గబగబా వనజ వెళ్లిపోతున్నది. ఆటోలో కూర్చున్నది. ఇంజిన్ మోత పెరిగింది. ఆ శబ్దం క్రమంగా నిష్క్రమించింది.
వనజ తనను విడిచి వెళ్లిపోతున్నట్లుగా … శిఖరం అంచు నుంచి అగాధంలోకి … కిందకు పడిపోతున్నట్లుగా తోస్తున్నది రాజారెడ్డికి. ఏదో అందుకోవాలని ఆత్రుతతో లోయలోకి దూకేస్తున్నట్లుగా భావన కలుగుతున్నది.
“ఆమెను నేను కాపాడాలి. నేనే కాపాడాలి.” “కాపాడుతాను.” “వస్తున్నాను.. వస్తున్నాను.”
ఉలిక్కిపాటుతో కలవరిస్తున్నాడు. పెదవులు ఏదో అంటున్నాయి. కానీ మాటలు బయటకు రావడం లేదు. కనురెప్పల కింద కనుగుడ్లు ఇటూ అటూ తిరుగుతున్నాయి. దారితప్పిన కుందేళ్లలా వాటికి ఎటుపోవాలో తెలియడం లేదు.
దిగ్గున లేచాడు. చెమటలతో బనీను తడిచిపోయింది. శరీరం ఐసుముక్కల్లో పడుకోబెట్టినట్లు చల్లగా మారింది. లేచాడు. డోర్ దగ్గరకు వెళ్లి కర్టెన్ తొలగించాడు. ఒక్కసారిగా సూర్య కిరణాలు ముఖం పై పడ్డాయి. వాటిని తట్టుకోవడం ఆ కళ్లకు సాధ్యం కాలేదు. ఒక్కసారిగా కుడిచేతిని అడ్డం పెట్టాడు. వాటి నుంచి తన కళ్లను రక్షించుకోవడానికన్నట్లు. ఆ కళ్లు చీకట్లకు అలవాటుపడ్డాయి. అంధకారమే వాటికి బహు సుందరంగా కనిపిస్తున్నాయి.
చీకట్లతో స్నేహం చేస్తున్న రాజారెడ్డి కళ్లు ఆ వెలుగురేఖలను తమ శత్రువులుగా చూస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకుని పారిపోదామని దారులు వెతుకుతున్నాయి.
కర్టెన్ మూసేసి లోపలకి వచ్చాడు. మసకబారిన నిలువుటద్దం ముందు నిలబడ్డాడు. అతని ముఖం అతనికే భయంకరంగా కనిపిస్తున్నది. నిద్రాహారాలు మానేసిన ప్రభావం…. ఆలోచనలతో సంసారం చేస్తున్న ఫలితం అతని ముందు కనిపిస్తున్నది. కళ్లు గుంతలు పడ్డాయి. వాటిల్లో కళ లేదు. ప్రేతాత్మ కళ కనిపిస్తున్నది. నున్నగా ఉండే చెంపలు కిందకు జారాయి. ఒంటె దవడలా అవి కిందకు వేలాడుతున్నట్లుగా అగుపిస్తున్నాయి. గడ్డం, మీసాలు గుబురుగా పెరిగాయి. పొలంలో కలుపు మొక్కల మాదిరిగా అవి చిందరవందరగా ఉన్నాయి. తెల్లవెంట్రుకలు గుబురుగా ఉన్నాయి. ఆ గుబురులో నల్ల వెంట్రుకలు లెక్కించవచ్చు. అంత తక్కువగా ఉన్నాయవి. ఫిట్టుగా ఉండే బనీను కిందకు వేలాడుతున్నట్లుగా ఉంది. దండేనికి ఉతికి ఆరేసేనట్లే అది శరీరానికి అంటి పెట్టుకొని ఉంది. చేతుల్లో చేవ చచ్చిపోయింది. కండర పటుత్వం పోయి తోలుగా మారి కిందకు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. జుట్టు రేగిపోయి.. పిచ్చుక గూడును తలపిస్తున్నాయి.
అక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా నిలవబుద్ది కాలేదు.
వడివడిగా బయటకు నడిచాడు. ముఖం పై నీళ్లు చల్లుకొని మళ్లీ అర్జెంటు పని ఉన్నట్లు లోపలికి వచ్చేశాడు. స్టూల్ పై చాయ్ పెట్టి ఉంది. దాన్ని అలాగే అందుకొని తాగేశాడు. నాలుకకు ఆ వేడి తెలియలేదు.
శరీరంలో కొంత చలనం వచ్చింది. కొక్కానికి ఉన్న షర్టు, ప్యాంటు తీసుకొని వేసేసుకొని వడివడిగా బయటకు వెళ్లిపోయాడు. నడుస్తూ పోతున్నాడు.
