అప్పుడే ఇంటి బయట బైక్ ఆగిన చప్పుడు వచ్చింది. “ఎవరా?” అని చూశాడు. విజయ్. తమాయించుకొని కూర్చున్నాడు. లోపలికి వచ్చిన విజయ్ “హాయ్” అని పలకరించాడు.
“ఎలా ఉన్నావు రెడ్డి ?” అని అడిగాడు. ముఖాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. అప్పటికే ఆలోచనలతో సమతమవుతున్న రాజారెడ్డి ముఖం పీక్కుపోయి ఉంది. అది గమనించాడు విజయ్.
“ఏందీ అలా ఉన్నావు? ఆరోగ్యం కుదుటపడలేదా?” అడిగాడు అనుమానంగా ముఖం పెడుతూ.
నేల చూపులు చూస్తున్నాడు రాజారెడ్డి. “షుగర్ అటాక్ అయిందానికి బాధపడుతున్నావా? “మళ్లీ అడిగాడు విజయ్. అదే అనుకొని
“ఏం బాధపడకు. అది ఈ రోజుల్లో కామన్ అయింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ” సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
పెద్దమ్మాయి గ్లాసులో నీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది విజయ్ కు. విజయ్ అనన్యను పలకరించాడు. అనన్య కూడా బదులుగా పలకరించింది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో.
రాజారెడ్డి ఇంకా నేల చూపులే చూస్తున్నాడు.
పరమేశ్ నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని చెప్పాడు నేల చూపులు చూస్తూనే. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన విజయ్.. వెంటనే తేరుకొని “దానికి ఎవరో చచ్చిపోయినట్లు అలా ముఖం పెట్టావెందుకు? అందరి ఉద్యోగాలు ఊడుతున్నాయి కదా” అన్నాడు. ఈ ఓసారి విజయ్ ముఖంలోకి చూశాడు రాజారెడ్డి. మళ్లీ తల పక్కకు తిప్పుకున్నాడు.
“ కానీ నీ ఆరోగ్యం బాగాలేకపోయినా కనీసం కనికరం లేకుండా తీసేశారు అంతే. వాళ్లకు టార్గెట్లు ముఖ్యం |… అందుకే నిన్ను టార్గెట్ చేశారు” అన్నాడు.
అయినా రాజారెడ్డి ముభావంగానే ఉండటం చూసి ……. “మన శేరిలింగంపల్లి రిపోర్టర్ ప్రణయ్ తెలుసు కదా?” అడిగి ఆగి రాజారెడ్డి ముఖంలోకి చూశాడు.
“అవును తెలుసు” అన్నట్లు కళ్లతోనే సమాధానమిచ్చాడు రాజారెడ్డి. “టార్గెట్లు రీచ్ కావడం కోసం ఓ బిల్డర్ దగ్గరకు పోయి ఇస్తావా చస్తావా అనే రేంజ్ లో అడిగాడట” అన్నాడు. ఆసక్తిగా విజయ్ ఏం చెప్తాడోనని అతన్నే చూస్తున్నాడు రాజారెడ్డి.
“ఆ బిల్డర్ మీ పత్రిక ఎండీకి చుట్టమట. ఇంకేముంది. వెంటనే ప్రణయ్ ను ఉద్యోగంలోంచి పీకేశారు.” అన్నాడు.
ఏం మాట్లాడటం లేదు రాజారెడ్డి. ఆ తర్వాత ఏమైంది అన్నట్టుగా ముఖం పెట్టాడు.
“అప్పటికే ప్రణయ్ కు కరోనా వచ్చింది. ఇంటిల్లిపాది కరోనా బారిన పడ్డారు. అయినా వదల్లేదు మనోళ్లు. నువ్వు చస్తే మాకేంది అన్నట్టుగా ఉద్యోగం దీసి రోడ్డున పడేసినంత పనిచేశారు ఆ కుటుంబాన్ని” చెప్తున్నాడు విజయ్. ఉప్మా చేసుకొని రెండు ప్లేట్లలో తీసుకొచ్చి ఇచ్చింది అనన్య.
ఆకలితో ఉన్న రాజారెడ్డి దాన్నందుకుని ఆవురావురమని తిన్నాడు. అది ఏ మాత్రం రుచిగా లేదు. ‘అనన్య చేసినట్లుంది’ అనుకున్నాడు. “ఏమాటకామాట చెప్పుకోవాలి. వనజ వంటలు సూపర్ గా చేస్తుంది” అనుకున్నాడు.
తినడం ముగించి ప్లేట్ పక్కన పెట్టేశాడు రాజారెడ్డి. విజయ్ స్పూ తో కొద్దికొద్దిగా తింటూ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ లు చూస్తున్నాడు.
“ఏమైంది తర్వాత?” ఉండబట్టలేక అడిగాడు రాజారెడ్డి.
“ఏమైతది? పజ్రాయ్ కు చిర్రెత్తుకొచ్చింది. పదేండ్లు పని చేపించుకొని టార్గెట్లన్నీ చేసినా ఇపుడు ఈ కారణంగా మేనేజ్మెంట్ తీసేసిందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.” అని చెప్పడం ఆపి ప్లేట్ ను పక్కన పెట్టాడు.
