యాసంగిలో వరి వేస్తే ఉరే… తాటికాయంత అక్షరాలతో కొద్ది రోజుల క్రితం అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికన వచ్చిన వార్త ఇది. సీఎం అన్నట్టుగా వచ్చింది. ఇదేందీ.. ఇప్పటి వరకు వరే కదా మా ప్రధాన పంట. ఇప్పుడు వెయ్యొద్దంటే ఎలా..? రైతులంతా నోర్లు తెరిచారు. కారణం .. కేంద్రం మీదకు నెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఎఫ్‌సీఐలో సరిపోను బియ్యం నిల్వ ఉండటంతో కొనమని చెప్పిందని బంతిని కేంద్రం కోర్టులో పడేసింది రాష్ట్రం.
వాస్తవంగా సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో వరి సాగును గణనీయంగా తగ్గించాలని పంతంగా తీసుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఆ మధ్యేనే వడ్లను కొనడం ప్రభుత్వం డ్యూటీ కాదని, ఇక కొనబోమని సీఎం చెప్పిన మాటలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో వచ్చిన ప్రతికూల స్పందన చూసి కేసీఆర్ వెనక్కి తగ్గాడు. యథావిధిగా కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కొంటున్నారు. మద్దతు ధర అకౌంట్లో వేస్తున్నారు. ఇదిలా సజావుగా సాగుతున్న తరుణంలో.. కేంద్రం నుంచి బియ్యం తీసుకోమని వచ్చిన ప్రకటన ప్రభుత్వం నెత్తిన పాలు పోసినట్టుగా మారింది. దీంతో కేసీఆర్ ఇక వెనకా ముందు చూసుకోకుండా.. వరి వేస్తే ఉరే అన్నాడు. ప్రాస కూడా బాగా కలిసిందనుకున్నట్టున్నాడు. టైటిల్ అదిరింది. రైతు గుండె చెదిరింది. జీర్ణించుకోలేకపోయారు.
వెంటనే ప్రభుత్వం వ్యవసాయాధికారులను రంగంలో దింపి ఓ పది రోజులు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టింది. వరి వేస్తే ప్రభుత్వం కొనదు కాబట్టి.. ఇతర పంటల వైపు వెళ్లండి.. అని చెప్తూ పోయారు. వాళ్లు వింటున్నారు కానీ.. ఇదెక్కడ సాధ్యమని అక్కడే అధికారులతో వాగ్వాదాలకు దిగారు. కొందరు సైలెంట్‌గా ఉండిపోయారు. మీరు చెప్తూనే ఉంటారు.మేం వేస్తూనే ఉంటాం.. ప్రభుత్వం కొంటూనే ఉంటుంది. వెళ్లండహె.. వెళ్లండి అని మనసులో అనుకుని, నవ్వుకొని వెళ్లిపోయారు.
ప్రభుత్వం చేసిన ఈ వరి వద్దు అనే ప్రచారం ఎక్కడి వరకు పోయిందంటే.. ఈ వానాకాలం పంట ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయదు అనే అపోహ వరకు. కొంటరా..? కొనరా..? అనే అనుమానం మొన్నటి వరకూ ఉండె. తాజాగా ప్రభుత్వం ప్రతీ వడ్ల గింజా మేమే కొంటాం.. అని రొటీన్ డైలాగు ప్రచారంతో మళ్లీ ముందుకొచ్చింది. హమ్మయ్యా..! అని ఊపిరి పీల్చుకున్నారు రైతులు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వరి అనే మాటనే మాట్లాడేందుకు ఇష్టపడని ప్రభుత్వం.. ఈ వానాకాలం పంటను కొంటాం.. అని అంత పెద్దగా ప్రచారం చేయడంతో .. వచ్చే యాసంగీకీ మనకు రంది లేదు.. ప్రభుత్వమే తప్పకుండా కొంటుంది.. మనకు సీఎం గురించి తెల్వదా..? ఇలా ఎన్ని సార్లు చెప్పలేదు. కొనమని అంటాడు.. సీజన్ పూర్తికాగానే ఆయనే కొంటాడు… అని మంచి క్లారిటీ వారిలో వచ్చేసింది ఈ దెబ్బతో.
ఇప్పుడు ఇక్కడ అయోమయంలో కొట్టుకుంటున్నది మాత్రం అధికార యంత్రాంగం.. మొన్నటి వ రకు వరి వెయ్యకండి నాయనా.. అని గడవ పట్టుకుని మరీ చెప్పొచ్చాం కదా.. సర్కారు ఇప్పుడు ఇంత మంచిగా వరి గురించి కొంటాం.. కొంటాం.. అని ఠాం.. ఠాం.. చేస్తున్నది. మరి ఇలా చేస్తే.. యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గుతుందా? ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా..? పది రోజులుగా మేం చేసిన ప్రచారం ఫలిస్తుందా..? అసలేం జరుగుతుంది. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ఎలా అర్థం చేసుకోవాలి..? అని వ్యవసాయాధికారుల జుట్టు పీక్కుంటున్నారట.
ప్రభుత్వానిది మొదటి నుంచీ ఇదే తంతు. సాగునీరు పెరిగింది కాబట్టి వరి విస్తీర్ణం బాగా పెరిగింది. దేశానికి అన్నం పెడ్తున్నాం.. దేశంలో నెంబర్ వన్.. అని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నది. కానీ కొనుగోళ్ల వ్యవహారం మాత్రం ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. విస్తీర్ణం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నాం సరే.. ఎలా కొనాలి..? ఇంత భారం ఎలా మోయాలి..? లోలోపల మాత్రం ప్రభుత్వం తల్లడమల్లడమవుతున్నది.
ఇప్పటి వరకు రైతులకు కొనుగోలు కేంద్రాలు.. కళ్లాల్లోకి వచ్చి కొనుగోళ్లు.. మద్దతు ధర అకౌంట్లో వేయడం.. ఇవన్నీ అలవాటు చేసి.. ఉన్నపళంగా మేం కొనంపో… వేస్తే చస్తారు .. అనే రేంజ్లో మాట్లాడితే రైతులు ఊరుకుంటారా? అందులోనూ కేసీఆర్ మాటలను వాళ్లు విశ్వసించడం మానేశారు. ఆయనే కొంటాడు అనే నమ్మకంతో ఉన్నారు. మొన్న మక్కలు కొనమన్నాడు. కొన్నాడు. వడ్లు కొనం అన్నాడు. కొన్నాడు. ఇప్పుడు కూడా కొనం అంటాడు.. ఏదో మాట వరుసకు. మళ్లీ కొంటాడు. అంతే..