. వార్తలుగా ఎందుకు కవర్ కావు. మన వార్తలు మనం చెప్పుకుని, మన గొప్పలు మనం కీర్తించుకుని, హుజురాబాద్‌లో గెలిచింది టీఆరెస్సే అని మనం భావించుకుని అదే భ్రమల లోకంలో మనం బతికేస్తూ .. పాఠకులను కూడా అందులోనే పరుండబెట్టే బృహత్ ప్రణాళికలు మీకే సాధ్యం.. ఇలా..? కాదంటారా?
మళ్లీ పైనుంచి మనం మారాలి. మార్పు రావాలి. అని కటింగొక్కటి. పెద్ద తలకాయలు మీలోనే సమన్వయం లేదు. ఒకరికొకరు రోజు పీకులాడుకోవడమే తప్ప పత్రిక బాగుకోసం ఏనాడైనా సమిష్టిగా ఓ గంట పాటు కూర్చుని ఆలోచించారా?
తెలంగాణ ఆత్మ.. తెలంగాణ పదాలు.. ఈ రెండూ కావాలని సూచించారు. కరెక్టు ఇవే లోపించాయి. కావాల్సింది కూడా ఇదే.