ఫేస్ బుక్కులో తన ఆవేదనను వెల్లగక్కాడు. “ఇన్ని రోజులు చేసిందానికి తగిన శాస్తి చేశారని” చెప్పకనే చెప్పాడు అన్నాడు.
“కరోనా వచ్చినా కనుకరించని మేనేజ్ మెంట్ కు వందనాలు” తెలిపాడు.
ఫేసుబుక్ లో అతను పెట్టిన పోస్టులను చూపించాడు రాజారెడ్డి కి విజయ్. అవన్నీ ఆసక్తిగా చదివాడు రాజారెడ్డి. “తనే ఓ కొత్త దుకాణం.. అదే చానల్ పెట్టుకుంటానని ప్రకటించాడు.” చెప్పడం ఆపాడు విజయ్. ధీర్ఘంగా నిట్టూర్చాడు రాజారెడ్డి. నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు.
” టార్గెట్లు పూర్తి చేయాలంటే బెదిరిస్తారు మరి. ఇంతకు ముందు అలా చేసే కదా మేనేజ్ మెంట్ కు దోచిపెట్టింది… అది తెల్వదా ఎండీ సాబ్ కు?” అన్నాడు విజయ్ కసిగా.
“ఎవరినైనా దోచుకోవచ్చు కానీ, వాడి బ్యాక్ గ్రౌండ్ ఏందో తెలుసుకొని దోచుకోవాలన్నమాట.” అన్నాడు మళ్లీ వెటకారంగా విజయ్.
“టార్గెట్లు పెట్టినప్పుడే మీరేమన్నా చేసుకోండి.. మాకు కావాల్సింది దోచి పెట్టండి అని వారు చెప్పకనే చెప్పినట్లు కదా రెడీ. మరి ప్రణయ్ చేసింది నేరమెలా అవుతుంది?” అన్నాడు.
మైండ్ బ్లాంక్ అయిపోయింది రాజారెడ్డికి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తన భవిష్యత్తు ఏమిటో తెలియక గుండె దడ పెరుగుతున్నది. చల్లగా చెమటలు పడుతున్నాయి.
“ఇదంతా ఎందుకు? మీరేమన్నా చేసుకోండి. ఏమన్నా రాసుకోండి. మీకు పేపర్ అప్పగిస్తున్నాం. నెలకు మాకింతకప్పం కట్టండి అని చెప్పేస్తే అయిపోతుంది కదా” అన్నాడు మళ్లీ విజయ్.
“చతికిలపడ్డ పేపర్లు… తెలుగోడిప్రభ, ఇయ్యాల్టి వార్త, సూర్య వెలుగు….. ఇవన్నీ అట్లనే చేస్తున్నాయి కదా.” అన్నాడు.
“ఈ సమయంలో ఇలాంటి టార్గెట్లు పెట్టిన ఈ పేపరూ నైతికంగా చతికిలబడిందనుకో..” అన్నాడు మళ్లీ విజయ్. రాజారెడ్డి పేపర్ ‘స్వరాష్ట్రం’ పత్రికనుద్దేశించి.
“నా పరిస్థితేందీ?” అన్నాడు రాజారెడ్డి. “వేరే పనేమైనా చూసుకో” అన్నాడు విజయ్. అది సాధ్యం కాదని అతనికి తెలుసు. “ఎమ్మెల్యే బాగారెడ్డి దగ్గరకు పోయి అడగనా… ?” అన్నాడు రాజారెడ్డి. తెరిపార ఓ సారి రాజారెడ్డి ముఖం చూసి… “ఇపుడు పోతే నిన్ను పట్టించుకుంటాడా?” అన్నాడు విజయ్.
“నాతో మంచిగానే ఉంటాడు” అన్నాడు ఏదో ఆశగా. “సరే ఒకసారి వెళ్లి కలువు ” అని లేచి నిలబడ్డాడు. ఇక నేను వెళ్తా అన్నట్లు చూశాడు.
“ఉండు నేను కూడా వస్తా. బాగారెడ్డి ఇంటి దగ్గర దింపి వెళ్లు” అన్నాడు. తన బైక్ లో పెట్రోల్ అయిపోయిన విషయం గుర్తుకువచ్చి. “సరే నడువు” అన్నాడు.
గబగబా ముఖం మీద నీళ్లు చల్లుకొని గోడకు తగిలించి ఉన్న అంగీ, ప్యాంటు వేసుకున్నాడు. తలను చేతితోనే దువ్వుకున్నాడు. తైలసంస్కారం లేని ఆ జుట్టు వినడం లేదు. మళ్లీ కొయ్యల్లాగా ఎక్కడివక్కడ లేచి నిలిబడి పైకి చూస్తున్నాయి. అదేమీ పట్టించుకోలేదు రాజారెడ్డి. విజయ్ వెనుక నడిచాడు.
బండి స్టార్ట్ చేయగానే వెనుక కూర్చున్నాడు. చల్లగా గాలి ఒంటికి తగిలేసరికి అప్పటి వరకు ఉన్న నీరసం ‘ఉఫ్’ మని ఊదేసినట్లుగా వెళ్లిపోయింది. కొంత ఉత్సాహం వచ్చింది.
