“లేదు…. ఇంకా ఏమీ అనుకోలేదు. వేరే చానల్ లో ట్రై చేస్తున్నాను. వారంలో ఉద్యోగం వస్తుంది” అన్నాడు రాజారెడ్డి. ఇంకా వేరే టాపికకు అవకాశం ఇవ్వకుండా.
“మీకదే కరెక్టు సర్……” “మీ పేరు చెప్పుకొని మేం చాలా పనులు చేపించుకోవాలి. మీరున్నారంటే మాకదో ధైర్యం..” అన్నాడు విఠల్.
రాజారెడ్డి కళ్లు మెరిశాయి. ‘అబ్బ… ఇదిరా విశ్వాసం అంటే. “ అని అనుకున్నాడు. ‘వీడికి ఎప్పుడో నేను ఉపయోగపడి ఉంటాను. అందుకే గుర్తుపెట్టుకున్నాడు. తన సత్తా ఏంటో వీడికి తెలుసున్నమాట’
“ఈ ఆడముండలకు ఏం తెలుసు?” అని వాళ్లను తిట్టుకున్నాడు.
“అయినా నేనెంత మందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాను. బయటకు వెళ్లి నా గురించి అడిగితే కథలు కథలుగా చెప్పుకుంటారు.’ అని తన గురింతా తాను గర్వంగా ఫీలయ్యాడు.
‘నేను ఎంత నిజాయితీగా పని చేశానో ఈ ఆడంగులకు తెలుస్తుందా ?” మళ్లీ తిట్టుకున్నాడు.
‘ఓ ఇసుక వ్యాపారి ఇరవై వేలు ఇస్తానన్న తీసుకోలేదు తెలుసా?” అని గుర్తు చేసుకున్నాడు సందర్భం వచ్చింది కదా అని.
‘ఆ ఇరవై వేలు ఇచ్చినప్పుడు తీసుకుంటే అయిపోతుండే. అనవసరంగా వదిలేశాను.’అని మళ్లీ తనే తర్వాత బాధపడ్డ విషయం కూడా గుర్తొచ్చింది అతనికి.
ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అవన్నీ వీరికి చెప్పి తనెంత గొప్పవాడో తెలియజెప్పాలని ఉంది అతనికి. కానీ ఓపిక లేదు.
“నేను వెళ్తాను మరి” అని చెప్పి గబగబా బయటకు నడిచాడు రాజారెడ్డి. ఇంకా అక్కడ క్షణం కూడా నిలబడదల్చుకోలేదు.
వడివడిగా నడుస్తుంటే లుంగీలో నోట్లు అటూ ఇటూ కదులుతున్నాయి. అవి కదులుతుంటే రాజారెడ్డి చాతి ఓ రెండు ఇంచులు పైకి ఉబ్బింది. ఆ డబ్బులేవో తన కష్టార్జితమైనట్లు, అప్పటికప్పుడు తను సంపాదించినట్లూ ఫీలవుతున్నాడు. ఉత్సాహం వచ్చింది. అదే జోష్ తో ఇంటికి చేరుకున్నాడు.
ఇంట్లోకి వెళ్లి చూశాడు. పిల్లలు లేరు. పక్కింట్లోకి వెళ్లినట్లున్నారు. ఉద్యోగం ఊడినప్పటి నుంచి అతను ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో పిల్లలు ఇంట్లో ఉండాలంటేనే భయపడుతున్నారు.
లోపలికి రాగానే భార్య వైపు చూశాడు. ఆమె ఏదో పని చేసుకుంటున్నది.
భార్యను చూడగానే అప్పటివరకు ఉన్న ఉత్సాహం స్థానం లో భరించలేని కోపం వచ్చి చేరింది. తనను చూసి కూడా చూడనట్లు పనిలో లీనమైపోయినట్లుగా నటిస్తుందని గ్రహించాడు రాజారెడ్డి. “చీ చీ ఎంత మోసగత్తె ఇది. చూస్తే ఎంత అమాయకంగా ఉంది.” ‘ఆ ఆటోరవి గాడితో….. చీ చీ” అని తిట్టుకున్నాడు. ముఖం చూడాలనిపించలేదు.
