కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంలో అవినీతిపై ఇప్పుడు ప్రభుత్వంలో రచ్చ మొదలైంది. అధికారులు వర్సెస్ రాజకీయ నాయకులు అన్నట్టుగా ఈ వ్యవహారం తయారైంది. మీరంటే మీరు.. లంచగొండులు..అని తిట్టుకునే పరిస్థితులు వచ్చాయి. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టులో స్పష్టంగా తహసీల్దార్లను ప్రధానంగా లంచగొండులుగా చూపారు. ఇప్పుడిదే అసలు వివాదానికి కారణమైంది.
ఎమ్మెల్యేల ఎండార్స్ లేకుండా ముందుకు పోని ఈ పథకంలో అవినీతికి పాల్పడాలనే ఆలోచన తహసీల్దార్లకు గానీ, రెవెన్యూ సిబ్బందికి గానీ ఎందుకు వస్తుందనేది ఉద్యోగుల వాదన. రాజకీయ నాయకులే .. లబ్దిదారులను భయపెట్టేలా మాట్లాడి, అధికారులకు లంచాలివ్వాలని నమ్మబలికి వారి వద్ద నుంచి పదివేల నుంచి 20వేల వరకు వసూలు చేశారనేది వీరి వాదన. లీడర్లు, కార్యకర్తలు చేసిన ఈ అవినీతిలో మమ్మల్ని చేర్చి బద్నాం చేయడమేందని సీఎస్ సోమేశ్ కుమార్ వద్ద రెవెన్యూ ఎంప్లాయిస్ తమ ఆవేదనను వెలిబుచ్చారు.
ఇందులో లంచాలు ఆశించి ఎవరూ ఎంక్వైరీ చేయలేదని, ఉన్నదున్నట్టుగానే చేసి పంపామనేది వీరి వాదన. కానీ లీడర్లు, కార్యకర్తలే లబ్దిదారుల వద్ద నుంచి వసూలు చేసి తమ పేరును వాడుకున్నారని, దీనిపై ప్రభుత్వం కూడా తమనే దోషులుగా చూడడం సరికాదనేది వీరి అభిప్రాయంగా సీఎస్ ముందుంచారు. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు, ఎంక్వైరీ చేయడంతో తమ ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు సీఎం కేసీఆర్ దీనిపై సీరియస్గా ఉన్నాడు.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం ఇలా లంచావతారుల చేతిలో పడి అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కఠినంగా ముందకు పోతేనే చక్కదిద్దొచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఇటు ప్రభుత్వం కఠినంగా ఉండటం.. అటు రెవెన్యూ ఉద్యోగుల తమను అనవసరంగా బలి చేస్తున్నారనే మనోవేదినలో ఉండటం.. ఇద్దరి మధ్య మరింత అగాథాన్ని పెంచనుంది.
