గడ్డం పెరిగినట్లుంది. రూపంలో తేడా వచ్చింది. ముఖం కళ తప్పింది. అతడు నవ్వి ఎన్ని రోజులైందో అన్నట్టుగా విషాదం గూడుకట్టుకొని ఉంది ఆ ముఖంలో.
జాలేసింది శ్రీధర్ కు. “ఈ మీడియా గోల వదిలెయ్ రెడ్డీ. వేరే ఏదైనా పనిచేసుకో రాదు.” మళ్లీ లక్ష్మి గుర్తొచ్చింది రాజారెడ్డికి. “నువ్వో చేతకానోడివి.”
“నువ్వో పనికిమాలినోడివి.” “నువ్వో నపుంసకుడివి” ఎదురుగా ఆమె నిలబడి తిడుతున్నదనిపిస్తుందతనికి. “ఇల్లు చక్కదిద్దుకోలేనోడివి… నువ్వేం మగాడివిరా….” ముఖం మీద ఉమ్మేసినట్లుగా “థూ” అని ఆమె తిడుతున్నది తన ఎదురుగా నిలబడి. ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు.
శ్రీధర్ అన్నీ గమనిస్తున్నాడు. మందు తాగుతున్నాడు తప్ప రాజారెడ్డి మధ్యలో ఏమీ తినడం లేదు. గతంలో ఇలా ఎప్పడూ చేయలేదు.
ఈ రోజు మనిషే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడతనికి. – ఇలాగే ఉంటే ఇక చేతికి రాడేమో అనే అనుమానం వచ్చింది శ్రీధర్ కు. “రెడ్డి… నువ్వు ఎక్కువ తాగకు. నీ ఆరోగ్యం మంచిగా లేదు.” గతంలో జరిగిన అనుభవం గుర్తొచ్చి భయపడ్డాడు శ్రీధర్. “నువ్వొక పనిచెయ్” అన్నాడు మళ్లీ. “ఏంటి” అన్నట్లుగా చూశాడు రాజారెడ్డి. « ‘చీకటి’ పత్రికలో రిపోర్టర్ గా పనిచెయ్యి. దాంట్లో ఏమీ ఇవ్వరు.
కానీ నీకు ఏదో ఒక దాంట్లో పనిచేస్తున్నావనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఖాళీగా ఉండకుండా …” అన్నాడు.
‘చీకటి….. బ్రతుకే చీకటైంది. ఇక దేంట్లో చేస్తే ఏంటి అనుకున్నాడు రాజారెడ్డి. సరే అన్నట్లు తల ఊపాడు.
“నేను మాట్లాడుతాను. రేపటి నుంచి నువ్వు వెళ్లు.”అన్నాడు. ఇక ఆలస్యం చేయకు అన్నట్లుగా ఉన్నాయి అతని మాటలు.
సరే అని తలూపాడు.
“ఏ పత్రికలో చేసిన వచ్చేదేమీ లేదు. నీవు పనిచేస్తున్నావనడానికి మాత్రం ఇది పనికి వస్తుంది” అన్నాడు శ్రీధర్ మళ్లీ
“కానీ దీంతోనే టైం పాస్ చేయకు. గతంలో లాగ సమయం వృథా చేసుకోకు. వేరేది కూడా ఏదైనా ఆలోచించు. నాలుగు డబ్బులు సంపాదించే మార్గం వెతుక్కో” అన్నాడు.
“ఇంట్లో మనం సంపాదించడం లేదని తెలిస్తే మర్యాద ఇవ్వరు రెడ్డి” అన్నాడు శ్రీధర్. ఇంతకు ముందు తను అడిగిన ‘భార్య మర్యాద ఇవ్వడం లేదెందుకు?” అన్న ప్రశ్నకు ఇప్పుడు కరె సమాధానమిస్తున్నట్లుగా .
“రిపోర్టర్ గా చేస్తున్నామని మనం గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తాయి రెడ్డి. ఇంట్లో కుండలు కొట్లాడుతుంటే …. బయట ఆ పనికి రాని మర్యాద మనకవసరమా?”