“అసలు లక్ష్మి నిజమే చెప్పిందా?? నన్ను బాధపెట్టేందుకు కావాలని అబద్దమాడిందా??” మళ్లీ అనుమానం వచ్చింది.
ఎలా తెలుసుకోవడం?? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఆలోచిస్తున్నాడు. “రంకు, బొంకు దాగవంటారు. ఇదే నిజమైతే ఎన్నాళ్లు దాగుతుందో నేను చూస్తాను..” అని అనుకున్నాడు.
అతని ముఖంలో రంగులు మారాయి. కోపంతో చేతులు వణుకుతున్నాయి. ఫ్యాన్ కిందే నిలబడ్డా నుదిటికి చెమటలు దారలా కారుతున్నాయి.
ఏమిచెయ్యలో ఓ స్థిరాభిప్రాయనికి వచ్చాడు.
అతనిలో దాగున్న క్రిమినల్ మైండ్ మేల్కొంటున్నది. ఇంతలోనే భార్య అన్నది… “ఏమైంది గ్యా స్…? వంట చేయాలా? వద్దా?” ఆమె ఇంకా ఏదో అనబోయింది. విసరుగా లుంగీలోంచి డబ్బులు తీసి ఆమె ముందు విసిరేశాడు కోపంగా.
ఆమె చాటలో బియ్యం పోసుకొని మెరిగలు ఏరుతున్నది. ఆ బియ్యంలో పడ్డాయి నోట్లు. అంత డబ్బు ముంగిట వచ్చి పడేసరికి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూసింది వనజ. “ఎక్కడివి?” అని కూడా అడగలేదు. గబగబా వాటిని తీసుకుంటున్నది. అది గమనించిన రాజారెడ్డి … “ఎక్కడ నుంచి తెచ్చారని కూడా అడగడం లేదు ఇది..” అనుకున్నాడు. “అంటే … ఎక్కడ్నుంచైనా తీసుకురా… నాకైతే డబ్బులు కావాలె అన్నట్లుగా ఉంది దీని వ్యవహారం.” “చీ చీ కట్టుకున్న మొగుడంటే పట్టింపు లేదు కానీ.. పైకం వస్తే లోకం తెలియదన్నమాట…” తిట్టుకున్నాడు.
వెంటనే తేరుకొని .. “ఉన్నవన్నీ అది తీసుకుంటే నాకు మరి” అని అనుకున్నాడు.
ఒక్క అంగలో భార్య వద్దకు చేరుకొని కింద ఉన్ననోట్లలో నాలుగు ఐదొందల నోట్లను ఏరుకున్నాడు. వాటిని తీసుకొని గోడ కొయ్యకు తగిలించిన అంగీ జేబులో పెట్టుకున్నాడు.
“ఆ ఫీజులు, కరెంటు బిల్లు, గ్యాస్.. ఇవన్నీ ఇక నన్నడగకు.” అన్నాడు. ముఖం అటు తిప్పుకుని. “చిల్లర చిల్లర పనులన్నీ నాకు చెప్పకు… నన్నుచిల్లర చేయకు” అన్నాడు మళ్లీ. ఓ సారి భార్య వనజ కూరగాయలు తెమ్మంటే తీసుకొచ్చాడు. అన్నీ పుచ్చులే తెచ్చావని తనను ఎగతాళి చేసి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి.
“ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలి… ఇంట్లో పని లేకుండా కూర్చున్నందుకు మరీ చులకనైపోయాను” అని అనుకున్నాడు.
“ఏం చెయ్యా లి??” ఏమీ అర్థం కావడం లేదు రాజారెడ్డికి.
“ఈ నరకకూపం లాంటి ఇంటి నుంచి బయటకు పోతే తప్ప ఆలోచనలు రావు…” అని గబగబా వెళ్లి షర్టు, ప్యాంటు వేసుకొని బయటకు నడిచాడు. బైక్ దగ్గరకు పోగానే అందులో పెట్రోల్ అయిపోయిన విషయం గుర్తొచ్చి ఒక్క తన్ను తన్నాడు ముందు టైర్ ను. దాని మెడలు ఇటునుంచి అటు తిరిగాయి ఆ తన్నుకు.
