ఏ మూడ్‌లో అన్నాడో.. ఏం ఆశించి అన్నాడో తెల్వదు కానీ, రేవంత్ ఈ మాటని పెద్ద ఇరకాటంలోనే పడ్డాడు. పోలీస్ వ్యవస్థ మీద తన ఆక్రోశాన్ని, కోపాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. అధికార టీఆరెస్ పార్టీ ఆ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చెప్పాలనుకున్నాడు. దుర్మార్గాలు పెరిగిపోతున్నాయనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలనుకున్నాడు. ఇవన్నీ ఒకేసారి చెప్పేందుకు రేవంత్‌రెడ్డి వాడిన పద ప్రయోగం వికటించి అది అతని మెడకే చుట్టుకుంటున్నది.
నక్సలైట్లు ఉంటే బాగుండు.. అని రేవంత్ అన్నాడు. అంటే.. అక్రమాలు, దుర్మార్గాలు చేసే నేతలను నక్సలైట్లు చంపుతారని కావొచ్చు.. పోలీసులను కూడా చంపడంతో ఆ వ్యవస్థలో ఓ భయం ఉంటుందని కావొచ్చు.. మొత్తానికి నక్సలైట్లు ఉనికిలో ఉంటే ఇటు రాజకీయ, అటు పోలీసు వ్యవస్థ గాడిలో ఉంటుందనే భావన కావొచ్చు.. ఏదో ఒకటి.. అలా తన మనసులోని మాట బయట పెట్టేసి చర్చకు తెర తీశాడు. పోలీస్ వ్యవస్థ మీద రేవంత్ మాట్లాడిన తీరుకు పోలీస్ శాఖ ఇప్పటికే స్పందించింది. ఇది తమకు పరువు నష్టం కలిగించేదిగా ఉందని కూడా సోషల్ మీడియాలో డీజీపీ పేరుతో ఓ కామెంట్ పోస్ట్ కాబడింది. ఇది కూడా వైరల్ అయ్యింది.

తాజాగా రేవంత్ అన్న మాటలు కొత్త రంగు పులుముకున్నాయి. దీనిపై రెడ్డి సామాజిక వర్గం స్పందించింది. అసలు నువ్వో రెడ్డివేనా…? నక్సలైట్లు ఆనాడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది రెడ్లనే. ఎక్కడ చూసినా రెడ్లే ఎక్కువగా వాళ్ల చేతుల్లో చనిపోయారు. మరి నువ్వు రెడ్డి వై ఉండీ.. నక్సలైట్ల రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటావా? అని కడిగి పారేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లను ఎన్కౌంటర్లు చేసి చంపారు కాబట్టి.. వాళ్లు చేసేది తప్పని ఆ రెండు పార్టీలు ఒప్పుకున్నట్టే కదా..? అని కూడా ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల్లో నువ్వు ఉన్నావు.. ? నక్సలైట్లను ఏరిపారేసిన ఆ పార్టీ విధానాలు కరెక్టేనని నువ్వు కూడా పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా.. మళ్లీ ఇప్పుడు కొత్తగా నక్సలైట్లు ఉంటే బాగుంటుందనే కామెంట్ వెనుక నీ ఉద్దేశ్యమేమిటి..? అని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఏదో చేద్దామని ఏదో అంటే.. అది రేవంత్ మెడకే ఇలా చుట్టుకుంటున్నది.
