హుజురాబాద్ దెబ్బ‌తో టీఆరెస్ ప‌ని అయిపోయింది.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ప‌నైపోయింది. లేవ‌డం క‌ష్టం. విజ‌యగ‌ర్జ‌న స‌భ వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోనే ఉంటున్నాడు. కేటీఆర్ ప్యారిస్‌లోనే మ‌కాం వేశాడు. ఆ పార్టీ ప‌రిస్థితి అంతా ఆగ‌మాగ‌ముంది.. హుజురాబాద్ ఫ‌లితాల త‌ర్వాత చాలా మందిలో ఇవే అభిప్రాయ‌లున్నాయి. ప్ర‌తిప‌క్షాలైతే ప‌నిగ‌ట్టుకు ప్ర‌చారం చేస్తున్న‌దిదే.

కేసీఆర్ మారాడు.. త్వ‌ర‌లో జిల్లాలు తిరుగుతాడు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరుచుకుంటాయి.. అని మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌డ్డించేశారు. కానీ కేసీఆర్ ఏం మార‌డు. అంతే ఉంటాడు. అందులో సందేహం లేదు. కానీ కేటీఆర్ మాత్రం వెంట‌నే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ డిసైడ్ చేసుకుంటున్న‌ట్టు క‌నిపించింది. ప్లీన‌రీ తర్వాత పూర్తి పార్టీ ప‌గ్గాలు కేటీఆర్ చేతిలోకి వ‌చ్చాయి. రోజు రోజుకు కేటీఆర్‌లో రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త క‌నిపిస్తున్న‌ది. అంతా మీదేసుకుని న‌డిపించాల‌నే త‌ప‌న క‌నిపిస్తున్న‌ది. దుందుడుకు స్వ‌భావానికి జ‌ర స్వ‌స్తి ప‌లికిన‌ట్టే ఉన్నాడు. ప్యారిస్ నుంచి రాగానే క్యాడ‌ర్‌తో మ‌మేకమ‌య్యేందుకు రెడీ అయ్యాడు. ఈనెల 29న వ‌రంగ‌ల్ నిర్వ‌హించ త‌ల‌పెట్టిన విజ‌య‌గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతం కోసం ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగాడు.

ఈ నెల 9 నుంచి వివిధ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌ర‌గనున్న స‌భ‌ల‌కు హాజ‌రుకానున్నాడు. 9న కామారెడ్డిలో జ‌రిగే స‌భ‌కు ఇప్ప‌టికే ఆహ్వానం అందింది. మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌విత హాజ‌ర‌వుతున్నారు. ఈ మీటింగు మొద‌లు.. ఇక అన్ని మీటింగుల‌కు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లా కేటీఆర్ విస్తృతంగా ప‌ర్యటించనున్నాడు. హుజురాబాద్ ఓట‌మి త‌ర్వాత పార్టీ క్యాడ‌ర్లో ఆవ‌హించిన నిస్స‌త్తువ‌ను పోగొట్టి నూత‌నోత్తేజాన్ని నింపేందుకు నేనున్నానే భ‌రోసానిచ్చేందుకు కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగాడు.

You missed