నడుచుకుంటూ చౌరస్తా వరకు వెళ్లాడు. శ్రీధర్ గుర్తొచ్చాడు. ఫోన్ చేశాడు.
వెయిట్ చేస్తున్నాడు రాజారెడ్డి.
రాజారెడ్డి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మరుక్షణం నుంచే ఓ బైక్ పై ఆగంతకుడొకడు అతన్ని ఫాలో అవుతున్నాడు. ఆ విషయం రాజారెడ్డికి తెలియదు.
*****
పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు శ్రీధర్. కొంచెం నీతో మాట్లాడాలి అన్నాడు రాజారెడ్డి.
అర్థం చేసుకున్నాడు. వెనుక కూర్చున్నాడు రాజారెడ్డి. అర కిలోమీటర్ దూరంలో ఉన్న వైన్స్ దగ్గరకు రాగానే బైక్ ఆపాడు. జేబులో నుంచి ఐదొందలు తీసి శ్రీధర్ కిచ్చాడు రాజారెడ్డి. వద్దనలేదు తను. తీసుకొని వైన్స్ కు వెళ్లి కవర్లో మందు తీసుకొని వచ్చాడు. ట్యాంక్ కవర్లో పెట్టాడు. కిక్ కొట్టాడు. బైక్ స్పీడ్ గా వెళోంది.
ఆగంతకుడి బైక్ కూడా వీరికి తెలియకుండా ఫాలో అవుతూ వస్తోంది.
ట్రాఫిక్ రణగొణ ధ్వనులు తగ్గుతున్నాయి. శివారులోని ఓ ఏకాంత ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఆపాడు బైక్. వేప చెట్టు గుబురుగా జుట్టు విరబోసుకొని ఉన్నట్లుగా ఉంది. అక్కడికి ఎన్నోసార్లు తను వచ్చాడు. ” అప్పుడు ఆనందంలో.. ఇప్పుడు జీవితం మీద విరక్తితో” అని అనుకున్నాడు. ఇంత లోనే ఎంత తేడా?
” ఏనాడైనా అనుకున్నానా తనకు ఈ పరిస్థితులు దాపురిస్తాయని?” “ఇంట్లో ప్రశాంతత కరువై… కనీసం మర్యాద కూడా లేక….” “ఆపై వినకూడని విషయాలు.. పడరాని మాటలు..” “ఎంతబతుకాయే రా” చెప్పులు విడిచి వాటి పైనే కూర్చున్నాడు శ్రీధర్. రమ్మన్నట్లు రాజారెడ్డిని కళ్లతో సైగ చేశాడు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. లోపల నుంచి మందు తీసి పెగ్ కలుపుతున్నాడు శ్రీధర్. “నువ్వూ నపుంసకుడివే నా దృష్టిలో..” లక్ష్మీ మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి. “ఆటో డ్రైవర్తో నీ పెళ్లాం…..”
గ్లాసులో అలా మందు పోశాడో లేదో గటగటా తాగేశాడు ఆపకుండా. నోరెళ్లబెట్టి చూశాడు శ్రీధర్.
వెంటనే మళ్లీ ఓ గ్లాసు నింపాడు. కూల్ రెడ్డి.. ఎందుకంత ఆగం.. పొయ్యి చేసేదేముంది?” “మనకేమన్నా పనా పాటనా?”
అతను క్యాజువల్ గానే అన్నా… “పనా? పాటనా?” మాటలు తనను అవమానించినట్లుగానే అన్నాడని అనుకున్నాడు రాజారెడ్డి.