“ఏదో ఒకటి చేయాలి. మళ్లీ అదే జాబ్ లో కొనసాగాలి.” “బాగారెడ్డితో చెప్పించుకోవాలి” , రాజారెడ్డి ఆలోచనలు బైక్ కన్నా వేగంగా పరిగెత్తుతున్నాయి.
గాలిలో దూసుకుపోతున్నది బైక్. వాతావరణం చల్లగా మారింది. ఎక్కడో వర్షం పడుతున్నట్లున్నది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద చినుకులు టప్ టప్ మని వారి శరీరాన్ని తాకుతున్నాయి.
“వేరే ఏదైనా పనిచేసుకో రెడ్డి.. ఎవర్నెందుకు బతిమాలుడు?” అన్నాడు విజయ్. రాజారెడ్డి మౌనంగా ఉన్నాడు. అతని మనసు అక్కడ లేదు. ఏమోమో ఆలోచిస్తున్నాడు.
అంతలో లోకల్ ఎమ్మెల్యే ఇల్లు రానే వచ్చింది. గేటు బయట అంతా నిర్మానుష్యంగా ఉంది. ‘లోపల ఎమ్మెల్యే లేనట్లున్నాడు” అన్నట్టుగా చూశాడు రాజారెడ్డి వైపు విజయ్.
‘మామాలు సమయంలోనే ఆయన ఇంటికి ఎవరినీ రానీయ్యడు. ఇపుడు కరోనా టైం ఇంకెవరు వస్తారు?” అనుకున్నాడు రాజారెడ్డి.
“లోపలుంటాడు నేను వెళ్లి చూసొస్తాను” అన్నాడు. “ లోపలికి రా’ అన్నాడు విజయ్ ను . ” నేను రాను నువ్వు వెళ్లు” అన్నాడు విజయ్.
ఎమ్మెల్యేకు గేటు బయట నుంచే ఫోన్ చేశాడు రాజారెడ్డి. ఆయన లిఫ్టు చేయడం లేదు. గేటు దగ్గరకు పోయి లోనికి తొంగి చూశాడు సందు గుండా. లోపలి నుంచి సెక్యూరిటీ వచ్చాడు. రాజారెడ్డిని గుర్తు పట్టాడు. “సర్ లోపలే ఉన్నాడు. ఒక సారి ఫోన్ చేయండి” అన్నాడు.
ఎమ్మెల్యే అనుమతి లేనిదే లోనికి ఎవరినీ పంపించరు. ”నేను చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు” అన్నాడు రాజారెడ్డి.
“ఇక్కడే ఉండండి లోపలికి వెళ్లి అడిగి వస్తాను” అన్నాడు. తప్పదన్నట్లు సరే అన్నాడు రాజారెడ్డి.
పది నిమిషాలు. పదిహేను నిమిషాలు….
అరగంట. ‘కొంపదీసి నా ఉద్యోగం ఊడిందని ఎమ్మెల్యే కు తెలిసిందా ఏందీ?” డౌటొచ్చింది రాజారెడ్డికి. ‘తెలిసుండదు’ అని మళ్ళీ సర్దిచెప్పుకున్నాడు.
నలభై నిమిషాలు….
“థూ దీనెమ్మ జీవితం. నన్నే ఇంత సేపు గేటు బయట నిలబెట్టాడు. ఇక సామాన్య ప్రజలొస్తే వారిని కలవనిస్తాడా?” అనుకున్నాడు రాజారెడ్డి.
“ఓట్ల సమయంలో ఇంటింటికి తిరుగుతారు. వారి పిల్లల ముడ్లు కడుగుతారు. ఇపుడు గెలిచినంక ఇట్ల గేట్లేసుకొని కుక్కల్లా బయటే ఉంచుతారు” అనుకున్నాడు. రాజారెడ్డికి కోపం పెరుగుతున్నది.
‘తన దాక వస్తే’ అన్నట్లుగా ఇపుడు తనను వెయిట్ చేయించడంతో ఎమ్మెల్యేను కసితీరా తిట్టుకుంటున్నాడు.
గంట ఐదు నిమిషాలు……
సెక్యూరిటీ వచ్చాడు. ” సార్ ఏంటి పని అని అడగమన్నాడు.” అన్నాడు. “ కలిసి మాట్లాడేదుంది” అన్నాడు రాజారెడ్డి. తనకు అవమానకరంగా ఉంది. ‘ఇంత సేపు బయట వెయిట్ చేపించి. ఇపుడు మళ్లీ ఏమిటని ఆరా తీస్తాడా? వెధవసన్నాసిగాడు. ..” మనసులో తిట్టుకున్నాడు.
మళ్లీ ఐదు నిమిషాల తర్వాత సెక్యూరిటీ వచ్చాడు. ” క్యాంపు ఆఫీసుకు రమ్మన్నాడు. అక్కడికే వస్తాడంట.” అన్నాడు.
(ఇంకా ఉంది)