కడుపులో ఉన్నదంతా కక్కేస్తున్నాడు శ్రీధర్. “నాకు తెలుసులో వోయ్…. నీవూ నీతి సూత్రాలు మొదలు పెట్టావా?” రాజారెడ్డి మాటలు మత్తుగా వస్తున్నాయి. “వీడింతే ..” అనుకున్నాడు మనసులో. “నేనింత మందికి సహాయం చేశాను కదా. ఈ పరిస్థితుల్లో ఎవడన్నా నా గురించి ఆలోచిస్తున్నాడా?” “ఛీ ఛీ విశ్వాసం లేని కుక్కలు …” తిట్టుకున్నాడు రాజారెడ్డి. శ్రీధర్ కు కోపం వస్తున్నది. “నువ్వు చేసింది అపాత్రదానం రెడ్డి” అన్నాడు.
ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్ వంక రాజారెడ్డి.
“అవును. ఎవడో వచ్చి నీకో వెయ్యి అడుగుతాడు. వాడెలాంటోడో? వాడి అవసరమేమిటో నువ్వు ఆలోచించవు. నీ జేబులో పైసలుంటే చాలు వెయ్యి అడిగితే రెండు వేలిస్తావు” అన్నాడు.
ఇగో హర్టయ్యింది రాజారెడ్డికి.
“అంటే సహాయం చేయడం కూడా పాపమేనా?” అన్నాడు. అవమానంగా ఉంది అతనికి. చేసిన మేలుకు గుర్తింపు రాకపోగా చులకనగా చేసి మాట్లాడటంతో.
“ఆ డక్కన్ నాగరాజు గాడి గురించి తెలియని వాడుండడు. పొద్దున లేస్తే తాగుతాడు. ఇంట్లో బాధలు వాడికి పట్టవు. అలాంటోడికి నువ్వు ఎన్ని సార్లు సాయం చేశావో తెలుసా?” అన్నాడు.
ముఖం అటు తిప్పుకున్నాడు. ఏం మాట్లాడలేదు.
“అయినా నీ పరిస్థితే బాగలేదు కదా రెడ్డీ. ముగ్గురు పిల్లలు, వారికి ఫీజులు, ఇంట్లో ఖర్చులు… నీకొచ్చేది ఎప్పుడో ఓ నాడు గొర్రెతోక బెత్తెడు అన్నట్లు ఎటూ సరిపోని ఆ లైన్ అకౌంట్…… ”
శ్రీధర్ మాటలు శూలాల్లా గుచ్చుతున్నాయి. “అయినా నువ్వు ఒకరికి సహాయం చేసే స్థాయిలో ఉన్నావా? చెప్పు నిజంగా??” నిలదీసినట్లుగానే ఉంది ఆ ప్రశ్న. “అప్పట్నుంచి కూడా…” జోడించాడు మళ్లీ ఆ ప్రశ్నకు కొనసాగింపుగా శ్రీధర్.
“నిజంగా అవసరమున్నవాడికి సహాయం అందలేదు. పనికిమాలిన వెధవలు నీ బలహీనతను ఆసరా చేసుకొని నీ దగ్గర డబ్బులు గుంజారు” అన్నాడు. అసలు నిజం చెప్పినట్లుగా.
“వాళ్లు నిన్నేమనుకుంటారో తెలుసా ?” ఏమంటాడోనని భయంగా చూస్తున్నాడు రాజారెడ్డి. “వెర్రి వెంగళప్ప అని అనుకుంటారు” అన్నాడు శ్రీధర్. గుండెలో కలుక్కుమన్నది అతనికి. . ఇచ్చిన కోటింగ్ చాలనుకున్నాడు…. “సరే మరి వెల్దామా?” అన్నాడు. లేచి నిలబడ్డాడు. శ్రీధర్ కూడా లేచాడు బలవంతంగా. అవమాన భారంతో. బండి స్టార్ట్ అయ్యింది.
రాత్రి పూట చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ వాతావరణానికి మనసు పులకించడం లేదు రాజారెడ్డికి. భగభగ మండుతున్నది. లోపల పడ్డ లిక్కర్ పేగులను కరకర కొరికేస్తున్నదేమో… చుర చుర మని నొప్పిగా అనిపిస్తున్నది.
డొక్కలు కొట్టుకుంటున్నాయి. కడుపులో ఏమీ లేకపోవడంతో నీరసంగా ఉంది. మత్తు దాన్ని కనిపించకుండా చేస్తున్నది.
నీరసం, మైకం.. ఎవరిది పై చేయి అని కొట్లాడుతున్నాయి. “రేపట్నుంచి వెళ్తావు కదా?” మళ్లీ అడిగాడు శ్రీధర్. “ఊ…..” కొద్ది సేపటి తర్వాత అన్నాడు “ఆ పరమేశ్ గాడ్ని తుక్కు తుక్కు తన్నాలి శ్రీధర్” బండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ తో ఆపాడు శ్రీధర్.