తననుద్దేశించి వెటకారంగా మాట్లాడిన శ్రీధర్ వంక కోపంగా చూశాడు. “ఉద్యోగం కావాలె…. అర్జంటుగా” అన్నాడు. “పిచ్చెక్కిపోతుంది” నెత్తికి చేతులు పెట్టి జుట్టు పీక్కున్నట్లుగా అన్నాడు. అర్థమయ్యింది శ్రీధర్ కు. “కొత్తగా ‘ఏబీ’ టీవీ అని వస్తున్నది. చేస్తావా?” అన్నాడు. “కానీ జీతం ఇవ్వరు. మనమే నెలకింత అని వాడికి ఇవ్వాలి” అన్నాడు. “అయినా నీతో అది సాధ్యం కాదులే” మళ్లీ తనే సమాధానమిచ్చాడు. రాజారెడ్డి మౌనంగా ఉన్నాడు. రెండో పెగ్గూ ఖాళీ అయ్యింది.
“అదంత కాదు కానీ.. నేనొక్కటి అడుగుతా .. నిజం చెప్పు” అన్నాడు రాజారెడ్డి. ఒక్కసారిగా అలా అనేసరికి | ఏదో సీరియస్ మ్యాటర్ అయి వుంటుందనుకొని “ ఓకే’ అన్నాడు.
“నేను గెలిచానా? ఓడానా?” “ఇదేం ప్రశ్న.. వీడికి మతిపోలేదు కదా.” అనుకొని
“ఎందుకోడుతాప్ రెడ్డీ?” అన్నాడు శ్రీధర్. “గెలిచావు” అని మాత్రం అనలేకపోయాడు. అతని మనసొప్పలేదు అలా అనడానికి.
“సమాజంలో నాకు మంచి పేరుందా? లేదా?” “ఎందుకు లేదు? ” అన్నాడు మళ్లీ. “నీ బోడి పేరెవడికి కావాల్రా” మనసులో అనుకున్నాడు. “అందరూ నన్ను గౌరవిస్తారా? లేదా?” “ఎందుకివ్వరు?” “ఇవేం ప్రశ్నలురా వెధవ. ఉద్యోగం ఊడి ఉన్న మతిపోయినట్లుంది వీడికి.” “సీనియర్ జర్నలిస్టుగా నన్ను సమాజం గుర్తించిందా లేదా?” “గుర్తించింది. గుర్తించింది.” అసహనంగా ఉంది శ్రీధర్ కు. “అంటే నేను సక్సెస్ అయినట్లేగా??” “అయినట్లే” అందామనుకున్నాడు.
కానీ అనలేకపోయాడు శ్రీధర్. “వీడు సక్సెస్ కావడమేంటీ బోడీ?”అని అనుకున్నాడు మనసులో. “చెప్పవేం శ్రీధర్?” వదిలేలా లేడే వీడు. “అయినట్లేనా అంటే.. . అయినట్లే” అన్నాడు నసిగినట్లుగా. “ఏం క్లారిటీగా చెప్పడం లేదు. నీకేమైనా అనుమానామా?” నీళ్లు నమిలాడు శ్రీధర్. “వీడికి పైత్యం ముదిరినట్లుంది. మందులో మంచింగ్ కు నా మెదడు తినేలా ఉన్నాడు వీడు ఈరోజు.” “నువ్వంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది రెడ్డీ” అన్నాడు. తప్పేలా లేదని. “మరి నాకొక్కడూ ఫోన్ చేయడం లేదెందుకు?” “ఇప్పుడేం చెప్పాలి? వీడికి సంతృప్తినిచ్చే ఆన్సర్ ఏదీ? ఏం చెప్పను.?” “ఆఖరికి నువ్వు కూడా చేయట్లేదు” అన్నాడు మళ్లీ . “అమ్మా.. ఇరికించాడురా? ఏదో చెప్పాలి. లేదంటే నేను బుక్ అయిపోతాను.” “చాలా సార్లు చేశాను రెడ్డీ. నీ ఫోన్ కలవలేదు.” ఆ అబద్దం అతికినట్లు లేదని తనకే అనిపించింది.
“అయినా నీకు పదే పదే ఫోన్ చేస్తే బాధపడతావేమో అనే ఫీలింగ్ నాకుంది” అన్నాడు. ఈ ఆన్సర్ కరెక్ట్ అని అనుకున్నాడు.
