హుజురాబాద్ ఫలితం ఎవరి అంచనాలకూ అందదా..? సర్వేలు కూడా జనం నాడి పట్టలేకపోతున్నాయా? పత్రికలు ఏవీ కనీసం ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని అంచనా వేయలేకపోతున్నాయా?
ఈరోజు ఈటల రాజేందర్ మాట్లాడిన మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. అంతకుమించి తానే గెలవబోతున్నా అనే ధీమా కనిపించింది. ఈ నియోజకవర్గం విలక్షణమైన నియోజవర్గమని.. రూపాయి ఖర్చు చేయకపోయినా.. తనను గుండెల్లో పెట్టుకుని గెలిపించారని గుర్తు చేసుకున్నాడు. ఈటల మాటల దాడిని పెంచాడు. కేసీఆర్పై విమర్శలకు పదును పెట్టాడు. మంత్రిగా గుర్తించకపోయినా.. మనిషిగా గుర్తించాలని కోరుకోవడం తప్పా..? అని కేసీఆర్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేశాడు.
కేబినెట్ మంత్రిగా సీఎం ను ధిక్కరించడం తప్పే అని ఒప్పుకుంటూనే.. పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడానని, తను ప్రజల కోరిక మేరకే పనిచేశానని, మంత్రి పదవిని కూడా లెక్క చేయలేదని చెప్పుకొచ్చాడు. పోయినసారి ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు శత్రువుకు కేసీఆర్ డబ్బులిచ్చాడని మరోసారి గుర్తు చేశాడు. 30 తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టేది కేసీఆర్ ముఖం కాదు… నా ముఖమే అని గట్టిగా నొక్కి చెప్పాడు. ఏందో ఆ ధీమా..? ఈటల మాటల వెనుక మర్మం ఏమిటీ? నిజంగా హుజురాబాద్ ప్రజలు ఇక్కడ విలక్షణమైన తీర్పునివ్వబోతున్నారా?