ఒక్కసారిగా అలా అనేసరికి భయమేసింది శ్రీధరకు. అసలే కంట్రోల్ లేడు. ఏమేమో ఆలోచనలు వస్తున్నాయో అని అనుకున్నాడు.
“ఇప్పుడు వాడి గోల ఎందుకు?” “గణేశ్ కు వాడి ఇంట్లో వాళ్లకు కరోనా వచ్చి .. వాడు మొన్నటి వరకు నరకం చూశాడా?” ‘చెప్పు’ అన్నట్లుగా ఆగాడు. “అవును” అన్నాడు శ్రీధర్. “టార్గెట్లు చేయలేదని, వాడిని పక్కన పెట్టేశారంట”అన్నాడు. “ఇదెంత దుర్మార్గం” అన్నాడు రాజారెడ్డి. చెప్పు దీనికి ఏం శిక్ష వేయాలని వాడికి అన్నట్లుగా ఆగాడు. “ఇందులో పనిచేస్తూ న్యాయం, ధర్మం, దుర్మార్గం ఇవన్నీ చూడొద్దు రెడ్డీ. నీకింకా తత్వం బోధపడలె.” అన్నాడు. “అసలు వాడు మనిషేనా.. కరోనా వచ్చిందనే సానుభూతి కూడా ఉండదా?” “చస్తేనే పట్టించుకోరు రెడ్డి. ఇపుడు ఈ కరోనా ఓ లెక్కా” అన్నాడు లైట్ గా. తను చెప్పిన దాన్ని చాలా ఈజీగా తీసుకోవడం రాజారెడ్డికి నచ్చలేదు. “నువ్వూ మనిషివి కాదు అయితే” అన్నాడు
ఏం మాట్లాడలేదు శ్రీధర్. బండి స్టార్ట్ చేస్తూ… . “నువ్వు వాడ్ని కొడతా.. వీడ్ని తంతా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు” అన్నాడు.
“నేను తన్నకున్నా వాడిని ఎవడో ఒక్కడు కచ్చితంగా తంతాడు శ్రీధర్… ఇది పక్కా” అన్నాడు. “ఎవడి సంగతి మనకెందుకు?” అన్నాడు. శ్రీధర్ వీపుపై రాజారెడ్డి తలవాల్చేశాడు. నీరసం పై మత్తే పై చేయి సాధించింది. అరగంటలో ఇల్లు చేరుకున్నారు. అప్పటి వరకు వారిని అనుసరిస్తున్న ఆగంతకుడు బైక్ మలుపుకొని వెళ్ళిపోయాడు. “నువ్వు ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.” “అందుకే రేపట్నుంచి ఆ “ చీకటి’ పత్రికలో వార్తలు రాయి” అన్నాడు. తల ఊపాడు. “కొన్ని రోజుల పాటు నీ ఖర్చులకు నేను డబ్బులు సమకూరుస్తాను” అన్నాడు. ఆ మాటకు తలెత్తి చూశాడు రాజారెడ్డి. ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ కనబడటం లేదు. “మళ్లీ ఇద్దువులే తర్వాత” అన్నాడు. జేబులో నుంచి వెయ్యి రూపాయలు తీసి రాజారెడ్డి జేబులో పెట్టాడు. వారించలేదు. వారించాలని వున్నా శరీరం సహకరించడం లేదు. “ఇక వెళ్తాను” అని బైక్ స్టార్ట్ చేశాడు. కానీ వెళ్లలేదు. అలాగే నిలబడి ఉన్నాడు. బైక్ రేస్ చేస్తున్నాడు. ‘రయ్ రయ్’ అని అంటున్నదది. “ఇక వెళ్లు” అన్నాడు. “నేను వెళ్తాను నువ్వు వెళ్లు శ్రీధర్” అన్నాడు.
“సరే… కానీ నువ్వు నాకొక మాటివ్వాలి….” ఏంటి అన్నట్లు చూశాడు రాజారెడ్డి. కొత్తగా మాటివ్వు అనడం అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. “నరసింహంలా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడనని మాటివ్వు” శ్రీధర్ ఒక్కసారిగా అలా అనడంతో అవాక్కయ్యాడు రాజారెడ్డి. వైరాగ్యం నిండిన నవ్వొకటి నవ్వాడు. “లేదు” అన్నట్లుగా శ్రీధర్ చేతిలో చెయ్యి వేశాడు. సంతోషించాడు శ్రీధర్. ” సరే మరి నేను వెళ్తాను” అన్నాడు. “సరే” అన్నట్లుగా తలూపాడు రాజారెడ్డి. బైక్ ఆ వీధి చివరకు వెళ్లే వరకు అలాగే చూస్తుండిపోయాడు.