“వేరే వాళ్లు కనీసం పలకరించడం లేదు” ఆకాశంలోకి చూస్తున్నాడతను. “ఎందుకు పలకరిస్తార్రా వెధవ? ఎవరి బతుకులు వారివి. ఎవడి తిప్పలు వాడివి.” అనుకున్నాడు.
“రేపు వాళ్ల పరిస్థితీ అంతే రెడ్డి… ఆ వెధవలకు ఇప్పుడు తెలియదంతే” అన్నాడు శ్రీధర్. మూడో పెగ్గు రెడీ అయ్యింది. సగం బాటిల్ ఖాళీ అయ్యింది. ఒక్కసిప్ తాగి గ్లాసు కింద పెట్టాడు. “డబ్బులు సంపాదిస్తేనే సమాజంలో గుర్తింపుంటుందా?” “లేదు. సంపాదనే కొలమానం కాదు.” పొడిగానే సమాధానమిచ్చాడు శ్రీధర్. “మరి నేను డబ్బులు సంపాదించలేదు . కానీ పేరు సంపాదించాను కదా?” “నువ్వేమీ సంపాదించలేదురా నాయన..” మనసులో అనుకొని తలపట్టుకున్నాడు శ్రీధర్. “సంపాదించావు. సంపాదించావు.” “మరి నా ఇంట్లో నాకు కనీసం గౌరవం ఎందుకు లేదు శ్రీధర్.?” మనసులోని మాట బయటపెట్టాడు రాజారెడ్డి. ” నన్నెందుకు ఇలా ఇరకాటంలో పెడుతున్నావురా.. నాయనా” అనుకొని “ఇంట్లో వాళ్లకేం తెలుసు రెడ్డీ. వాళ్లు బావిలో కప్పలు. వాళ్లకదే ప్రపంచం.” ఈ ఆన్సర్ అతని ముఖంలో కొంచెం సంతోషాన్ని తెచ్చి పెట్టింది. “అంతే కదా..!” మళ్లీ ఒకసారి ఆ ఆన్సర్ వినాలనుకున్నాడు. కానీ శ్రీధర్ కు చెప్పే ఓపిక లేదు. “అంటే నేను మొత్తానికి సక్సెస్ అయినట్లే కదా?” “ఎందుకు నీకు అనుమానం?” అన్నాడు శ్రీధర్ ‘అరేయ్ నన్ను వదిలెయ్ రా బాబు ‘ అనుకున్నాడు. “మేథావులు పెండ్లి చేసుకొని ఎటూ కాకుండా పోతారు కదా శ్రీధర్?” “నువ్వో మేధావివి మరి. వెధవ” “మాట్లాడవేం” “ఏం మాట్లాడాలో ఏమో. తాగింది దిగిపోతున్నది ఇక్కడ.” “నాకెక్కడికన్నా దూరంగా పారిపోవాలని ఉంది శ్రీధర్.” “నన్ను గుర్తించే సమాజం కోసం వెతుక్కుంటూ పోవాలని ఉంది” మళ్లీ అన్నాడు. నాలుగో పెగ్గు భయపడుతూనే పోశాడు. “చీకటి పడుతుంది త్వరగా వెళ్లాం రెడ్డీ. వర్షం పడే చాయలు కూడా కనిపిస్తున్నాయి.” టాపిక్ మార్చాడు. ఆ మాటలు వినలేదు. కానీ మందు మాత్రం తాగేశాడు.
కళ్లు ఎర్రగా మారాయి. తైల సంస్కారం లేని జుట్టు అటూ ఇటూ ఊగుతున్నాయి… రాజారెడ్డి చంచల ఆలోచనల్లా.
గడ్డం పెరిగినట్లుంది. రూపంలో తేడా వచ్చింది. ముఖం కళ తప్పింది. అతడు నవ్వి ఎన్ని రోజులైందో అన్నట్టుగా విషాదం గూడుకట్టుకొని ఉంది ఆ ముఖంలో.
( ఇంకా ఉంది)

You missed