.. బాగుంది.. బహు బాగుంది.. మనం నెంబర్ వన్.. మనం ఆదర్శం..
టీఆరెస్ ప్లీనరీ. ఊహించిందే . వన్‌మ్యాన్ ఆర్మీలా కేసీఆర్ ఒక్కడే దీనికి ఆకర్షణ. ఆయన ప్రసంగమే జీవం. స్వోత్కర్ష ప్రసంగం.. ముందు ఊహించిందే. ఆశావాహ ఉజ్వల ప్రస్థానం కోసం వ్యూహ రచనే ఆయన ఆత్మ విశ్వాసస్థాయికి ఉదాహరణ. మనం బాగున్నాం.. బాగు పడ్డాం.. మనం నెంబర్‌వన్‌గా నిలిచాం. మనం ఆదర్శంగా ఉన్నాం.. ఇవే మాటలు. అంతకు మించి ఏమీ లేవు. తనకలవాటైన దోరణిలో పంచులు లేవు.. ప్రాసలు లేవు.. జరిగింది చెప్పడం.. జరగబోయేది ఊహించి ముందుంచడం. జరిగిందాన్ని గొప్పగా కీర్తించడం.. జరగబోయేదాన్ని మరింత అద్భుతంగా ఊహించడం.. మన పథకాలే దేశం కాపీ కొడుతుందని . దేశమే వెనుకబడ్డది.. మనం ముందున్నామని చెప్పడం.. కేసీఆర్ ఒక్కడికే సాధ్యమయ్యే స్టైల్. ఎవరికీ రాదది. ధీమాతో మాట్లాడుతూనే ఏదో మళ్లీ అభద్రతాభావం. గర్వంతో పొంగిపోతూనే ప్రతిపక్షాల వైఖరిపై ఓ నిరాశ నిస్పృహ. హుందాగా ఉండాలంటూనే.. చిల్లర మల్లరఆలోచనలు చేయొద్దంటూనే ఉచిత సలహాలు. ప్రశ్నించేవారంతా సంకుచిత మనస్కులు ఆయన దృష్టిలో. ఇదే దోరణిలో సాగింది ప్రసంగం..
– హుజురాబాద్ ప్రస్తావన ఇందులో అనవసరం. ఇప్పటికే అనవసర ప్రాధన్యతనిచ్చాడు కేసీఆర్ తన స్థాయి మరిచి.
– కేంద్ర ఎన్నికల సంఘం తన సభను అడ్డుకున్నదన్నాడు. చిల్లర మల్లర ఆలోచనలు చేస్తే గౌరవం పోతుందని సలహా ఇచ్చాడు. అక్కడకు కేసీఆర్ వెళ్లకపోతే గెల్లు గెలవడా..? గెలిచే అవకాశం లేదా..? ఇప్పటి వరకు పెట్టిన శక్తులు సరిపోలేదా..? ఎందుకంత అభద్రతా భావం. లైట్‌గా తీసుకుంటే సరిపోతుంది.
– దళిత బంధు అమలు సాహసం అన్నావు. మరి అన్ని కులాలకూ వస్తుందనే ప్రకటన వెంటనే ఎందుకు? ఈ సాహసికి భయమెందుకు? అన్ని కులాల పేదలకు ఇచ్చే సరికి ఎన్ని ఏండ్లు పడుతుంది..? దీనికో లెక్కాపత్రం ఉందా? ఉత్తగానే మాటలు చెప్పి మభ్యపెట్టడమేనా..?
– రైతుబంధుపై అప్పుడు ఇట్లనే అన్నరు అన్నడు. ఇప్పటికే అది లోపభూయిష్టమే. కాదంటారా?
– ప్రతిపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలే. మీరేమన్న తక్కువ తిన్నారా? దళితబంధు హుజురాబాద్‌లోనే ఎందుకు పైలట్ ప్రాజెక్టయ్యింది…?
-ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత దళితబంధు లాంటి స్కీమ్‌ల గురించి ఆలోచించాం అన్నాడు. ప్రాథమిక అవసరాలన్నీ తీరాయా? పింఛన్లు రెండేండ్ల నుంచి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి..? అంత ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. భర్తలు కోల్పోయిన వితంతువులకు రెండేండ్ల నుంచి ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదు..?
– కేంద్రమే కొనలేని విధంగా వరిసాగవుతుందన్నాడు. మరి కేంద్రం కొంటలేదు కాబట్టి.. యాసంగిలో వరి వేయకండని రైతు మెడపై ఎందుకు కత్తి పెడుతున్నావు…? ఉత్పత్తి గొప్పల ప్రచారానికి. ధాన్యం కొనుగోలు తిప్పల అవస్థలా..? మరెందుకు దాన్ని అంతలా హైప్ చేసి చెప్పుకోవాలి…?
– ఎన్టీఆర్‌తో పోలిక… వీర్వోల తొలగింపుపై. ధరణిలో ఎన్ని లోపాలున్నాయో… కలెక్టర్లకే అంతుపట్టని సమస్యై కూర్చుందో ఏనాడైనా సమీక్ష జరిగిందా…?
– 2028 బడ్జెట్ లెక్కలూ ఇప్పుడే.. అది అతివిశ్వాసం కాకపోతే బాగుండు. ఆత్మ విశ్వాసమే అయితే నేల విడిచి సాము చేయకపోతే ఇంకా బాగుండు.
– హుజురాబాద్ ప్రచారంలోనే మంత్రలు హరీశ్, కొప్పుల, గంగుల ఎందుకున్నారు..? వారికి ప్లీనరీ కంటే అక్కడ ఓ చిన్న ఉప ఎన్నికే ముఖ్యమా..? ఓ బచ్చా అని సంబోధించిన ఈటలపై గెలుపు కోసం ఇంత శ్రబకోర్చాలా..? ఇది మేకపోతు గాంభీర్యం కాదా..?