ఎటు వెళ్తున్నాడో తెలియడం లేదు. కాళ్లు వాటంతట అవే వేగంగా పడుతున్నాయి. ఆ కాళ్లకు తెలుసు కాబోలు తను ఎటువెళ్లాలో అనుకున్నాడు.
మూడు కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత పక్కనే కనబడిన ఓ పచ్చిక మైదానం వద్ద ఆగాయి కాళ్లు. అక్కడంతా హడావుడిగా ఉంది. ఉదయమే వాకింగ్ కు వచ్చే వాళ్లతో కిక్కిరిసి ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వారు పడుతున్న తాపత్రయం చూసి నవ్వుకున్నాడు రాజారెడ్డి.
“అవునూ.. వీరికే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉందా? మరి మిగిలినవారు ఇంట్లోనే పడుకున్నారా? వారికి ఆరోగ్యం వద్దా??”
“వాళ్లందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి … ఈ గ్రౌండ్ కు వస్తే… జాతరలా ఉంటుందేమో..? ఇది సరిపోతే
కదా.”
ఆ పరిస్థితిని ఊహించుకుంటున్నాడు.
ఓపక్కగా పచ్చటి గడ్డి మీద కూర్చున్నాడు. ఎక్కువ సేపు కూర్చోలేకపోయాడు. నడుములు సహకరించడం లేదు. అలాగే వెనక్కి ఒరిగాడు. ఇపుడు హాయిగా ఉంది. ఆకాశం వైపు చూస్తున్నాడు. సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు.
అలాగే కళ్లు మూసుకున్నాడు.
మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట ఆటోలో ఇంటి ముందు దిగింది వనజ. ఇంట్లోకి రాకముందే గేటు దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది అనన్య. “అమ్మా …. నాన్న కోసం లక్ష్మి ఆంటీ మూడు సార్లు వచ్చి వెళ్లింది” అన్నది. “నాన్న కోసమా?” కొత్తగా అనిపించింది ఆమెకు. “వస్తే నా కోసం రావాలి. అయినా నేను పొద్దున ఇంట్లో ఉండడని తెలుసు
కదా.”
“ఆయన కోసం ఎందుకు వచ్చింది? ” ఏమర్థంకాలేదు. అలాగే ఆలోచించుకుంటూ లోనికి నడిచింది. తలనొప్పిగా ఉన్నట్లనిపించింది. బయట కాళ్లు చేతులు కడుక్కుని నేరుగా వంటగదిలోకి వెళ్లింది. టీ పెట్టుకోవడానికి. స్టా ముట్టించింది. ఇంతలో అనన్య లోనికి వచ్చింది. చేతిలో ఓ కాగితం ఉంది. అది మడతబెట్టి ఉన్నది. “ఏంటది ?”అన్నట్లుగా చూసింది వనజ.
“లక్ష్మి ఆంటీ ఇచ్చింది. నాన్న కోసం మూడు సార్లు వచ్చి అడిగింది. చివరి సారి వచ్చినప్పుడు ఇది తనకు ఇవ్వమని చేతిలో పెట్టి వెళ్ళింది” అన్నది. ఈ
“నాన్న కు మాత్రమే ఇవ్వమని చెప్పింది” వెళ్లిపోతూ చెప్పింది అనన్య. చేతిలోకి తీసుకున్నది ఆ కాగితాన్ని, “తెరవాలా? ఏముందందులో??” “నాకు తెలియకుండా లక్ష్మి ఏం చెప్పాలనుకుంటున్నది.?” టెన్షన్ గా ఉందామెకు. అనన్య వెళ్లిపోయింది. వణుకుతున్న చేతులతో ఆ కాగితం మడత విప్పింది. లోపలున్న అక్షరాలు చదవుతున్నది. ప్రా.. m..హా..ని… ఉం…ది ప్రాణహాని ఉంది. 6……….5….. 6050 ఒక్కొక్క అక్షరమే వత్తిపలుకుతూ చదివింది. ఒక్కసారిగా ఉలిక్కపడిందామె. “ఏంటీ దీన్ఫిం ? ఎవరికి ప్రాణహాని ఉంది? లక్ష్మికా? రాజారెడ్డికా??” ఏమర్థం కావడం లేదామెకు. శరీరం వణుకుతోంది. “ఈనెంబర్ ఏమిటీ?? ఎక్కడో చూసినట్లుగా ఉందే…”ఆలోచిస్తున్నది. గుర్తొచ్చింది. అది…… రవి “ఆ..టో..నెం..బ……” “అవును. అది ఆటో నెంబరే.”
