పత్రికల్లో యాడ్స్ పేరుతో వేధింపులు ఈ రోజు కొత్తవి కావు. ఇవి ఇప్పట్లో ఆగేవీ కావు. కానీ కరోనా వల్ల మార్కెట్లో పైసా పుట్టని పరిస్థతుల్లో ఈ టార్గెట్లు రిపోర్టర్ల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త సీనియర్ రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. జర్నలిస్టు సంఘాలు మెల్లగా ఇప్పుడు నిద్రలేస్తున్నాయి. కొందరు యూనియన్ నేతలు ఈ రోజు వార్త ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు.. ఇప్పుడే లోపాలన్నీ గుర్తొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నేతలు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ, ఈ సంఘటనతోనైనా చాలా నిజాలు బయటకొస్తున్నాయి. అవే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. మీడియా ఎంత రొచ్చులో ఉందో, జర్నలిజం ముసుగులో మేనేజ్మెంట్ దందాలు ఎలా ఉన్నాయో మన యూనియన్ నేతలో లైన్లో నిలబడి ఇప్పుడు వివరించి చెబుతున్నారు.
–ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రవీణ్ గౌడ్ చనిపోయినా.. ఇంకా మౌన మేలా అని ప్రశ్నించారు. వెంటనే రాజీనామ చేయ్ అని కూడా డిమాండ్ చేశారు. ఎంతకాలం ఇలా భయపడి మౌనంగా ఉంటావని నిలదీశారు. ఇదిప్పుడు చర్చకు దారి తీసింది
– వార్త పేరుతో ప్రభుత్వం నుంచి ఎన్నో భూములు పొందారు. అవన్నీ ఎంప్లాయిస్ను చూసే కదా ఇచ్చింది. మరి ఎంప్లాయిసే లేరు. బోర్డే తిప్పేసినప్పుడు ప్రభుత్వ భూములు ఎందుకు వాపస్ ఇవ్వరు…? ఇవి అన్ని పత్రికలకూ వర్తిస్తుంది.
– జిల్లాల్లో ప్రాంఛైజీల పేరుతో అమ్మేసుకుంటున్నారు. నెలకు ఎవడెన్ని డబ్బులు ఎక్కువ కట్టి తీసుకుంటాడో వాడిని అధికారాలిస్తారు. వాడు స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుని వారికి నెలకింత కచ్చితంగా యాడ్స్ రూపంలో ఇవ్వాలని టార్గెట్లు పెడతాడు. ఇవ్వకపోతే ఊడబెరుకుతానని బెదిరిస్తాడు.
– అక్రిడేషన్ కార్డుకు 20వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అది ఉంటేనే మాకు గుర్తింపు అనే దోరణిలో విలేకరులు అదే లోకంలో బతికి,దాని కోసం అడ్డమైన దారులు తొక్కేందుకు, అడిగిన మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
– వార్త మేనేజ్మెంట్ పత్రిక నిర్వహణ పేరుతో వందల కోట్ల రుణాలు బ్యాంకుల్లో తీసుకుంది. అవి చెల్లించలేదు. ఇదిప్పడు బ్యాంకు డీఫాల్డర్ సంస్థ. మరి దీనికి ఎలాంటి అధికారం ఉంది పత్రికను రన్ చయడానికి..?
– వార్త ఎండీ గౌవవ్ సంఘీ.. రిపోర్టర్ల రక్తం పీల్చే జలగ. అవును.. అతడే కాదు.. అన్ని పత్రికల్లో ఎడిటర్లు, మేనేజ్మెంట్లు కూడా ఇట్లనే ఉన్నారు. వారి గురించి మాట్లాడరు.
– యూనియన్ నేతలు అడిగే ప్రశ్నలు, నిలదీతలు వాస్తవమే. కానీ ఇవెప్పుడో జరగాల్సింది. అలా జరగవు. ఎందుకంటే యూనియన్ నేతలకూ వారి అవసరాలు వారికుంటాయి. వారి అవసరాలు వారికుంటాయి. ఇప్పుడు వార్త పత్రికది ఒడిసిన ముచ్చట. కాబట్టి ఇలా బయటకు వచ్చి బాహాటంగా జబ్బలు చరిచి అడుగుతున్నారు. అదే మొన్నటికి మొన్న.. ఈనాడు నుంచి మొదలుకొని నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కరోనా వేళ ఉద్యోగులను పీకేశారు కదా.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఈ నేతలంతా ఎక్కడున్నారు..?