బయట బాత్రూంలో కాళ్లు చేతులు కడుకున్నాడు. ముఖం పై చల్లని నీళ్లు చిలకరించుకోగానే ప్రాణం లేచొచ్చినట్లయ్యింది.
కాళ్లీడ్చుకుంటూ లోపలికి వెళ్లాడు. ఇళ్లంతా నిశ్శబ్దంగా ఉంది. “అప్పుడే పడుకున్నారా?” అని మనసులో అనుకుంటూ లోనికి అడుగుపెట్టాడు.
లోపల తన గదిలో అన్నం వడ్డించి పెట్టారు ఓ స్టూల్ పై ప్లేట్లో, పప్పు చారు, పూదీనా చట్నీ, ఆలుగడ్డ ఫ్రై, మామిడికాయ తొక్కు పెరుగు… అన్నంలో ఓ పాపడ.
“హెటల్ లో ఫుల్ మీలకు ఆర్డర్ ఇచ్చానా?” అన్నట్లుగా ఉందక్కడ. ఆశ్చర్యపోయాడు రాజారెడ్డి. ఎంతకాలమైంది ఇలాంటి భోజనం తిని. “ఏంటీ ఈ రోజు స్పెషల్ ? ” ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. పొద్దున లక్ష్మీ ఇచ్చిన డబ్బులు .. భార్యకు ఇవ్వడమే దీనికి కారణం అని తెలుసుకున్నాడు చివరికి.
ఆకలవుతున్నది. ఆవురావురమంటూ తినేశాడు. ఆఖరికి పెరుగు కలుపుకున్నాడు. పుల్లగా ఉన్నా రుచిగానే అనిపించింది.
బ్రేవ్ మన్నాడు. ఆ స్టూల్ ను దూరంగా జరిపి అలాగే బెడ్ పై వాలాడు. కళ్లు మగతగా మూసుకుంటున్నాయి. “ఏమన్నాడు శ్రీధర్? నేను నరసింహంలా ఆత్మహత్య చేసుకుంటానా?” “ఛీ ఛీ ఎంత తక్కువ అంచనా వేశాడు తనను. ? నాకు ఆత్మహత్య చేసుకునేంత ఆగత్యమేమి పట్టింది.” ఆ ఆలోచన రాగనే మనసంతా చికాకనిపించింది. “వాడో పిరికిపంద. పెళ్లాం చేతిలో కీలుబొమ్మ. సంసార సాగరం ఈదటం చాతగాని దద్దమ్మా.” “అందుకే అందులో మునిగి చనిపోయాడు.” అని అనుకున్నాడు. “కానీ నేనలా కాదు. భార్యను కంట్రోల్ లో పెట్టుకోగలను. పిల్లలను గదమాయించగలను.” “నా కంటి చూపులతో ఇంటిల్లిపాదిని నియంత్రించగలను.” “అదీ నా కెపాసిటీ.. కానీ శ్రీధర్ అలా అన్నాడేమిటీ?” “ఆత్మహత్యా?” “అసలు ఆత్మహత్య ఎలా చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు??” “పిరికివెధవలు.”
“చనిపోవాలనే ఆలోచన ఎలా వస్తుందబ్బా వీరికి. బతకడానికి కూడా భయపడే చచ్చువెధవులు వాస్తవంగా బతకడానికి అర్హులు కాదు.
అందుకే నరసింహం చావడం సబబే” అని అనుకున్నాడు. “వానిదీ ఓ బతుకేనా? అభ్యుదయభావాలు పైగా వాడికి.” “చావాల్సిందే వాడు.
కానీ నేను చావను. చచ్చినా చావను. చావనంటే చావను. చావనే చావను. ఛీ దీనమ్మ అంతా చావుగోల.” అని అనుకున్నాడు. “చచ్చి ఏం సాధించావురా? ఒరేయ్ నరసింహం..!” “ఉన్న ఇద్దరు పిల్లలను అనాథ చేశావు.
పెండ్లాం చేత రోజు తిట్లు తినే బాధ మాత్రం తప్పిందిరా నీకు” అనుకున్నాడు.

(ఇంకా ఉంది)