గాలికి చేతిలో పేపర్ ఎగిరి మండుతున్న స్టా మీద పడింది. అది క్షణంలో కాలి బూడిదై గాలికి లేచిపోయింది. ఆమె మనసు కీడును శంకించింది. లక్ష్మీ రాసి పంపిన లేఖ వనజలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
ప్రాణహాని ఎవరికి ఉందో తెలియదు. అసలు ఏం జరుగుతుందో అంతుచిక్కడం లేదు. “ రవి ఆటో నెంబర్ ఎందుకు రాసింది…? అది రవి ఆటో నెంబరేనా…లేక వేరే ఏదైనా సందేశమా??” “ఈ సందేహాలను నివృత్తి చేసేదెవరు??” ఆలోచనలు సుడులు రేగుతున్నాయి. స్ట్రీ ఆఫ్ చేసేసి నేరుగా లక్ష్మి ఇంటికి బయలుదేరింది వనజ. వడివడిగా అడుగులు పడుతున్నాయి. గుండె వేగం పెరుగుతున్నది. టెన్షన్ క్షణ క్షణం రెట్టింపవుతున్నది. లక్ష్మీ ఇంటికి చేరుకున్నది. గేటు తీసింది. ఎదురుగా డోర్ వేసి ఉంది. ఆ డోర్ కు తాళం వేసి ఉంది. “ఎక్కడికెళ్లింది లక్ష్మి.?” “ఫోన్ చేస్తే…. ?” సెల్ ఇంటి దగ్గర ఉంది. వడివడిగా మళ్లీ ఇంటికి బయలుదేరింది. చెమటలు పడుతున్నాయి ఆమెకు. తన సెల్ ఫోన్ అందుకుని లక్ష్మికి కాల్ చేసింది. ఆమె సెల్ స్విచ్ ఆలో ఉంది.
*****
ఎండ చుర్రుమనిపించేసరికి ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు రాజారెడ్డి.
గ్రౌండ్ ఖాళీగా ఉంది. అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. అతనొక్కడే మిగిలాడు ఏకాకిగా ఆ మైదానంలో. కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి. కానీ తినాలనిపించడం లేదు. ఆకలి కడుపుతో ఉండి…. తన మీద తనే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అంతలా కోపం వస్తుంది అతనికి. అప్పటి వరకు మగతగా ఉన్న మస్తిష్కం మళ్లీ ఆలోచించడం మొదలు పెట్టింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ ఆలోచనల పరంపర ఒక దారితెన్నూ లేకుండా సాగుతోంది. గజిబిజిగా, తికమకగా, గందరగోళంగా, అయోమయంగా…. అస్తవ్యస్తంగా….. ఆ ఆలోచనలు తిరిగి తిరిగి ఒక చోట ఆగాయి.
అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వచ్చి ఆగాయి ఆ ఆలోచనల ప్రకంపనలు. ఏదో లైట్ వెలిగినట్లు, ఓ క్లారిటీ వచ్చినట్లు రాజారెడ్డి ముఖంలో రంగులు మారాయి. స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా దిగ్గున లేచాడు.
ఇంటి దారి పట్టాడు. చుట్టూ ఏమీ కనిపించడం లేదతనికి. ఒకటే దారి. ఇంటికి చేరుకోవాలంతే. వేగంగా నడుస్తున్నాడు. ఆ అడుగులు దూర దూరంగా పడుతున్నాయి. గతంలో అలా ఎప్పుడూ రాజారెడ్డి నడిచి ఉండడు. అంతే వేగంగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఏదో అర్జెంటు పని ఉన్నట్లు….. అక్కడ ఏవో కొంపలు తగులబడి పోతున్నట్లు… వేగంగా, ఆత్రంగా, ఆత్రుతగా… ఆందోళనగా…
చుట్టూ వెళ్తున్న వాహనాలను గమనంలోకి తీసుకోవడం లేదు. ఆ రణగొణధ్వనులు చెవికి చేరడం లేదు. ఎవరో పలుకరిస్తున్నారు. “రెడ్డి ఎటు…. ? కాలి నడకన …” ఎవరో అడుగుతున్నారు.
అవేవి వినిపించుకోవడం లేదు. మరికొందరు ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నారు. చిత్రంగా ఉంది అతని వాలకం. అవేమీ పట్టించుకోవడం లేదతను. ఇంటికి పదిహేను నిమిషాల్లో చేరాల్సినవాడు. ఐదు నిమిషాల్లో చేరాడు. భర్త రాకను చూసి వనజ ఒక్కసారిగా లేచి నిలబడింది. “ఎక్కడికి పోయారు? టిఫిన్ కూడా చేయకుండా?” ఆమె మాటలను లెక్కచేయలేదు. చెవికెక్కించుకోలేదు.
ఇంట్లోకి వెళ్లాడు. తన గదిలోకి ప్రవేశించాడు. ఇంకా తనమీద కోపం పోలేదు కాబోలు అని అనుకున్నది వనజ. లోనికి వెళ్లి అన్నం పెట్టుకుని వద్దామని వంట గదిలోకి వెళ్లింది.

( ఇంకా ఉంది)

You missed